mt_logo

ఇంగ్లాండ్, అమెరికాలో విజయవంతంగా ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన – 42,000 మందికి ఉద్యోగావకాశాలు

42 వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
30కి పైగా కంపెనీల సీఈఓలతో సమావేశం
టైర్-2 నగరాల్లో ఐటీ కంపెనీల విస్తరణకు అవకాశం
హైదరాబాద్ బయట ఐటీని విస్తరించాలనుకుంటున్న ప్రభుత్వ విజన్‌ కు పలు ప్రఖ్యాత కంపెనీలు మద్ధతు

తెలంగాణకు పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు చేపట్టిన ఇంగ్లాండ్, అమెరికా దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు వారాల ఈ పర్యటనలో వివిధ కంపెనీల యాజమాన్యాలతో 80 కి పైగా సమావేశాలు, ఐదు రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు రెండు కాన్ఫరెన్స్ లలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. స్టార్టప్ స్టేట్ గా తొమ్మిదేళ్లలోనే ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపించాయి. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో భాగం అయ్యేందుకు సంతోషంగా ముందుకువచ్చాయి. మంత్రి కేటీఆర్ తో సమావేశాల తరువాత తెలంగాణలో తమ పెట్టబడి, విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. వివిధ రంగాల్లో రాబోయే ఈ పెట్టుబడులతో రానున్న కాలంలో తెలంగాణలో సుమారు 42 వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి.


ఈ పర్యటన సందర్భంగా ఇంగ్లాండ్ లోని లండన్, అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, హ్యూస్టన్, హెండర్సన్, బోస్టన్‌లలో 80కి పైగా సమావేశాలకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు, మీడియా,ఎంటర్ టైన్ మెంట్, ఏరో స్పెస్, రక్షణ, లైఫ్ సైన్సెస్, మెడికల్ డివైజెస్, డిజిటల్ సొల్యూషన్స్, ఇన్నోవేషన్&డేటా సెంటర్, ఆటోమోటివ్, ఈవీ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీలను కేటీఆర్ ఒప్పించారు.
అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పెట్టుబడులకు తెలంగాణే గమ్యస్థానం అన్న సంగతి కేటీఆర్ పర్యటనతో మరోసారి రుజువైంది. వినోద రంగంలో అగ్రగామి సంస్థ ఐన వార్నర్ బ్రదర్స్- డిస్కవరీ, హెల్త్ కేర్ టెక్నాలజీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్ ట్రానిక్, ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడుల సంస్థ స్టేట్ స్ట్రీట్, బైన్ క్యాపిటల్ కు చెందిన వీఎక్స్ ఐ గ్లోబల్ సొల్యూషన్స్ తో పాటు లండన్ స్టాక్ ఎక్సేంజ్ గ్రూప్ కంపెనీలు తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగం అయ్యేందుకు ముందుకొచ్చాయి.

వీటితో పాటు క్రీడా పోటీల లైవ్ స్ట్రీమింగ్‌లో నెంబర్ వన్ అయిన DAZN, ఇంధన రంగంలో దిగ్గజ కంపెనీ అయిన టెక్నిప్ ఎఫ్.ఎం.సీ, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సంస్థ అలియంట్ గ్రూప్, స్టెమ్ సెల్ థెరపీలో స్పెషలిస్ట్ అయిన స్టెమ్ క్యూర్స్, జాప్ కాం గ్రూప్ లు కూడా తెలంగాణలో తమ పెట్టుబడి, విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. ఈ కంపెనీల పెట్టుబడి ప్రకటనలతో 42,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

ఓ వైపు వ్యాపార, వాణిజ్య సంస్థలతో సమావేశాలకు హాజరవుతూనే మరోవైపు తెలంగాణ విజయగాథను మంత్రి కేటీఆర్ వినిపించారు. మే 12న లండన్ లో జరిగిన ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సుకు హాజరైన కేటీఆర్, తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. ఇండియా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే తెలంగాణ మోడల్ ను అనుసరించాలన్నారు. ఇక మే 22 న అమెరికా నెవాడాలోని హెండర్సన్‌లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహించిన ప్రపంచ పర్యావరణ మరియు జలవనరుల కాంగ్రెస్‌లో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల విజయగాథను అమెరికన్ ఇంజనీర్లకు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అమెరికన్ సివిల్ ఇంజనీర్ల సంఘం ప్రకటించిన ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్ అండ్ పార్టనర్‌షిప్’ అవార్డును అందుకున్నారు.

యూకే, యుఎస్ పర్యటనలో మంత్రి కేటీఆర్ ఐదు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. లండన్‌లోని భారత హైకమిషనర్‌ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అద్భుతమైన ప్రగతి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, హైదరాబాద్‌లో ఉన్న అద్బుత ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ పై ప్రసంగించారు. న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ సంయుక్తంగా న్యూయార్క్‌లో నిర్వహించిన పెట్టుబడిదారుల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే అంతర్జాతీయ సంస్థలకు తెలంగాణ గేట్‌వే గా ఉందన్నారు కేటీఆర్.

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్న కేటీఆర్, ఆయా రంగాల్లో తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అసాధారణ వృద్ధిని వివరించారు. అమెరికన్ ఏరోస్పేస్, డిఫెన్స్ కార్పొరేషన్‌లకు పెట్టుబడి గమ్యస్థానంగా హైదరాబాద్ ఎలా మారిందో చెప్పారు. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ (AHA),సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) నిర్వహించిన రౌండ్ టేబుల్‌ సమావేశాల్లో కూడా మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

హైదరాబాద్ ఆవల ఐటీని విస్తరించాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ విజన్‌ కు పలు ప్రఖ్యాత కంపెనీలు మద్ధతు ప్రకటించడం ఈ పర్యటనలో హైలెట్ గా నిలిచింది. కేటీఆర్ తో సమావేశం తరువాత తెలంగాణలోని టైర్-2 నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వచ్చాయి. 30కి పైగా కంపెనీల సీఈఓలతో కేటీఆర్ సమావేశమై టైర్-2 నగరాల్లో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేలా ఒప్పించారు. త్వరలో ప్రారంభించనున్న నల్గొండ ఐటీ టవర్ లో 200 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ సొనాటా నిర్ణయించుకుంద. కరీంనగర్‌లో ఆపరేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు 3M-ECLAT ప్రకటించింది. అలాగే తమ కార్యకలాపాలను వరంగల్‌కు విస్తరించేందుకు రైట్ సాఫ్ట్‌వేర్ రెడీ అయింది.

తన 2015 నాటి అమెరికా టూర్ అనుభవాలను ఈ పర్యటనలో కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో చూపిన ఉత్సాహాన్నే ఈ పర్యటనలోనూ కేటీఆర్ కొనసాగిస్తు మరిన్ని కంపెనీలను తెలంగాణకు రప్పించడంలో విజయవంతం అయ్యారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు యావత్ తెలంగాణ సంబరంగా సిద్ధపడుతున్న ఈ సమయంలో మంత్రి కేటీఆర్ తాజా పర్యటనతో భారీ పెట్టుబడులు వచ్చాయి. 42 వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దార్శనిక నాయకత్వంలో సాధించిన ప్రగతికి నిదర్శనం.

యాత్రను విజయవంతం చేసిన ఎన్నారైలు , భారతీయ ప్రవాసులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మంత్రితో పాటు ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ & ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ విష్ణు వర్ధన్ రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్, దిలీప్ కొణతం, తెలంగాణ లైఫ్‌సైన్సెస్ సిఈఓ శక్తి ఎం నాగప్పన్, ఏరోస్పేస్ & డిఫెన్స్ డైరెక్టర్‌ ప్రవీణ్ P.A, చీఫ్ రిలేషన్షిప్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి ఆత్మకూరి, IPO, ఇన్వెస్ట్ తెలంగాణ, వెంకట శేఖర్ లు మంత్రి కేటీఆర్ తో పాటు ఈ పర్యటనలో ఉన్నారు.