mt_logo

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు 

  • జూలై 18 నుంచి 28 వరకు చాలా పెద్ద ఎత్తున కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరదలు, వాటివల్ల వచ్చిన నష్టాలను కేబినేట్ అన్ని శాఖలతో విస్తృతంగా చర్చించింది.
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం..దాదాపు 10 జిల్లాల్లో కురిసిన చాలా పెద్ద ఎత్తున కురిసిన వర్షాల వల్ల ప్రజలకు జరిగిన నష్టం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి, తక్షణ సహాయం కింద రూ.500 కోట్లను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖకు ఆదేశం ఇవ్వడం జరిగింది.  
  • ఎక్కడ అవసరముంటే అక్కడ యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు, కొన్నిచోట్ల తాత్కాలిక మరమ్మతులు చేసి పునర్నిర్మించాలని సీఎం కేసీఆర్  ఆదేశించడం జరిగింది.
  • వరదల్లో తరలించిన దాదాపు 27 వేల మందికి పునరావాసం కల్పించి, భద్రంగా ఉంచేలా కేబినేట్  ఆదేశం.
  • సీఎం కేసీఆర్ ప్రత్యేకించి ప్రస్తావించి.. ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన ఇద్దరిని ప్రత్యేకంగా అభినందించి వారిని 15 ఆగస్టు నాడు రాష్ట్ర ప్రభుత్వ సత్కారాన్ని అందజేయాలని ఆదేశించారు. వారి విద్యుక్దర్మాన్ని బాధ్యతగా నిర్వర్తించినందుకు సీఎం కేసీఆర్ గారు, కేబినేట్ కూడా అభినందించింది.
  • ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పాయెం మీనయ్య అనే ఉపాధ్యాయుడు 40 మంది పిల్లలను కాపాడినందుకు అభినందించి సన్మానం చేయాలని సీఎం కేసీఆర్ గారు, కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
  • ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడుగునా ఉన్న మున్నేరు వెంట ఒక ఆర్ సిసి వాల్ తో కూడిన ఫ్లడ్ బ్యాంకును కూడా నిర్మించాలని కేబినేట్ తీర్మానించింది. దీనికి సంబంధించి ఒక నివేదిక తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. 
  • వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. వర్షాల వల్ల తాత్కాలిక కొంత ఇబ్బంది కలిగినా  విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచి రైతులను పూర్తిస్థాయిలో అందించాలని వ్యవసాయ శాఖను సీఎం గారు ఆదేశించడం జరిగింది. ఈసారి రుతుపవనాలు కూడా కొంత ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. 
  • మరణించిన 40 మంది వివరాలను సేకరించి వారికి ఎక్స్ గ్రేషియా అందించాలని కేబినేట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
  • వరదలతో కొన్ని చోట్ల పొలాల్లో ఇసుకమేటలు వచ్చినయ్.. కొన్ని చోట్ల ఇతరత్రా సమస్యలు వచ్చినయ్.. వాటన్నింటినీ పరిశీలించి సమగ్రమైన నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని సీఎస్ ద్వారా కలెక్టర్లకు ఆదేశాలివ్వడం జరిగింది. 
  • వరదలో తెగిపోయిన కల్వర్టులు, రోడ్లన్నింటినీ కూడా తక్షణమే  మరమ్మత్తులు చేయాలని సీఎం గారు, కేబినేట్ ఆదేశించడం జరిగింది.
  • టీఎస్ ఆర్టీసీ సంస్థకు సంబంధించిన కార్మికులు, ఉద్యోగులందరి విషయంలో రవాణా మంత్రి, ఆర్టీసీ ఛైర్మన్, ఆర్థిక మంత్రి, వారితో దగ్గరి సంబంధమున్న మిగతా మిత్రులు వారి తరపున సీఎం గారికి నివేదించడం జరిగింది. 
  • ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్తపై ఈరోజు కేబినేట్ ఒక నిర్ణయం తీసుకుంది.
  • ఆర్టీసీని కాపాడేందుకు సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను పటిష్టపరిచేందుకు, విస్తృతపరిచేందుకు టీఎస్ ఆర్టీసీని, ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. దానికి సంబంధించిన విధివిధానాలన్నింటిని రూపొందించడానికి అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
  • గతంలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని సమ్మె కూడా చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం.
  • ఆర్టీసీ కార్మికుల కోరికను మన్నిస్తూ.. సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను గుర్తిస్తూ మరింత పటిష్ట పరచడానికి అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 
  • మొత్తంగా ఆర్టీసీకి చెందిన 43,373 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ చాలా కీలకమైన నిర్ణయాన్ని రాష్ట్ర కేబినేట్ తీసుకోవడం జరిగింది.
  • ఈ సబ్ కమిటీలో.. అధ్యక్షులుగా ఆర్థికశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్ అండ్ బి శాఖ, రవాణా శాఖ కార్యదర్శులు, జేఏడీ శాఖ కార్యదర్శులు, లేబర్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యులుగా పనిచేస్తారు. సత్వరమే పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ అందజేయడం జరుగుతుంది.
  • ఆగస్టు 3న ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాల్లో ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రవేశ పెట్టబోతున్నాం. దానికి సంబంధించిన తగిన కార్యాచరణను ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి, శాసనసభా వ్యవహారాల శాఖామంత్రులకు సీఎం కేసీఆర్ గారు ఆదేశాలివ్వడం జరిగింది.
  • తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి మహానగరం. ఈ మహానగరం ఈరోజు భారతదేశంలోనే అద్భుతమైన నగరంగా ఎదిగింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఒక టార్చ్ బేరర్’గా అగ్రభాగాన ఉంది.  
  • పెరుగుతున్న నగరానికి అదేస్థాయిలో మౌలిక వసతులు ఉండాలనే ఉద్ధేశ్యంతో సీఎం కేసీఆర్ గారు, కేబినేట్ ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
  • హైదరాబాద్ లో ప్రజా రవాణాను విస్తృత పరచడం ద్వారా.. ఈ నగరం ఎంత పెరిగినా, ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎన్ని లక్షల ప్రజలు వచ్చినా తట్టుకునే విధంగా.. ఒక విశ్వనగరంగా ఎదగడానికి, అన్ని హంగులతో కూడిన నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి కేబినేట్ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
  • పురపాలక శాఖ మంత్రిగా వ్యక్తిగతంగా నేను సీఎం కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా ధన్యావాదాలు తెలియజేస్తున్నాను. 
  • విస్తృతమైన చర్చ ద్వారా హైదరాబాద్ మెట్రో రైల్ ను విస్తృత పరుస్తూ రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లోనే నిర్ధేశిత ప్రతిపాదనలతో చాలా పెద్ద ఎత్తున విస్తృత పరచాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
  • రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు ఉన్న 31 కి.మీ. మేర ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ కు సీఎం కేసీఆర్ గారు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావచ్చింది.  
  • హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న 70 కి.మీ. మెట్రో కు అదనంగా మరో 31 కి.మీ. ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ రూపంలో అందుబాటులోకి రాబోతా ఉన్నది. 
  • కేబినేట్ నిర్ణయం ప్రకారం.. జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తూము కుంట దాకా ఒక డబుల్ డెక్కర్ మెట్రోను.. ఒక లెవల్ లో వాహనాలు.. మరో లెవల్ లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినేట్ తీర్మానించింది.
  • ఆదిలాబాద్, నాగ్ పూర్ రూట్ లో.. పాట్నీ నుంచి ఓఆర్ ఆర్ కండ్లకోయ దాకా మరొక డబుల్ డెక్కర్ ఫ్లై ఒవర్ నిర్మించాలని కేబినేట్ నిర్ణయించింది. దానికి సంబంధించి రక్షణ శాఖ భూములు కొన్ని ఉన్నాయి. ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కేబినేట్ నిర్ణయించింది.
  • ఈస్ట్ వెస్ట్ లో.. ఈస్నాపూర్ నుంచి మియాపూర్ దాకా.. అదేవిధంగా మియాపూర్ నుంచి లక్డీకా పూల్ దాకా మరొక మార్గంలో మెట్రోను నిర్మాణం చేయాలని తీర్మానించడం జరిగింది.
  • విజయవాడ రూట్ లో.. ప్రస్తుతమున్న ఎల్.బి.నగర్ నుంచి హయత్ నగర్ మీదుగా పెద్ద అంబర్ పేట దాకా మెట్రోను విస్తరించాలని నిర్ణయించడం జరిగింది.
  • వరంగల్ రూట్ లో.. ఉప్పల్, తార్నాక నుంచి యాదాద్రి జిల్లా బీబీ నగర్ దాకా మెట్రో విస్తరణకు నిర్ణయం.
  • మహబూబ్ నగర్ రూట్ లో.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్ దాకా మెట్రో విస్తరణకు కేబినేట్ నిర్ణయం.
  • ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ దాకా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నం.
  • ఓల్డ్ సిటీ మెట్రోను కూడా పూర్తి చేస్తాం. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ గారు చెప్పారు.
  • ఓఆర్ఆర్ చుట్టూతా 159 కి.మీ. పూర్తి చేయాలని.. ఫార్మా సిటీ రాబోతున్నందున ఎయిర్ పోర్ట్ నుంచి జల్ పల్లి, తక్కు గూడా మీదుగా కందుకూరు దాకా మెట్రోను విస్తరించాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
  • మొత్తం మీద రూ.60 వేల కోట్ల రూపాయలతో, ఇదవరకే తీసుకున్న 101 కి.మీ. లకు అదనంగా మెట్రో రైల్ విస్తరించాలని రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 
  • రాబోయే మూడు, నాలుగేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని మున్సిపల్ శాఖకు సీఎం కేసీఆర్ గారు ఆదేశమిచ్చారు. పూర్తి ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలని మెట్రో రైల్ అథారిటీని, మున్సిపల్ శాఖను సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు. చిన్న చిన్నవి ఏమైనా మిగిలిపోయి ఉన్నా పూర్తి చేయాలని నిర్ణయం.
  • హైదరాబాద్ భవిష్యత్తును, ఉజ్జ్వలమైన ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణాను భారతదేశంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ గారి సంకల్పం ప్రకారం ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను తీసుకపోబోతున్నాం. 
  • కేంద్ర ప్రభుత్వం కూడా ఇతర పట్టణాలకు ఇచ్చినట్లే మనకూ సహాయం అందిస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ వారు సహాయం చేస్తే మంచిది.. సహాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 
  • కానీ ప్రయత్నం చేస్తాం.. అడుగుతాం.. సహజంగా ఆశిస్తాం.. వారు సహకరిస్తారని అనుకుంటున్నాం. వారు సహకరించకపోతే 2024 లో కేంద్రంలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలకంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అందులోనైనా సాధించుకుంటామనే విశ్వాసం మాకుంది.
  • ఈరోజు గవర్నర్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నది.
  • చట్ట సభలకు ఉండాల్సిన గౌరవాన్ని తగ్గిస్తూ ఈరోజు తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉన్న ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని, ప్రజల అభిప్రాయాన్ని అపహాస్యం చేసే విధంగా.. గవర్నర్ వ్యవస్థను అడ్డంపెట్టుకొని శాసనసభ ఆమోదించిన బిల్లులను తిరిగి పంపిన వ్యవహారంపై కేబినేట్ మొత్తం చర్చించింది.
  • ఏ బిల్లులనైతే మేము చట్టపరంగా ఆమోదించి గవర్నర్ కు పంపిన మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యా శాఖ బిల్లులను గవర్నర్ తిరిగి పంపారు. వాటిని మళ్లీ అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి పాస్ చేస్తాం. 
  • రాజ్యాంగం ప్రకారం రెండోసారి పాస్ చేసిన తర్వాత గవర్నర్ ఎవరున్నా..వారికి రాజకీయంగా ఎలాంటి అభిప్రాయాలున్నా.. వారికి ఏ రకమైన ఆలోచనలున్నా ఆమోదించడం ముఖ్యం. 
  • ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్నదే ఫైనల్ నిర్ణయం అవుతుంది. 
  • ఒక ఉదాత్తమైన, మానవీయమైన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ గారు, కేబినేట్ తీసుకున్నది.
  • భారతదేశంలోని 28 రాష్ట్రాలుంటే.. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అనాథ పిల్లల సంరక్షణ కోసం అనాథలైనా చిన్నారుల సంరక్షణ, వారి ఆలనాపాలనా చూస్తూ.. వారిని ఒక ‘చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్’ గా గుర్తిస్తూ ఒక ఆర్ఫన్ పాలసీని పకడ్బందీగా రూపొందించాలని శిశు సంక్షేమ శాఖ మంత్రికి, అధికారులకు సీఎం కేసీఆర్ గారు, కేబినేట్ సూచించడం జరిగింది. 
  • మానవీయ కోణంలో పేదల కోసం పనిచేస్తూ ఎన్నో అమలుచేస్తున్నది మన ప్రభుత్వం. అనాథ పిల్లలను గుర్తించి, వారికి ప్రభుత్వమే తల్లీతండ్రిగా ఉండి..వారే మన పిల్లలుగా భావించి, వారికి ఆశ్రయం కల్పించి, ప్రయోజకులుగా వారు ఎదిగి, వారికంటూ ఒక కుటుంబం ఉండే దాకా వారికి అండగా నిలబడాలనే ఒక సత్సంకల్పంతో, ఒక ఉదాత్తమైన ఆశయంతో చాలా సమగ్రమైన చర్చ కేబినేట్ చేసింది. మంత్రి వర్గ ఉప సంఘం ఈ విషయంలో పనిచేస్తా ఉంది. సీఎం కేసీఆర్ గారు కొన్ని సూచనలు చేసి వచ్చే కేబినేట్ సమావేశంలో తీసుకురావాలని ఆదేశించారు. వచ్చే కేబినేట్ సమావేశంలో దానిని ఆమోదిస్తాం.
  • గవర్నర్ కోటాలో శాసనమండలికి ఇద్దరు సభ్యుల ఎంపిక కూడా ఈరోజు కేబినేట్ ఆమోదం తెలుపడం జరిగింది. గతంలో సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం.. అల్ప సంఖ్యాకులుగా ఉన్న, ఎస్టీల్లో కూడా అల్ప సంఖ్యాకులుగా ఉన్న ఎరుకల సామాజికవర్గానికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు కుర్రా సత్యనారాయణను ఒక అభ్యర్థిగా, బలహీనవర్గాలకు సంబంధించి బలమైన గొంతు డాక్టర్ దాసోజు శ్రవణ్ లను గవర్నర్ నామినేషన్ ప్రకారం శాసనమండలి సభ్యులుగా అవకాశం ఇస్తూ రాష్ట్ర కేబినేట్ తీర్మానం చేసింది. వెంటనే గవర్నర్ కు ఆ ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది.
  • దాదాపు 50 అంశాల దాకా కేబినేట్ లో చర్చ జరిగింది.
  • మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక హార్టికల్చర్ కళాశాలకు కేబినేట్ ఆమోదం తెలిపింది.  
  • హైదరాబాద్ లో నిర్మించనున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు సంబంధించి ఆరోగ్య శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ.. గడ్డి అన్నారంలో, సనత్ నగర్ లో, గచ్చిబౌలిలో, అల్వాల్ లలో నాలుగు చోట్లా 50 శాతం జనరల్ కన్సల్టేషన్ పద్ధతిలో అంటే ఉస్మానియా, గాంధీ తరహాలో 50 శాతం పడకలు, మిగతా 50 శాతం నిమ్స్ తరహాలో ఈ హాస్పిటల్స్ ను నిర్మించాలని వైద్యశాఖను కేబినేట్ ఆదేశించడం జరిగింది. 
  • నిమ్స్ లో మరో 2 వేల పడకల ఏర్పాటుకు నిధుల సమీకరణకు దాదాపు రూ.1800 కోట్లకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
  • రాష్ట్రంలో పనిచేస్తున్న బీడీ కార్మికులకు ఇదివరకే పెన్షన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మమ్మెల్నెవరూ అడగలేదు కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఒక మానవీయ కోణంలో రూ.2,016 చొప్పున పెన్షన్ ఇస్తా ఉన్నం.  
  • బీడీ కార్మికులకే కాదు ఆరు వేలకు పైగా ఉన్న బీడీ టేకీదారులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర కేబినేట్ కార్మిక శాఖకు వెంటనే ఆదేశాలు ఇచ్చింది. వెంటనే అమలులోకి తీసుకొస్తుందని కార్మికశాఖ తెలిపింది.
  • తెలంగాణలోనే అతిపెద్ద రెండవ పట్టణం వరంగల్. వరంగల్ లో ఎయిర్ పోర్టు కావాలనే కోరిక ఎప్పటినుంచో ఉన్నది. మామునూరు ఎయిర్ పోర్ట్ గతంలో మూలకు పడ్డ విషయం తెలిసిందే.
  • వరంగల్ మామునూరుకు సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ని రోజులు రకరకాల కుంటిసాకులు చెబుతూ ఆలోచన చేసినప్పటికీ..వారడిగిన మొత్తం దాదాపు 253 ఎకరాల భూమిని కూడా ఇవ్వడానికి కేబినేట్ తీర్మానం చేసింది.
  • జీఎంఆర్ కి 150 కి.మీ. పరిధిలోనే వరంగల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. దాన్ని బీదర్ తరహాలో నడపాలని ప్లాన్ చేస్తా ఉన్నం. వెంటనే తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ గారు, కేబినేట్ లు పరిశ్రమల శాఖ, ఆర్ అండ్ బి శాఖలకు ఆదేశాలివ్వడం జరిగింది.
  • హైదరాబాద్ విమానాశ్రయం సంవత్సరంలో రెండున్నర కోట్ల మందికి సేవ చేస్తా ఉన్నది. హైదరాబాద్ కి దక్షిణ భాగాన శంషాబాద్ ఉన్నది. పెరుగుతున్న నగరాల్లో ఢిల్లీతో సహా రెండవ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి పూనుకుంటా ఉన్నరు. హైదరాబాద్ కి డిఫెన్స్ ఎయిర్ పోర్ట్ లు హకీంపేట్, దిండిగల్  ఎయిర్ పోర్ట్ లున్నవి. ఈ విషయంపై కేబినేట్ లో చర్చ జరిగింది.   
  • పూణే, గోవాలో ఎట్లా అయితే రక్షణ శాఖ, పౌరవిమాన సేవలు ఉపయోగించుకుంటారో హకీంపేట ఎయిర్ పోర్ట్ ని కూడా చేయాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర కేబినేట్ తీర్మానం చేసింది. 
  • దేశవ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, ఒంటరి తదితర కాపు కులాల అభ్యర్థన మేరకు సౌత్ ఇండియా ఫర్ కాపు కమ్యూనిటీ ఏర్పాటు కోసం స్థలం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
  • దేశంలో ఎక్కడాలేని విధంగా జిల్లాకో మెడికల్ కాలేజి ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం మరో 8 మెడికల్ కాలేజీలకు కేబినేట్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం.
  • వరదల్లో మరణించినవారందరికీ కేబినేట్ నివాళి అర్పించింది. వారికి ఎక్స్ గ్రేషియా వెంటనే అందించేలా చర్యలు తీసుకోనున్నది.
  • సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర మంత్రులు ఎక్కడికక్కడా నిమగ్నమై పనిచేసారు. వారందరికీ కేబినేట్ అభినందనలు తెలిపింది.
  • రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ద్వారా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 
  •    ఆరోగ్య సమస్యలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం, క్లోరినేషన్ చేయడం లాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక, పంచాయతీ రాజ్ శాఖలకు సీఎం కేసీఆర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.