mt_logo

గుండెలు కదిలించేలా అమరజ్యోతి డాక్యుమెంటరీ : మంత్రి కేటీఆర్

తెలంగాణ అమరవీరుల త్యాగాలను కొనియాడుతూ నిర్మించిన అమరజ్యోతి డాక్యుమెంటరీని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. పది నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీలో 1969 నుంచి రాష్ట్రావతరణ వరకు సాగిన  ఉద్యమ చరిత్రలో ప్రాణత్యాగం చేసిన అమరుల ఔన్నత్యాన్ని అద్భుతంగా చిత్రించారు. సమైక్యవాదుల కుట్రల ఫలితంగా యువకులు బలిదానాలకు దారితీసిన నేపథ్యాన్ని, ప్రజలను పోరాటానికి పురికొల్పడం కోసం ప్రాణాలు త్యాగం చేసిన విద్యార్థి వీరుల త్యాగ నిరతిని గుండెలు కదిలించేలా ఈ డాక్యుమెంటరీ వివరిస్తుందని కేటీఆర్ అన్నారు. ఇది ప్రతి తెలంగాణ బిడ్డ చూడాల్సిందిగా కోరారు.

దీనికి రచన, వ్యాఖ్యానం చేసిన శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్‌, దర్శకులు బాదావత్‌ పూర్ణచందర్‌ను మంత్రి అభినందించారు. ఇటువంటి డాక్యుమెంటరీలు మరెన్నో రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సందర్భంలో ఎర్రోజు శ్రీనివాస్‌ వ్యాసాల సంకలనం ‘నడక’ పుస్తకాన్ని, పర్యావరణ పారిశుధ్య అంశాలపై డాక్టర్‌ గాదె వెంకటేశ్‌ రాసిన ‘కసువు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్‌ తన పుస్తకం ‘నడక’ ద్వారా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్‌ అభినందించారు. కసువు పుస్తకం చాలా అరుదైన విషయాలను ప్రస్తావించిందన్నారు. తెలంగాణ పారిశుధ్య చరిత్రను, మున్సిపల్‌ శాఖలో జరిగిన ప్రగతిని సమగ్రంగా చర్చించే పుస్తకాలు ఇప్పటి వరకు రాలేదని, ఆ లోటును ‘కసువు’ పుస్తకం తీర్చిందన్నారు.  ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, తెలంగాణ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌, ప్రముఖ పాత్రికేయులు పరాంకుశం వేణుగోపాల స్వామి,  ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌, ప్రముఖ కవి తైదల అంజయ్య, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆసరి రాజు తదితరులు పాల్గొన్నారు.