mt_logo

తెలంగాణ చేసిన కార్యక్రమాలను భారతదేశం అనుసరిస్తుంది: మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిపైన అధ్యయనం చేసేందుకు మహారాష్ట్ర నుంచి 250 మందితో కూడిన రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నది.

ఈరోజు మహారాష్ట్ర ప్రతినిధుల బృందంతో మంత్రి కె. తారక రామారావు టీహబ్‌లో సమావేశం అయ్యారు. హైదరాబాద్ నగర ప్రగతి పైన వారికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేపట్టిన ప్రణాళిక బద్ధమైన కార్యక్రమాలను వివరించారు.

10 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో ముందుకు
విద్యార్థిగా పూణేలో చదివిన రోజుల నుంచి మహారాష్ట్రతో తనకు అనుబంధం ఉందని కేటీఆర్ తెలిపారు. మహారాష్ట్రలోని అనేక జిల్లాలు చారిత్రాత్మకంగా తెలంగాణతో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి, ఇవి గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయి. అందుకే తెలంగాణ మహారాష్ట్రల మధ్యన సాంస్కృతిక మరియు మానవ సంబంధాలు బలంగా ఉన్నాయని తెలిపారు. దశాబ్దంన్నర పాటు అనేక ఉద్యమాల తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నమని గుర్తు చేసారు. రాష్ట్రం ఏర్పడిన నాడు ఉన్న అనేక అనుమానాలను పటాపంచలు చేస్తూ 10 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నామని చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పని తీరు బహుముఖ వ్యూహం
రాష్ట్రం ఏర్పడిన నాడు ఉన్న విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా వంటి సంక్షోభాలను విజయవంతంగా అరికట్టాము. భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అన్నది వాస్తవమైనప్పటికీ దేశాన్ని నడిపిస్తున్నది మాత్రం నగర ప్రాంతాలే అన్న వాస్తవాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలన్నారు. ఎంత ఎక్కువ నిధులను మౌలిక వసతుల కల్పన పైన వెచ్చిస్తే అంత వేగంగా అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బహుముఖ వ్యూహంతో మా ప్రభుత్వం పని చేసింది అని మంత్రి తెలిపారు.

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఐటీ ఉద్యోగాల కల్పన
హైదరాబాద్ నగరంలో ఐటీ మరియు ఐటీ అనుబంధ రంగాలతో పాటు లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ రంగంలోనూ భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా అవసరమైన మౌలిక వసతుల కల్పనను చేపట్టాము. అందుకే ఈరోజు అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్ నగరంలో తమ అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయని తెలియచేశారన్నారు. హైదరాబాద్ నగరం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బెంగళూరు నగరాన్ని ఐటీ ఉద్యోగాల కల్పనలో వరుసగా రెండు సంవత్సరాలు దాటి వేసింది అని పేర్కొన్నారు.

తెలంగాణ కార్యక్రమాలను భారతదేశం రేపు అనుసరిస్తుంది
ఐటీ ఎగుమతులతో పాటు వరి ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేసారు. తెలంగాణ రాష్ట్రం మౌలిక వసతులతో పాటు పరిపాలన సంస్కరణల పైన ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా విప్లవాత్మకమైన టీఎస్ ఐపాస్ మరియు భవన నిర్మాణాలు అనుమతుల కోసం టీఎస్‌బీపాస్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే తెలంగాణ విధానాలను పథకాలను అనేక రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసి వెళ్ళాయి, అందుకే తెలంగాణ ఈరోజు చేసిన కార్యక్రమాలను భారతదేశం రేపు అనుసరిస్తుంది అని అంటున్నాం… హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టిన భవిష్యత్తు విస్తరణకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దే ప్రయత్నాలను మా ప్రభుత్వం చేస్తున్నదని తెలిపారు.

100% మురుగు నీటిని శుద్ధి చేసిన తొలి నగరం హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో 415 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎస్ఆర్‌డీపి ఆధ్వర్యంలో ఇప్పటికే భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసి అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, బ్రిడ్జి లాంటి నిర్మాణాలను పూర్తి చేసామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రారంభించిన సీఆర్ఎంపీ కార్యక్రమాన్ని అధ్యయనం చేసిన తర్వాత ముంబై నగరం కూడా అనుసరిస్తున్నదన్నారు. భవిష్యత్తు అవసరాలకు అవసరమైన విద్యుత్ మరియు తాగునీటి సరఫరా వ్యవస్థలను సిద్ధం చేసి ఉంచబోతున్నాము 100% మురుగు నీటిని శుద్ధి చేసే తొలి నగరంగా మారబోతున్నామన్నారు. హైదరాబాద్ నగర ప్రగతిని అనేకమంది ప్రముఖులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.

5 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనం జీహెచ్ఎంసీ పొదుపు
దేశంలో ముంబై నగరం తర్వాత ఎత్తైన భవనాలు కలిగిన నగరంగా హైదరాబాద్ స్థానం సంపాదించుకుందని తెలిపారు. వినూత్నమైన టీడీఆర్ విధానం ద్వారా సుమారు 5 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని జీహెచ్ఎంసీ పొదుపు చేయగలిగిందని పేర్కొన్నారు. టీఎస్‌బీపాస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు రియల్ ఎస్టేట్ రంగ భాగస్వాములతోనూ ముఖ్యమంత్రి స్వయంగా సమావేశమై నగర అభివృద్ధి కోసం అవసరమైన కార్యక్రమాల విషయంలో సుదీర్ఘమైన సమావేశం ఏర్పాటు చేసి ఒక్కరోజే 7 జీవోలను జారీ చేయడం జరిగిందన్నారు. దేశంతోనే అతిపెద్ద మురికివాడల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారికి పక్కా ఇల్లు నిర్మించి ఉచితంగా అందజేయడం జరిగింది. ప్రతి పట్టణ మరియు స్థానిక సంస్థల బడ్జెట్లో 10% గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.