mt_logo

2023లో దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో 43% తెలంగాణ నుండే: మంత్రి హరీష్ రావు

ఈ నెల 15న జరిగే మెడికల్ కాలేజీల ప్రారంభోత్స కార్యక్రమాల సన్నద్ధత కోసం మంత్రి కేటీఆర్‌తో కలిసి ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులతో మంత్రి హరీష్ రావు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈరోజు భారతదేశంలో అతి ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబడిందన్నారు. ప్రతి లక్ష జనాభాకి 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. 2014లో ఈ విషయంలో చిట్ట చివరి స్థానంలో ఉన్న తెలంగాణ, నేడు అగ్రస్థానంలోకి చేరింది అని అన్నారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే కనీసం ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదన్నారు. మరోవైపు 50 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ ఉద్యమ ఒత్తిడి వలన నిజామాబాద్, ఆదిలాబాద్‌లో మాత్రమే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

మన ప్రభుత్వం రాకముందు తెలంగాణ విద్యార్థులు వైద్య విద్య కోసం పక్క రాష్ట్రాల నుంచి మొదలుకొని ఉక్రెయిన్, రష్యా వంటి విదేశాలకు వెళ్లి అనేక కష్టాలు పడి చదువుకునేవారు, కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి, తెలంగాణ పిల్లలు తెలంగాణ రాష్ట్రంలోని ఎలాంటి కష్టం లేకుండా వైద్య విద్యను అభ్యసించే గొప్ప సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు.

కొత్త మెడికల్ కాలేజీలో ఏర్పాటు వలన అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య సౌకర్యాలను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రం వచ్చిన రోజు ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తు చేసారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో 43% తెలంగాణ రాష్ట్రంలోనే పెరిగాయన్నారు.