ఆయన సాక్షాత్తూ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి.. బీఆర్ఎస్‌లో పెద్ద లీడర్.. అయినా..మురుగు కాలువల్లో చెత్తను చేతితో తీస్తూ.. దాన్ని కవర్లో వేస్తూ ముందుకుసాగారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను జనం కళ్లకుకట్టారు. ఆరడుగుల మనిషి నడుంవంచి డ్రైనేజీలో చెత్తను తీస్తుంటే అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. హరీశ్‌రావుసార్ గ్రేట్ అంటూ ప్రశంసించారు. సిద్దిపేట పట్టణంలోని 18వ వార్డులో మంత్రి హరీశ్‌రావు సోమవారం స్వచ్ఛ పట్టణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు చెప్పడం కాదు.. చేసి చూపిస్తేనే అర్థమవుతుందని ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. మురుగుకాలువల్లో చెత్త పేరుకుపోతే వచ్చే అనారోగ్య సమస్యలను లైవ్‌గా వివరించారు.
దోమలు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు సూచించారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉంటే దోమల లార్వా పెరిగిపోతుందని, అందుకే పూల కుండీలు.. కొబ్బరిచిప్పలు, టైర్లలో నీటిని తొలగించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. నివారణ కంటే జాగ్రత్త ఉత్తమమని సూచించారు. కాగా, స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా తమ ఇంటి ఎదుటకు సాక్షాత్తూ మంత్రి వచ్చి మురుగుకాలువల్లో చెత్తను తొలగిస్తుండడంతో కాలనీవాసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తప్పకుండా స్వచ్ఛత పాటిస్తామని మంత్రికి మాటిచ్చారు. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం ఉదయం నిర్వహించిన దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా కోకాపేటలోని తన నివాసంలో పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి హరీశ్‌రావు అందరికీ ఆదర్శంగా నిలిచారు.