గత నెల జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయ వ్యవస్థ పైన పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ భవన్ లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో పాటు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, జలమండలి ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది హాజరయ్యారు.
మహిళా సంఘాల సహకారంతో ప్రచారం
వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. వార్డు కార్యాలయాలకు నగర పౌరుల నుంచి స్పందన క్రమంగా పెరుగుతున్నదని అయితే దీన్ని పెంచేందుకు మరిన్ని కార్యక్రమాలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా వార్డు పరిధిలో ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దీంతోపాటు స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు, ఇతర సంఘాల సహకారంతో కూడా వార్డు కార్యాలయ వ్యవస్థకు మరింత ప్రచారం కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ఈ సమీక్ష సమావేశం సందర్భంగా మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల నుంచి వార్డు కార్యాలయ వ్యవస్థకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలపైన వార్డు కార్యాలయాన్ని సందర్శించిన పలువురితో తాము స్వయంగా ఫోన్లో మాట్లాడామని, వార్డు కార్యాలయ వ్యవస్థలో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వేగంగా సమస్యలను పరిష్కారం చేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నం పట్ల ఫిర్యాదు చేసిన పౌరులు సంతృప్తిగా ఉన్నారని, జోనల్ మరియు డిప్యూటీ కమిషనర్లు మంత్రి కేటీఆర్ కి తెలిపారు.
వార్డు వ్యవస్థ మరింత బలోపేతం
పౌరుల భాగస్వామ్యంతోనే పురపాలన లక్ష్యాలు సాధ్యమవుతాయని బలంగా నమ్మే ప్రభుత్వం మాదని తెలిపిన కేటీఆర్, వార్డు కార్యాలయ వ్యవస్థ ద్వారా ఫిర్యాదులు పెరిగితే దాన్ని సానుకూలంగా చూస్తామన్నారు. వార్డు కార్యాలయం వ్యవస్థ పనిచేస్తుందన్న నమ్మకం పెరుగుతున్న కొద్దీ ప్రజలు తమ సమస్యలను, వార్డు సమస్యలను ఈ వ్యవస్థ ద్వారా పరిష్కరించుకునేందుకు ముందుకు వస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. పౌర సేవలను ప్రజలకు అందించే ప్రక్రియను ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేయాలన్న దిశగా ఈ వార్డు కార్యాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. వార్డు కార్యాలయ వ్యవస్థ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న నేపథ్యంలో ఇంకా ఎక్కడైనా అవసరమైన మార్పు చేర్పులు ఉంటే చేసుకొని ముందుకు పోవాలని, ఈ వార్డు కార్యాలయాలకు అవసరమైన టెక్నాలజీని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని ఈ వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువ చేసే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
నగర పారిశుద్ద్యం మెరుగు కోసం చర్యలు
ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ వారాంతం నుంచి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కోరిన మంత్రి కేటీఆర్, ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్కడికక్కడ అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో భోజన సమావేశాలు ఏర్పాటు చేసుకొని, వారి సేవలకు అభినందనలు తెలుపుతూనే, నగర పారిశుద్ధ్యాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన దిశా నిర్దేశం చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు.