mt_logo

హైదరాబాద్‌ను వరల్డ్ క్లాస్ నగరంగా చూడాలని కృషి చేస్తున్నాం: మంత్రి కేటీఆర్

హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ ప్రతినిధులు వ్యాపార వర్గాల సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం కోసం భారత రాష్ట్ర సమితి ప్రణాళికలను కేటీఆర్ తెలియజేసారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రజని కాంత్‌కి కూడా హైదరాబాద్ లో మార్పు అర్థమైంది కానీ ఇక్కడున్న గజినీలకు అర్ధం కాలేదని ఎద్దేవా చేసారు. ఏపీ నుంచి వేరు పడినప్పుడు హైదరాబాద్, రాష్ట్రం ఏమవుతుంది అని ఎన్నో అనుమానాలు ఉండేవి. మార్పు 2014 లోనే వచ్చింది, ఆ మార్పుతో తెలంగాణ దేశంలో నెంబర్ 1 అయిందని తెలిపారు. 

9.5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనాకే పోయింది. 1 ఏడాది ఎన్నికల పోరాటం కేవలం 6.5 ఏళ్ళు మాత్రమే పరిపాలించగలిగామని అన్నారు.  మాది 6.5 ఏళ్ళు… వారిది 65 ఏళ్ల పాలన. ఈ తక్కువ సమయంలో ప్రజల కనీస అవసరాలు అన్ని తీర్చగలిగామని వ్యాఖ్యానించారు. రైతులకు విద్యుత్తు, నీళ్లు వంటివి సమగ్రంగా అందించాం. సమగ్ర, సమీకృత, సమతుల్యత కలిగిన వృద్ధి తెలంగాణ మోడల్. 25 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంపై  ప్రభావం చూపిన నేతలు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ అని వివరించారు. చంద్రబాబు ఐటీ వృద్ధికి పాటు పడితే, రాజశేఖర్ రెడ్డి పేదల కోసం చేశారు. కానీ కేసీఆర్ హయాంలో ఐటీ సహా పేదల వరకు అన్ని రంగాల వృద్ధికి కృషి చేసారని తెలియజేసారు.కేసీఆర్ నాయకత్వంలో 2021-22 నుంచి 22-23 లో ఐటీ ఎస్పోర్ట్స్ 57000 కోట్లు అని పేర్కొన్నారు. 

రెన్యువబుల్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం అని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వెహికల్ షటిల్ సర్వీస్ ద్వారా పొల్యూషన్ తగ్గించవచ్చని వివరించారు. గ్రీన్  బిల్డింగ్స్‌కి ప్రాధాన్యత ఇస్తాం. 977 అర్బన్ పార్క్‌లు ఏర్పాటు చేసాము. వాటిని  ఇంకా పెంచుతామని పేర్కొన్నారు. వేస్ట్ వాటర్ పాలసీ తెచ్చి కాలుష్యాన్ని నియంత్రణకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్‌ను మరింత  సేఫ్ సిటీగా మారుస్తాం.సైబర్ క్రైమ్ నియంత్రణకు మరింత కఠిన చట్టాలు తెస్తామని హామీ ఇచ్చారు. 

తెలంగాణలో ఏ ప్రాంతం నుంచి అయినా కేవలం ఒక గంటలో హైదరాబాద్ చేరుకునేలా ఒక  ట్రాన్స్‌పోర్ట్‌ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుందని వెల్లడించారు. హైదరాబాద్‌లో వరదల నియంత్రణ, డ్రైనేజీ నిర్వహణ ఏర్పాటుకు కృషి చేస్తాం.. హైదరాబాద్‌ను ఒలింపిక్స్ కోసం సిద్ధం చేయాలనేది మా కల అని తెలిపారు. 2047 కి హైదరాబాద్‌ను వరల్డ్ క్లాస్ నగరంగా చూడాలి అనుకుంటున్నాం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.