అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్‌కు బతికున్నప్పుడే పిండం పెట్టింది రేవంతే అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కరెంటు మీద తన వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ కావడం తో పీసీసీ అధ్యక్షుడు అసహనం తో మాట్లాడుతున్నారు. ఇష్టారీతిన మాట్లాడితే హీరో అవుతాను అనుకుంటున్నాడు. ఆయన భాషను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ ను పొరుగు రాష్ట్రం ప్రజలు సైతం మెచ్చుకుంటున్నారు. వీర తెలంగాణ వాదిని తానే అని పీసీసీ అధ్యక్షుడు తనకు తాను చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ పై సిద్ధాంతాల మీద పోరాడాలి ..వ్యక్తిగత ద్వేషంతో కాదన్నారు. రెండు కళ్ల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చిన చంద్రబాబు వెంట నడిచిన రేవంత్ తెలంగాణ న్యాయాన్ని సమర్ధించలేదు. రేవంత్ తన సవాళ్లపై గతం లో వెనక్కి పోయారు. ఇపుడు ఆయన తాజాగా విసిరే సవాళ్లకు అర్థం లేదన్నారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్న రేవంత్ మాట ఎందుకు తప్పారని ప్రశ్నించారు. అలాంటి రేవంత్ ను ఎవరు నమ్ముతారు. అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ కు బతికున్నప్పుడే పిండం పెట్టింది రేవంతే ఇంకా వేరే వాళ్లకు పిండం పెట్టడం గురించి దేవుడెరుగు అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గురించి పోరాడ లేదని విచిత్రంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ లో ఈ రోజు విద్యుత్ డిమాండ్ గత సంవత్సరం ఇదే రోజు కన్నా దాదాపు రెండు రెట్లు ఎక్కువ. ఇది కేసీఆర్ చేసిన అభివృద్ధి కాదా అనడిగారు. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు గా ఉన్న వాడికి సంయమనం ఉండాలన్నారు. ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటే కుదరదని తెలిపారు. ఒక్కో సారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేనికైనా దారి తీయవచ్చు ..జాగ్రత్త అన్నారు.
కేసీఆర్ ఎంత సంయమనం పాటిస్తే తెలంగాణ వచ్చేదా? మీ తిట్ల ట్రాప్ లో పడే అంతటి అమాయకులం కాదన్నారు. గీత దాటుతున్నప్పుడు హెచ్చరించడం మా బాధ్యత… తెలంగాణ సమాజం గుర్తెరిగి తీర్పు ఇవ్వాలన్నారు.