mt_logo

హైదరాబాద్‌లో ఉన్న శాంతి భద్రతలు, అభివృద్ధి అద్భుతం: బెంగళూరు యువకుడు

నీలోఫర్ కేఫ్‌లో మంత్రి కే. తారక రామారావు సందడి చేసారు. అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉంటున్న ఆయన బంజారాహిల్స్ నీలోఫర్ కేఫ్‌లో సందడి చేశారు. ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంగా నీలోఫర్ కేఫ్‌కు వచ్చిన మంత్రి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. నీలోఫర్ కేఫ్‌లో చాయ్ తాగుతున్న పలు కుటుంబాలతో ముచ్చటించారు.ఈ సందర్భంగా పలువురు మంత్రి కేటీఆర్ పైన ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి పైన ప్రశంసలు కురిపించారు. 

హైదరాబాద్‌లో ఉన్న శాంతి భద్రతలు, అభివృద్ధి అద్భుతంగా ఉన్నాయన్నారు. బెంగళూరులో పని చేస్తున్న యువకుని కుటుంబంతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.బెంగళూరు నుంచి తన కుటుంబంతో గడిపేందుకు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ నగరం వినూత్నంగా కనిపిస్తుందని ముఖ్యంగా గత పది సంవత్సరాలలో హైదరాబాద్ అద్భుతంగా మార్పు చెందిందని ఆయన తెలిపారు. 

దశాబ్దాల క్రితం వారణాసి నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన మాకు హైదరాబాద్ గత పది సంవత్సరాల్లో మారిన తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి జీవించే వాతావరణన్ని కలిగి ఉందన్నారు. ఆ తర్వాత పలువురు మహిళలతో మంత్రి కేటీఆర్ సంభాషించారు. తన కొడుకుకి కేటీఆర్ అంటే ప్రత్యేక అభిమానమని ఒక మహిళ తెలిపారు. 

మహిళలతో సంభాషిస్తున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ వారి కుటుంబ నేపథ్యం ప్రభుత్వ పనితీరు పట్ల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మైనారిటీ కుటుంబంతో ముచ్చటించిన కేటీఆర్… వారి నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరం అద్భుతంగా ఉన్నదని ముఖ్యంగా మత ఘర్షణలు లేకుండా అందరికీ అన్ని అవకాశాలు అందిస్తున్న తీరుబట్ల మైనార్టీ కుటుంబం ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేసింది. మంత్రి కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలాగా చాయ్ తాగుతూ పలువురుతో సంభాషించడం చాలామందిని ఆకట్టుకుంది. కేటీఆర్‌తో పలువురు సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు.