mt_logo

ఈసీకి ఫిర్యాదు చేసి రైతుల నోటికాడ బుక్క ఆపిన కాంగ్రెస్ దగాకోర్లు: మంత్రి హరీష్ రావు

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాణిక్ రావుకి మద్ధతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. జహీరాబాద్‌లో వెలుగులు నింపింది మన కేసీఆర్. మంచి నీళ్లు ఇచ్చింది మన కారు గుర్తు అని తెలిపారు.

మూడు తారీకు తర్వాత వచ్చేది కేసీఆరే.. 

రైతులకు పెట్టుబడి సాయం చేస్తుంటే బిచ్చమేస్తున్నరని కాంగ్రెస్ చెప్తోంది. రైతు బంధుకు ఈసీ పర్మిషన్ ఇచ్చిందని చెప్పినా. ఇందులో కొత్త విషయం ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసి రైతుల నోటికాడ బుక్క ఆపిండ్రు. ఎన్నిరోజులు ఆపుతరు. మూడు తారీకు తర్వాత వచ్చేది కేసీఆరే.. తర్వాత రోజు టింగు టింగుమని పైసలు అకౌంట్ల పడతయన్నారు. రైతులతో మాది ఓటు బంధం కాదు పేగు బంధం అని స్పష్టం చేసారు. 

రైతులు ఓటుతో కాంగ్రెస్‌కి పోటు పొడవాలి

2017లో రైతు బంధు ఇచ్చినప్పుడు ఓట్లు లేవు. ఓట్ల కోసం రైతు బంధు ఇవ్వట్లేదన్నారు. కర్ణాటకలో రైతు బంధును ఆపేసిన కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తుంది. ఈ పార్టీకి రైతులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ చేసిన రైతు బంధుపై కుట్రను వివరించాలి. తెలంగాణ రైతులు ఓటుతో కాంగ్రెస్‌కి పోటు పొడవాలి. కాంగ్రెస్ పార్టీ ఖతం కావాలి. లేదంటే రైతు బంధు ఖతమైతదని హెచ్చరించారు. మాణిక్ రావుని గెలిపిస్తే జహీరాబాద్ నియోజకవర్గానికి 6 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడుగుతాం. లక్ష ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే అని వెల్లడించారు. రిస్క్ తీసుకోకుండా కారుకు ఓటెయ్యాలని సూచించారు. మాణిక్ రావును గెలిపిస్తే ఝరాసంగానికి జూనియర్ కాలేజ్ మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.