- రాజకీయ నాయకత్వానికి చిత్తశుద్ధి, విజన్ ఉంటేనే ప్రగతి, పాలనా విజయాలు సాధ్యం
- పంజాబ్ లోని మొహాలీ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ – ISB క్యాంపస్లో Advanced Management Programme in Public Policy కోర్స్ ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్
- ఈ సమావేశంలో కీలకోపన్యాసాన్ని చేసి పాలనలో తన అనుభవాలను పంచుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం అనేక ప్రజాస్వామ్య పోరాటాలు, ఉద్యమాల తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని ప్రగతి పథంలో నడపడంలో మేము విజయం సాధించామని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను అతి తక్కువ సమయంలో సాధించిన విజయవంతమైన రాష్ట్రం తెలంగాణనే అన్నారు.
8 సంవత్సరాల లో తెలంగాణ తలసరి ఆదాయం, GDP భారీగా పెరగడం తెలంగాణ అభివృద్ధికి ప్రాథమిక సాక్ష్యం. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపేందుకు వినూత్న పాలసీలతో ముందుకుపోయాం, ప్రభుత్వ పరిపాలనలోనూ ప్రభుత్వ పాలసీల నిర్మాణంలోనూ ఇన్నోవేషన్ ని తీసుకువచ్చిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన తెలంగాణ పారిశ్రామిక అనుమతుల చట్టం టీఎస్ ఐపాస్ ప్రభుత్వ పాలన ఇన్నోవేషన్ కి అద్భుతమైన నిదర్శనమన్నారు.
టీఎస్ ఐపాస్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటిదాకా అద్భుతమైన విజయాన్ని సాధించింది. 24 వేలకు పైగా పారిశ్రామిక అనుమతులను అత్యంత సులభంగా అందించిన అద్భుతమైన విధానం ఇది అన్నారు. 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకువచ్చి, 24 లక్షల ఉపాధి అవకాశాలను అందించిన విధానం ఇది అన్నారు.
*ఐటీ రంగ ఉద్యోగాలను అందిస్తున్న అతిపెద్ద నగరం హైదరాబాద్*
ప్రపంచంలోనే ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 50% త్వరలో తెలంగాణ ఉత్పత్తి చేయబోతున్నది. అత్యధిక యు ఎస్ ఎఫ్ డి ఏ అనుమతులు కలిగిన ప్రాంతం తెలంగాణ. దేశంలో అత్యధిక ఐటీ రంగ ఉద్యోగాలను అందిస్తున్న అతిపెద్ద నగరం హైదరాబాద్, 300% ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరిగింది, 400% ఐటీ ఎగుమతుల పరిమాణం పెరిగింది. ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థల ప్రాంగణాలకు హైదరాబాద్ కేంద్రం అయింది. అతిపెద్ద ఇన్నోవేషన్ ఇంకుబేషన్ సెంటర్ అయిన టీ హబ్, మహిళలకు ప్రత్యేకమైన ఇంక్యుబేటర్ వీహబ్, దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టి వర్క్స్ హైదరాబాద్ నగరంలో కేంద్రీకృతమైనాయి.
కేవలం పరిశ్రమలు, పాలసీలకే కాకుండా తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలోనూ రికార్డులు సృష్టించింది. ప్రపంచమంతా నిర్మాణ రంగంలో అత్యంత వేగంగా నిర్మాణం చేసే చైనా మోడల్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో అతి తక్కువ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. తెలంగాణ సాగునీటి వనరులు అందుబాటులోకి వచ్చిన ప్రాజెక్టుల వలన గతంలో 24 స్థానంలో ఉన్న తెలంగాణ, వరి ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానానికి చేరిందని తెలియజేసారు.
వ్యవసాయ రంగంలో తెలంగాణ పంచ విప్లవాలను సృష్టిస్తోంది
లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టుని నాలుగు సంవత్సరాలు పూర్తి చేసినా, కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన సహాయం ఏ మాత్రం లేదు. అయినా అన్ని సవాళ్ళను దాటుకొని ప్రాజెక్టును పూర్తి చేయగలిగామన్నారు. దేశవ్యాప్తంగా పార్టీలు, ప్రభుత్వాలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని దశాబ్దాలుగా హామీలు గుప్పిస్తున్న తరుణంలో తెలంగాణ రైతుల తలసరి ఆదాయాన్ని భారీగా పెంచగలిగింది. వ్యవసాయ రంగంలో తెలంగాణ పంచ విప్లవాలను సృష్టిస్తోంది. రానున్న కాలంలో వీటి సహాయంతో రైతుల ఆదాయం కచ్చితంగా అనేక రెట్లు పెరుగుతుంది.
విజన్ గొప్పదైతే ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తుంది
ఇదంతా కేవలం గత తొమ్మిది సంవత్సరాల కాలంలోనే సాధ్యమైంది. గత దశాబ్ద కాలంలో తెలంగాణ మాదిరి ఇతర రాష్ట్రాలు కాని, దేశం గాని ప్రగతి పథంలో ముందుకు వెళితే ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఇప్పటికే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా మారేదన్నారు. ప్రభుత్వ పాలనలో మేము మాత్రమే శాశ్వతంగా ఉంటామని ఆలోచన విధానం నుంచి అధికారులు బయటకు వచ్చి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
రాజకీయ నాయకులకు ఉన్న విజన్ గొప్పదైతే ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తుందని తెలంగాణ 9 సంవత్సరాల అనుభవం నిరూపించింది. 60 సంవత్సరాలలో గ్రామాలకు తాగునీరు అందించేందుకే ఇబ్బందులు పడిన ప్రభుత్వ యంత్రాంగం మూడేళ్లలో రాష్ట్రంలోని అందరికీ తాగునీరు అందించే మిషన్ భగీరథను పూర్తి చేయడం ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ అన్నారు.
నాయకత్వం అంటే ప్రతిరోజు నేర్చుకోవడమే.. రేపటి రోజు బాగుంటుంది అన్న ఆశను ప్రజలకు అందించగలిగితే ప్రజలు ప్రభుత్వాలను పార్టీలకు మద్దతిస్తారు. అండగా ఉంటారన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలకు అభివృద్ధి పథకాలు ప్రాజెక్టులను అమలు చేసేందుకు నిధుల కొరత అతిపెద్ద సవాలు. అయితే అభివృద్ధి పనుల కోసం కూడా రుణాలు తీసుకోకుండా ఉండాలంటే పాతకాలపు ఆలోచన ధోరణి వలన దేశం ప్రగతి పథంలో ముందుకు వెళ్లడంలో వెనకబడుతున్నదన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు రుణాలను భవిష్యత్తుపైన పెట్టుబడిగా చూస్తుంటే భారతదేశంలో మాత్రం రుణాల విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. మారుతున్న యువత ఉద్యోగం రాగానే రుణాలు తీసుకుని జీవితాలను బాగుపరచుకుంటున్న మాదిరే దేశాలు కూడా మౌలిక వసతుల కోసం అవసరమైతే రుణాలు తీసుకొని భవిష్యత్తు పైన పెట్టుబడిగా భావించి ముందుకు వెళ్లాల్సిన వినూత్నమైన పరిపాలన విధానాలు ఈ దేశానికి అవసరమని అన్నారు.
మౌలిక వసతులపైన పెట్టే ప్రతి పైసా పెట్టుబడి, దేశ భవిష్యత్తు పైన పెట్టే పెట్టుబడి గానే భావించాలి. దేశంలోని రాష్ట్రాల్లో అమలవుతున్న ఆదర్శ విధానాలను ఎప్పటికప్పుడు నేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపించాలన్నారు. ఇతరుల ఆదర్శ విధానాల నుండి స్ఫూర్తి పొందడంలో వెనకాడాల్సిన అవసరం లేదు. దేశంలో విభజన ఎంత ఉన్న ఈ దేశం సమైక్యంగా ఉంటుందన్న నమ్మకం ఉన్నది. కానీ విభజన రాజకీయాలు పెద్ద ఎత్తున దేశంలో ఉన్న ఈ తరుణంలో స్పృహద్భావ వాతావరణంలో రాజకీయ పార్టీల మధ్య చర్చలు ఉంటాయని ఆశించడం కొంత వాస్తవ దూరమే అవుతుందన్నారు.
విజయం సాధించాలంటే అందుకు తగిన త్యాగాలు చేయాలి
మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడడం భవిష్యత్తులో అన్ని ప్రభుత్వాలకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఒక చిన్న సంఘటన కూడా శాంతిభద్రతల విఘాతానికి దారి తీసే ప్రమాదం ఉన్నదని సూచించారు. ఎవరి జీవితంలో అయినా గొప్ప విజయం సాధించాలంటే అందుకు తగిన త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు రాజకీయ నాయకులు మినహాయింపు ఏ మాత్రం కాదు. రాజకీయాలను వృత్తిగా ఎంచుకునే అంశం ఎంతో సవాళ్లతో కూడుకొని ఉన్నది. రాజకీయాల్లో విభిన్న రంగాల్లో అనుభవం కలిగిన నిపుణులు రావాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు వచ్చే యువత క్షేత్రస్థాయి నుంచి పని చేసి వస్తే విజయం సాధించే అవకాశం ఉంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాకు తెలంగాణ ఉద్యమం వలన ప్రజాక్షేత్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు అవకాశం దొరికింది. రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసిన దాని కన్నా కఠినమైనది అన్నారు.