mt_logo

మేడిగడ్డ బ్యారేజీను వెంటనే రిపేర్ చేసి రైతులకు నీళ్ళివ్వాలి: హరీష్ రావు

అన్నారం బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తే మేము ఊరుకోం. మేడిగడ్డ తెలంగాణ భవిష్యత్‌కు సంబందించిన సమస్య. వెంటనే మేడిగడ్డ రిపేర్ చేసి వానాకాలం లోపు రైతులకు నీళ్ళు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు కలిగితే కేసీఆర్ ఊరుకోడు మేడిగడ్డకు వెళ్తున్నాం అంటేనే కాంగ్రెస్ పోటీ యాత్రలు చేస్తుంది. నల్గొండలో సభతో కృష్ణ జలాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మేడిగడ్డ రిపేర్ చేస్తామని ఉత్తమ కుమార్ చెప్పారంటే మా యాత్ర సక్సెస్ అయింది అని పేర్కొన్నారు.

గత ప్రభుత్వాలను బద్నాం చేయాలనేది తప్ప వేరే కనిపించడం లేదు. గోబెల్స్ ప్రచారం చేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్న ప్రభుత్వం ఎదైన ఉందా అంటే ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే అని విమర్శించారు.

కాళేశ్వరం వంద కంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. మూడు పిల్లర్లు కుంగితె ప్రాజెక్ట్ మొత్తం వ్యర్థం అయిందని అనడం దారుణం. రానున్న వానాకాలం లోపే మేడిగడ్డ రిపేరు చేసి రైతులను ఆదుకోవాలి అని హరీష్ రావు అన్నారు.

రాజకీయాలకు ఇది సమయం కాదు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దు, వానాకాలం లోపు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. అందుకే కాళేశ్వరం పై కుట్రలు చేస్తున్నారు అని పేర్కొన్నాడు.

ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డికి లేదు, కనీసం పరిపాలనలో అయిన నిజాయితీ నిరూపించుకోవాలి. గత కాంగ్రెస్ హయాంలో జరిగినంత అవినీతి ఎన్నడూ జరగలేదు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారు ఆనాటి కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.

7 ఏళ్లు అధికారంలో వుంటే తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎత్తలేదు కాంగ్రెస్.. 7 ఏండ్లు వృధా చేశారు, కానీ ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు కానీ.. నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు.

ప్రతిపాదిత జీవోతో ఒక్క ప్రాజెక్ట్ అయిన పూర్తి అయిందో చెప్పాలి.. కాళేశ్వరం కనీసం రెండు రెట్లు కూడా అంచనా పెరగలేదు. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజం అవుతుందని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు అని అన్నారు.

కాళేశ్వరంతో 200 శాతం మత్స సంపద పెరిగింది. కాళేశ్వరం నీళ్ళు  చెరువులకు అనుసంధానం చేసిన నాయకుడు కేసీఆర్.. 40 ఏళ్లలో చేసిన ఆయకట్టు మేము 4 ఏళ్లలో చేసి చూపాం అని తెలిపారు.

సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు పాలమూరు పర్యటన చేస్తున్నారు.. కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకు పోయాయి. కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి కట్టిన పోలవరం కొట్టుకుపోయింది నిజం కాదా.. పోలవరం కొట్టుకుపోయి 5 యేళ్లు అయిన NDSA రిపోర్ట్ రాలేదు, కానీ మేడిగడ్డకు రెండు రోజులకే రిపోర్ట్ వచ్చింది.. జరిగిన దాని మీద విచారణ చేసి దోషులను శిక్షించండి కానీ కాలయాపన చేసి రైతులను మోసం చేయద్దు అని హరీష్ రావు సూచించారు.