mt_logo

2022-23 నాటికి 238 లక్షల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

శాసనమండలిలో సభ్యులు జీవన్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డిలు పంటల బీమా, తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ విస్తీర్ణంపై అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తెలంగాణ వడ్లు కొనమంటే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరించి ససేమిరా అన్నారు. సాక్ష్యాత్తూ  ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రి వర్గం ఢిల్లీలో దీక్ష చేసినా దిగిరాలేదు. దేశంలో మూడేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఆరు నెలలు తిరగకుండానే ఇప్పుడు దేశంలో బియ్యం కొరత అంటూ ఎగుమతులు నిలిపివేశారు. దేశంలో అత్యధిక శాతం మంది ఆధారపడ్డ ప్రధాన రంగం వ్యవసాయం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం లేదన్నారు. దేశంలో పంటల సాగు, ప్రజల అవసరాలు వంటి అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రకృతి విపత్తులొస్తే కేంద్రం పంట నష్టపోయిన రైతుల కోసం  పైసా విదల్చలేదు. విపత్తు సమయాలలో కేంద్రం స్పందిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. 

హైదరాబాద్ వర్షాలు వచ్చి నష్టపోయినా కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. కానీ అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు రూ.151 కోట్లు పంపిణీ చేశాం .. మిగిలిన వారికి కూడా సహాయం అందిస్తాం.  ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ పాటు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లు ఫసల్ బీమా అమలు చేసిందని తెలిపారు. ప్రభుత్వం బీమా సంస్థలకు రూ.2415 కోట్లు ప్రీమియం చెల్లిస్తే తిరిగి రైతులకు దక్కిన పరిహారం రూ.1893 కోట్లు మాత్రమే.  రూ.522 కోట్లు బీమా సంస్థలు లబ్ధి పొందడం గమనార్హం.  వ్యవసాయరంగంలో భీమా కోసం కేంద్రం చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. తెలంగాణలో రైతులకు ప్రయోజనం ఉండే ఒక కొత్త బీమా పథకం అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు నడుస్తున్నది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వరకే ఈ దిశగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పథకాలు పరిశీలించాలని ఆదేశించారు. తెలంగాణలో పంట మార్పిడి వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం. మార్కెట్లో నూనె గింజలు, పప్పుగింజలకు డిమాండ్ ఉన్నది.  ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గతంలో 40 వేల ఎకరాలు మాత్రమే సాగులో ఉండగా నూతనంగా 86 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగింది. ఈ సీజన్ లో 20 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం పూర్తయింది. అది నిరంతరం కొనసాగిస్తాం. ఈ ఏడాది లక్ష్యం 2.32 లక్షల ఎకరాల పంటలమార్పిడిపై రైతులను చైతన్యం చేసేందుకు నిరంతరం రైతువేదికలలో రైతులకు శిక్షణ  నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. 2014 – 15 కు ముందు ఏడాదిలో 131.24 లక్షల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2022 – 23 నాటికి 107 లక్షల ఎకరాలు పెరిగి 238 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.  రైతు బంధు కింద ప్రతి సీజన్ కు దాదాపు 65 లక్షల మందికి రైతుబంధు పథకం అమలవుతుందని గుర్తు చేసారు.