mt_logo

మీడియా పక్షపాతం తెలుసుకోవడం ఎలా?

 

By: గుణవీర శరత్ చంద్ర 

మీడియా పక్షపాతం తెలుసుకోవడం ఎలా?
ఏ చానెళ్లు ఎవరి పక్షం వహిస్తున్నాయో అర్థం చేసుకోవడం ఎలా?
తెలంగాణను వ్యతిరేకిస్తున్నది ఎవరు? సమైక్యాంధ్రను మోస్తున్నది ఎవరు?ఎలా నిర్ధారించుకోవాలి?
………..
చాలా సులువు….కావూరి వ్యాఖ్యలపై ఏబీఎన్, ఎన్‌టీవీ, టీవీ9, స్టూడియో ఎన్, జెమినీ….చానెళ్లు ఎలా స్పందించాయి?

‘కావూరి యూటర్న్’, ‘నాడేమన్నాడు….నేడేమన్నాడు’ అని ఒక చానెల్ యాగీ చేస్తే,
‘కావ్ కావ్…కావూరి’, ‘నాడు… నేడు’ అని ఇంకో చానెల్ రోజంతా ఊదరగొట్టాయి.
మరో చానెల్ ‘మాట మార్చిన కావూరి’ అని ఒక చాంతాడంత కామెంటరీ రాసింది.
తెలంగాణ వచ్చేస్తుందేమో అన్నంత భయంతో రోజంతా ఒకటే ఏడుపు, గోలగోల.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే…..

ఇవే 9 డిసెంబరు 2009లో చిదంబరం ప్రకటన వచ్చిన రోజు చంద్రబాబు వ్యాఖ్యలపై ఈ చానెళ్లు ఎలా స్పందించాయి? గుర్తుందా?
‘మాట మార్చిన బాబు’ అని శీర్షికలు పెట్టలేదు. ‘అసెంబ్లీలో, అఖిలపక్షలంలో సై అని ఆ తర్వాత ప్లేటు ఫిరాయించిన బాబు, కాంగ్రెస్’ అని ఏ చానెలూ ప్రసారం చేయలేదు. ‘రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు’ అని చంద్రబాబు చేసిన ప్రకటనను యథాతథంగా ప్రచురించి, సీమాంధ్రలో మహోద్యమం జరగబోతోందంటూ బిల్డప్ ఇచ్చాయి. సీమాంధ్ర రాజకీయ నాయకులు డమ్మీ రాజీనామా ఉద్యమంతో పులకించిపోయాయి.

వీళ్ల పార్టీ ఏదో, వీళ్ల ప్రాంతమేదో, వీళ్ల ప్రయోజనాలేమిటో, వీళ్ల సామాజిక వర్గం ఏదో ఇప్పటికయినా అర్థమవుతోందా?

ఈ చానెళ్లు కావూరి ప్రకటన తెలంగాణకు అనుకూలమని భావించి ఆయన్ను చితక్కొట్టాలని కట్టకట్టుకుని దాడిచేశాయి. అశ్శరభ శరభ అని తాండవం చేశాయి. చంద్రబాబు ప్రకటన తెలంగాణకు వ్యతిరేకం కాబట్టి ఆరోజు ఇదే చానెళ్లు తేలుకుట్టిన దొంగల్లా బాబు ప్రకటన సబబే అన్నట్టు వ్యవహరించాయి. కావూరి పదవి వచ్చిందని మాట మార్చారా అని నీతిప్రశ్నలు కురిపిస్తున్న ఈ గురివిందలు, చంద్రబాబు మీకు ఏం పెట్టాడని, ఏం చేశాడని ఇంతగా మోసుకొస్తున్నారు? సమైక్యాంధ్ర వల్ల అనుభవిస్తున్న భోగాలు ఏం పోతాయని మీరు తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు?

ఇంకా

ఆంధ్రా యూనివర్సిటీలో పదిమంది పోగయితే మహోద్యమం రాబోతోందని ఈ చానెళ్లన్నీ ఊదరగొడుతున్నాయి. ఉస్మానియాలో విద్యార్థుల మూపులపై బాష్పవాయుగోళాలు బద్దలవుతున్నా, ఇక్క పిల్లలు మరణిస్తున్నా ఏమీ ఎరగనట్టు, ఏమీ తెలియనట్టు నటిస్తుంటాయి. ఒక వేళ ఆ వార్తలు ఇవ్వాల్సి వచ్చినా తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నిస్తుంటాయి.

కాంగ్రెస్, తెలుగుదేశం, చిరంజీవి పార్టీ రాజకీయ ఘాతుక చర్యల వల్ల తెలంగాణలో వెయ్యిమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు. దానిని మించినది. మానవ వైపరీత్యం. రాజకీయ వైపరీత్యం. తెలిసి చేసిన ఘాతుకం. మరి ఒక్కనాడు, ఒక్క కుటుంబాన్ని కూడా చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదో ఈ చానెళ్లు, పత్రికలు రాయవు. ఈ వైపరీత్యాన్ని ఆపగలిగిన శక్తి ఉండీ ఎందుకు ఆపడంలేదో ఈ చానెళ్లు ప్రశ్నించవు.

కానీ అమెరికా నుంచి హటాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమై ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకునేందుకు ఆయన చేసిన హడావిడి మాత్రం ఈ పత్రికలు, చానెళ్లకు పండగ. భారత ప్రభుత్వం వేలాది మందిని ఉత్తరాఖండ్ నుంచి తరలించి ఆదుకుంది. వైమానిక దళ హెలికాప్టర్లు వెయ్యి ట్రిప్పులకు పైగా కొండల్లో కోనల్లో తిరిగి బాధితులను ఒడ్డుకు చేర్చాయి. బాధితులను దరి చేర్చడానికి వేలాది మంది సైనికులు రేయింబవళ్లు అక్కడ పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 1300 మందిని గమ్యస్థానాలకు చేర్చింది. చంద్రబాబు రాష్ట్రానికి తీసుకువచ్చింది సుమారు 350 మంది. ఎంతమందిని తీసుకువచ్చినా అది మంచి పనే. అందుకు ఆయన అభినందనీయుడే. కానీ ఆయనను దేవుడిని చేశారు. చంద్రన్నను చేశారు. మహాత్ముడిని చేశారు. నీవేదిక్కని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని రాశారు. ఈ పత్రికలు, చానెళ్లది మామూలు పులకింత కాదు. బాధితులను ఆదుకున్న ప్రతిష్ఠను మొత్తం బాబు అకౌంట్‌లో జమ చేశారు. కాంగ్రెస్ హనుమంతుడు యథావిధిగా వీరి ఎత్తునుచిత్తు చేశాడు. డెహరాడూన్ విమానాశ్రయంలో సీను క్రియేట్ చేసి బాబు పరువు, తన పరువు మొత్తంగా తెలుగువాళ్ల పరువు పంచనామా చేశాడు.

చాలా మంది ఈ చానెళ్లకు, పత్రికలకు, చంద్రబాబుకు రెండు కళ్లు ఉన్నాయని, వారిది రెండు కళ్ల సిద్ధాంతమని నమ్ముతూ ఉంటారు. అది రొంబా మోసం. వారిది ఎన్ని కళ్లు ఉన్నా ఒకటే దృష్టి. ఒకటే లక్ష్యం. ఒకటే గమ్యం. ఒకటే ప్రయోజనం. చంద్రబాబు జిందాబాద్. సమైక్యాంధ్ర జిందాబాద్. తెలంగాణ రావద్దు, రానీయొద్దు. జాగ్రత్తగా ఉండాల్సింది తెలంగాణవాళ్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *