చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కోంటూరు వద్ద 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఫిష్ మార్కెట్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 200 మంది మత్స్యకారులకు నూతన సభ్యత్వ కార్డులను అందజేశారు. అంతకు ముందు మెదక్ జిల్లా కలెక్టరేట్ వద్ద 6 గురు లబ్ది దారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహించాలి…గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మత్స్యకారులు పూర్తిగా నిరాదరణకు గురయ్యారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ రకాల వాహనాలు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా మత్స్యకారులు చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లను కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు ఆదాయ మార్గాలను పెంచాలనే ఆలోచనతో మహిళా మత్స్యకారులకు చేపల వంటకాలపై ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
లక్ష మంది మత్స్యకారులకు సోసైటీలలో సభ్యత్వం
మృగశిర కార్తె సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి ప్రజలకు వివిధ రకాల చేపల వంటకాలను అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీ ఎత్తున పెరిగిందని, ప్రభుత్వ ఫలాలు అర్హులైన ప్రతి మత్స్యకారుడికి అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అందుకోసం నూతనంగా లక్ష మంది మత్స్యకారులకు సోసైటీలలో సభ్యత్వాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. స్థానిక మత్స్యకారుల సౌకర్యార్ధం కోల్డ్ స్టోరేజ్ ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మంత్రిని కోరగా, చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.