ఇళ్లు లేని నిరుపేదల జీవితాల్లో సంతోషం చూసేందుకు సీఎం కేసీఆర్ వారి సొంతింటి కలలను నిజం చేస్తూ జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 10 వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం హట్టిగూడలో 432 మంది ఇళ్లు లేని నిరుపేదలకు 2వ విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పెద్దంబర్‌పేట మున్సిపాలిటీ చైర్పర్సన్ స్వప్న తదితరులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన అమ్మ మీ ఇంట్లో మీరే ఉండండి అని లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్లలో తామే ఉండాలని, ఇతరులకు ఇవ్వరాదని అమ్మరాదని సూచించారు. అభివృద్ధిలో భారతదేశ మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని వ్యాఖ్యానించారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా జీహెచ్ఎంసీ పరిధిలోని నిరుపేదలకు ధనవంతుల ఇళ్ల తరహాలో రూ. 10వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ నిర్మించి ఇస్తున్నారన్నారు.
ఇందులో భాగంగా తొలి విడతలో 11,700 అందివ్వగా 2వ విడతలో 13,200 ఇళ్లను 9 ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో 9872, మహేశ్వరం నియోజకవర్గంలో 9892, రాజేంద్రనగర్‌లో 696, ఎల్బీనగర్ లో 944, చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లిలో 1512, శేర్లింగంపల్లిలో 344 ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రోడ్లు, బ్రిడ్జీలు తదితర మౌలిక సదుపాలను లక్షల కోట్ల నిధులతో కల్పిస్తున్నారని మహేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, పేదలకు ఇళ్ల నిర్మాణంతో పాటు సంక్షేమ పథకాలుగా రైతులకు రైతుబంధు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు.