- ఈనెల 7వ తేదీన జరగనున్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల కోసం పలు కార్యక్రమాలు ప్రారంభించనున్న ప్రభుత్వం
- ప్రజా ప్రతినిధులకు లేఖ రాసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారి ఆలోచనల మేరకు అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం అన్నారు మంత్రి కేటీఆర్. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు మంత్రి కేటీఆర్.
2016-2017 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ రూ. 1200 కోట్లు
చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏ ప్రభుత్వం కేటాయించని విధంగా 2016-2017 నుండి ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ రూ. 1200 కోట్ల చొప్పున కేటాయిస్తువస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో చేనేత కార్మికుల సంక్షేమం , ఉపాధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని తెలిపారు. అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యల పాలవుతున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. 2010 నుంచి ఉన్న లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయడంతో 10,148 చేనేత కార్మికులు రూ.28.97 కోట్ల ఋణాల నుండి విముక్తి అయ్యారు.
నేతన్నలకు సుమారు 41.2 కోట్ల సబ్సిడీ
రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేనేత వృత్తి పై ఆధారపడిన నేతన్నలను గుర్తిస్తూ, వారి మగ్గాలను జియో ట్యాగ్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితులపై పూర్తి అవగాహనతో అనేక కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం అని గుర్తు చేసారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా చేనేత మిత్ర పథకం ద్వారా దాదాపు 50% రాయితీని వస్త్రాలు, రసాయనాల కొనుగోలు పైన అందిస్తున్నామని తెలిపారు. చేనేత మిత్ర పథకం ద్వారా ఇప్పటివరకు 20500 మంది నేతన్నలకు సుమారు 41.2 కోట్ల సబ్సిడీని నేరుగా వారి ఖాతాలలోనే అందుకున్నారు.
40,000 మంది నేతన్నలకు బీమా కవరేజ్
నేతన్నలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న నేతన్నకు చేయూత కార్యక్రమంలో భాగంగా చేనేత కార్మికుడు పొదుపు చేసే 8 శాతానికి రెట్టింపుగా 16 శాతం, పవర్ లూం కార్మికులు పొదుపు చేసుకునే 8 శాతానికి అదనంగా మరో 8 శాతం మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. 2017 లో ప్రారంభమైన ఈ పథకాన్ని కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో లాకింగ్ పీరియడ్ ను సవరించి మరీ ముందస్తు వెసులుబాటు ఇవ్వడం వలన దాదాపు 100 కోట్ల రూపాయల ప్రయోజనాన్ని, రాష్ట్రంలోని 21 వేల నేతన్నలు అందుకున్నారు. నేత కార్మికుల కోరిక మేరకు ఈ పథకమును రూ.90.00 కోట్ల బడ్జెట్ ప్లాన్ తో తిరిగి ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో 32,328 మంది చేనేత కార్మికులు చేరారు. రాష్ట్రంలోని రైతన్నలకు అందుతున్న రైతు బీమా మాదిరే నేతన్నకు ప్రత్యేకంగా 5లక్షల రూపాయాల నేతన్నకు భీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 59 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న 40,000 మంది నేతన్నలకు బీమా కవరేజ్ ను అందిస్తున్నామని తెలిపారు.
TSCO ద్వారా ప్రత్యేక R&D విభాగము ఏర్పాటు
చేనేత కళ అంతరించి పోకుండా భవిష్యత్తు తరాలకు అందించాలన్న ఉదాత్తమైన లక్ష్యంతో TSCO ద్వారా ప్రత్యేక R&D విభాగము ఏర్పాటు చేసి, చేనేత రంగములో డిజైన్లు మరియు వస్త్రోత్పత్తి పరిశోధనలో భాగముగా… తెలంగాణలో ఒకప్పుడు ప్రాచుర్యము పొంది కాలక్రమేణా అంతరించిపోయిన చేనేత కళాకృతులను వెలికితీసి, వాటికి నవీనరీతులను జోడించడం జరిగింది. తద్వారా TSCO “పీతాంబరి పట్టు చీరలు”, “ఆర్మూర్ పట్టు చీరలు”, “హిమ్రా చేనేతలు”, “సిద్దిపేట గొల్లభామ చీరలు” “మహాదేవపూర్ టస్సర్ పట్టు చీరల”లాంటి ఒకప్పటి గొప్ప కళాకృతులను పరిశోధించి, తిరిగి వెలికితీసి మనుగడలోనికి తీసుకురావడం జరిగినది.
చేనేత రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న నేతన్నలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. పావలా వడ్డీ పథకం , మగ్గంల ఆధునీకరణ పథకం పెట్టడంతోపాటు చేనేత వస్త్ర ప్రదర్శనలు, చేనేత రంగంలో శిక్షణ మరియు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గద్వాలలో హ్యాండ్లూం పార్కు ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేసారు.
7500 మంది నేతన్నలతో రాష్ట్రస్థాయి చేనేతల సంబరాలు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేత అభివృద్ధి, సంక్షేమం కొరకు తెలంగాణలో అమలవుతున్న వినూత్న పథకాల పట్ల పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఒడిశా, కర్ణాటక , మధ్యప్రదేశ్, తమిళనాడు నుండి అధికారుల బృందాలు మన రాష్ట్రములో పర్యటించి, మన చేనేత పథకాలను అధ్యయనం చేసి ప్రశంసించాయన్నారు. ప్రతి ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలో చేనేత వారోత్సవాలు జరగనున్నాయి. దీంతోపాటు 7 తేదీ నుంచి 14వ తేదీ వరకు పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన కొనసాగుతుంది. BMR సార్థ ఫంక్షన్ హాల్ 7500 మంది నేతన్నలతో రాష్ట్రస్థాయి చేనేతల సంబరాలను నిర్వహించనున్నాం. కేవలం సంబరాలే కాకుండా ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక నేతన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించబోతున్నది.
నేతన్నలకు సమగ్ర ఆరోగ్య బీమా కార్యక్రమం
చేనేత మిత్ర కార్యక్రమాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేతన్నలకు సమగ్ర ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. దీనికి అదనంగా నేత్ననకు బీమా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించబోతున్నాం. ప్రస్తుతం ఉన్న పిట్ లూమ్స్ ను ఫ్రేమ్ లూమ్స్ గా అప్ గ్రేడ్ చేసేందుకు తెలంగాణ చేనేత మగ్గం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. హైదరాబాద్ లోని శిల్పారామంలో చేనేత హ్యాండీక్రాఫ్ట్ మ్యూజియం, ఉప్పల్ భగాయత్ లో కన్వెన్షన్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నామని తెలియజేసారు.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారితో పంచుకోవాలని ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో భాగంగా మీ పరిధిలో ఉన్న నేతన్నలతో జాతీయ చేనేత దినోత్సవ సంబురాల్లో కలిసి పాల్గొని, వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.