mt_logo

డిజిటల్ మాధ్యమాల ద్వారా కూడా టీ-సాట్ (T-SAT) సేవలు అందించడం అభినందనీయం: మంత్రి కేటీఆర్

టీ సాట్ (T-SAT) ఆరవ వార్షికోత్సవంలో మంత్రి కె.తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీ సాట్ ఉద్యోగులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  విశేషంగా అనుభవం ఉన్న శైలేష్ రెడ్డిని ఈ సంస్థకు సీఈఓ గా నియమించడం జరిగింది. ఆయన తన సమర్థతతో టీ సాట్ ద్వారా విద్యార్థులకు యువకులకు అద్భుతమైన సేవలు అందించేల సంస్థను రూపుదిద్దారు.  టీ సాట్ చాలా ప్రణాళికాబద్ధంగా ఆచరణాత్మకమైన పద్ధతిలో అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు.

తెలంగాణ రాకముందు మన టీవీగా కొన్ని ఇండ్లకు సంస్థలకు పరిమితంగా ఉండేది. ప్రభుత్వం వచ్చినాక ఈ సంస్థ సేవలను కేబుల్ ద్వారా విస్తృత పరచాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. దీంతో ఈరోజు 90 లక్షల మంది ఈ సంస్థ సేవలను అందుకునేందుకు వీలు కలుగుతున్నది.డిజిటల్ మాధ్యమాల ద్వారా కూడా టీ సాట్ సేవలు అందించడం అభినందనీయం అన్నారు మంత్రి. పదివేల గంటలకు పైగా కంటెంట్తో ప్రత్యేకంగా యాప్ ని తయారు చేయడం జరిగింది. దీనికి లక్షలాది డౌన్లోడ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈరోజు విద్యార్థులు నేర్చుకుంటున్న పద్ధతులు వేగంగా మారుతున్నాయి. కేవలం తరగతి గదిలోనే కాకుండా అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ మరియు ఇతర మాధ్యమాల ద్వారా కూడా విద్యార్థులు కొత్త అంశాలను నేర్చుకుంటున్నారని గుర్తు చేసారు.

మారుతున్న ధోరణులకు అనుగుణంగా సంస్థ కంటెంట్ లో కూడా అవసరమైన మార్పులు తీసుకురావాలని కేటీఆర్ సూచించారు. సంస్థకు ఉన్న విద్య , నిపుణ అనే రెండు ఛానల్ ద్వారా మరిన్ని సేవలు అందించేలా చూడాలి. విద్య ఛానల్ ఒకవైపు విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందిస్తూనే మరోవైపు నిపుణ ఛానల్ ద్వారా విద్యార్థులు మరియు ఇతరులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి అంశాల్లో కార్యక్రమాలు ప్రచారం చేయడం అభినందనీయం అన్నారు. 

రాష్ట్రంలో వస్తున్న నోటిఫికేషన్ లతోపాటు జాతీయ స్థాయిలో వస్తున్న అనేక ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఈ సంస్థ ద్వారా అందిస్తున్నాం అని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళందరికీ అవసరమైన కంటెంట్ ని అందించే ప్రణాళికలను రూపొందించాలన్నారు.

యానిమేషన్ మల్టీమీడియా వంటి అంశాలను జోడిస్తూ కంటెంట్ను మరింత ఆకర్షణీయంగా, ఆసక్తిగా రూపొందించే ప్రయత్నం చేయాలి, విద్యార్థులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ ఉద్యోగ పరీక్షలు మాదిరి నమూనా పరీక్షలు లేదా మాక్ టెస్టులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఉస్మానియా యూనివర్సిటీతో ఈరోజు టీ సాట్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సంతోషకరం అన్నారు. అప్పటికే తమ పురపాలక శాఖ ద్వారా నిజాం కాలేజీ హాస్టల్ల నిర్మాణానికి దాదాపు 32 కోట్లకు పైగా నిధులను కేటాయించాం. గర్ల్స్ హాస్టల్ ని పూర్తి చేశాం.  ఉస్మానియా యూనివర్సిటీకి కూడా సాధ్యమైనంత ఎక్కువ సహకారం ప్రభుత్వం తరపున అందిస్తాం అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇన్నోవేషన్ కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి… ఆ దిశగా క్యాంపస్ విద్యార్థులను ప్రోత్సాహం అందించాలని ప్రయత్నం చేయాలని కేటీఆర్ సూచన చేసారు.