mt_logo

తెలంగాణ స‌మ‌గ్ర‌, స‌మీకృత‌, స‌మ‌తుల్య అభివృద్ధిని సాధించింది: మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : నీళ్లు, నిధులు, నియామ‌కాలు ల‌క్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. స‌మ‌గ్ర‌, స‌మీకృత‌, స‌మ‌తుల్య అభివృద్ధిని సాధించింద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన‌ అభ‌య్ త్రిపాఠి స్మార‌క ఉప‌న్యాసం కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ పాల్గొని కొత్త రాష్ట్రం – స‌వాళ్లు అనే అంశంపై ప్ర‌సంగించారు.

హైద‌రాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. 1950 నుంచి 2014 వ‌ర‌కు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్ప‌డ్డాయి. ద‌శాబ్దాల పోరాటం త‌ర్వాత సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు ఎన్నో స‌వాళ్లు, సందేహాలు ఉండే. తెలంగాణ ఏర్ప‌డితే ఇక్క‌డ ఇత‌ర ప్రాంతాల వారి భ‌ద్ర‌త‌పై ఎన్నో సందేహాలు వ్య‌క్తం చేశారు. కానీ ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌శాంతంగా జీవ‌నం సాగిస్తున్నారు. శాంతిభ‌ద్ర‌త‌లు ఎలాంటి విఘాతం క‌ల‌గ‌లేద‌న్నారు కేటీఆర్.

రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల‌కు పైగా వ్య‌వ‌సాయ బోర్లు

సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడే కేసీఆర్ ప్ర‌తి ఇంటికి తాగునీరు అందించార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం అమ‌లు చేశామ‌ని తెలిపారు. రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల‌కు పైగా వ్య‌వ‌సాయ బోర్లు ఉన్నాయి. కాబ‌ట్టి క‌రెంట్ ఎక్కుక అవ‌స‌రం ప‌డుతుంది. వ్య‌వ‌సాయానికి నాణ్య‌మైన 24 గంట‌ల విద్యుత్‌ను ఉచితంగా అంద‌జేస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.

కాళేశ్వ‌రంతో ఉత్త‌ర తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం

ప్ర‌పంచంలోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు కాళేశ్వ‌రం అని కేటీఆర్ చెప్పారు. కాళేశ్వ‌రంతో ఉత్త‌ర తెలంగాణ స‌స్య‌శ్యామ‌ల‌మైంది. వ‌రి ధాన్యం ఉత్ప‌త్తిలో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానంలో నిలిచింది. మిష‌న్ భ‌గీర‌థ లాంటి ప‌థ‌కాల‌ను ఇత‌ర రాష్ట్రాలు, కేంద్రం కాపీ కొడుతున్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

మోదీ స‌ర్కార్ తెలంగాణ‌కు న‌యా పైసా ఇవ్వ‌లేదు

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ఏ ఒక్క హామీని కేంద్రం నెర‌వేర్చ‌లేదు అని కేటీఆర్ తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి ఎన్నో అంశాల్లో మ‌ద్ద‌తు ఇచ్చాం. నీతి ఆయోగ్ చెప్పినా మోదీ స‌ర్కార్ తెలంగాణ‌కు న‌యా పైసా ఇవ్వ‌లేదు. కేంద్రానికి మ‌నం రూపాయి ఇస్తే 46 పైస‌లు మాత్ర‌మే తిరిగి వ‌స్తున్నాయి. ప్ర‌తి జిల్లాలో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఐటీ ఉద్యోగాల క‌ల్ప‌న‌లో బెంగ‌ళూరును దాటేశాం..

ఐటీ రంగంలో పురోగ‌తి సాధించాం అని మంత్రి తెలిపారు. ఐటీ సెక్టార్ పురోగ‌తితో యువ‌త ఆలోచ‌న ధోర‌ణిలో మార్పు వ‌చ్చింది. ఐటీ ఉద్యోగులు 30 ఏండ్ల‌లోపే ఇండ్ల‌ను కొనేస్తున్నారు. తెలంగాణ ఐటీ ఎగుమ‌తులు 2.41 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయి. ఐటీ ఉద్యోగులు 9 ల‌క్ష‌ల మందికి చేరుకున్నార‌ని తెలిపారు. ఐటీ సెక్టార్‌లో ఉద్యోగాల క‌ల్ప‌న‌లో రెండేళ్లుగా బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసింది. అన్ని రంగాల‌ను స‌మానంగా అభివృద్ధి చేస్తున్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.