mt_logo

మంత్రి కేటీఆర్‌ UK పర్యటన విజయవంతం

  • మంత్రి కేటీఆర్‌ UK పర్యటన విజయవంతం
  • టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌కు గ్రీన్ సిగ్నల్
  • సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు 

మంత్రి కేటీఆర్‌ లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ గ్రూప్‌ సీఐవో ఆంథోనీ మెక్‌ కార్తీతో లండన్‌లో సమావేశమయ్యారు. తెలంగాణా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చేపట్టిన మంత్రి కేటీఆర్‌ UK పర్యటన విజయవంతంగా మొదలయ్యింది.  హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు లండన్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ ముందుకొచ్చింది. దీంట్లో సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆ  సంస్థ తెలిపింది. హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఎన్నారై అఫైర్స్‌ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఆంథోనీ మెక్‌ కార్తీ పరస్పరం మార్చుకున్నారు.

పెట్టుబడులతో రావాలని కంపెనీలకు పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్

లండన్‌లోని భారత హై కమిషనర్‌ విక్రం K. దురైస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇన్నోవేషన్‌, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై 9 సంవత్సరాలుగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.సింగిల్‌ విండో అనుమతుల విధానం గురించి ప్రత్యేకంగా ప్రసంగించారు. హైదరాబాద్‌లో టెక్‌ కంపెనీల పెరుగుదలతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం UK లోని కింగ్స్‌కాలేజ్‌, క్రాన్‌ఫీల్డ్‌ యూనివర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలతో చేసుకొన్న భాగస్వామ్యం  గురించి తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులతో రావాలని కంపెనీలకు పిలుపునిచ్చారు మంత్రి. ఏవియేషన్‌, డిఫెన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌ వంటి రంగాల్లో UK కంపెనీలతో భాగస్వామ్యానికి గల అవకాశాలను విక్రమ్‌ K.  దురైస్వామి వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులు పెట్టేందుకు అద్భుత గమ్యస్థానం అని అన్నారు. నూతన సచివాలయం, డాక్టర్‌ బీ. ఆర్‌. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వంటి వాటిని ప్రత్యేకంగా వివరించారు.