ఇంట్లో అందరి బాగోగులు చూసే మహిళ ఆరోగ్యం బాగుంటే.. ఆ ఇంటి ఆరోగ్యమే బాగుంటుంది. ప్రాథమిక దశలోనే మహిళల్లో అనారోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వైద్యం అందిస్తే వారు ఆరోగ్యవంతులుగా తయారుకావడంతోపాటు ఆరోగ్యవంతమైన సమాజం ఆవిష్కృతమవుతుంది. అందుకే ప్రతి ఇంటి లక్ష్మి ఆరోగ్యం కోసం తెలంగాణ సర్కారు ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది మార్చి 8న ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖామంత్రి హరీశ్ రావు కరీంనగర్‌లోని అర్బన్ హెల్త్‌సెంటర్‌లో ప్రారంభించారు. అదే నెల 14న మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో వైద్య సేవలతో ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి రోజు 4,793 మంది మహిళలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఈ సేవలను రాష్ట్రంలోని 272 కేంద్రాలకు విస్తరించారు. ఈ కార్యక్రమానికి మహిళలనుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పటివరకూ 1,85,492 మంది మహిళలు ఆరోగ్య పరీక్షలు చేసుకోగా, ఉచితంగా మందులు అందజేశారు. శస్త్రిచికిత్సలు అవసరమైనవారికి ఇతర దవాఖానలకు రెఫర్ చేశారు.
ఆరోగ్య మహిళ విశేషాలు..
- ఈ పథకాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2023 మార్చి 8న ప్రారంభించారు.
-మొదట 100 కేంద్రాల్లో మహిళలకు స్క్రీనింగ్ ప్రారంభించి.. అనంతరం 272 కేంద్రాలకు విస్తరించారు.
-ఈ కేంద్రాల్లో మహిళలకు 8 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
-డయాబెటిస్, బీపీ, ఎనీమియా, ఓరల్, సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ల స్క్రీనింగ్, థైరాయిడ్, పోషకాల లోపం, అయోడిన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్ బీ12, విటమిన్ డీ, మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ, మెనోపాజ్ దశ, నెలసరి, సంతాన సంబంధిత పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేస్తున్నారు
-సమస్యలు ఉంటే వెంటనే వైద్యం ప్రారంభిస్తున్నారు. ఉచితంగా మందుల అందజేస్తున్నారు.
-శస్త్రచికిత్సలు, హైలెవల్ ట్రీట్‌మెంట్ అవసరమున్నవారికి పెద్ద దవాఖానలకు రిఫర్ చేస్తున్నారు.
-అసరమైనవారికి మమ్మోగ్రాం, అల్ట్రాసౌండ్, కొలనోస్కోపీ, క్రియోథెరపీ, పాప్‌స్మియర్, బయాప్సీ వంటి పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నారు.
-ఇప్పటివరకూ 20 మంగళవారాల్లో విజయవంతంగా మహిళలకు పరీక్షలు నిర్వహించారు. - కార్యక్రమం ప్రారంభం నుంచి మొత్తం 1,85,492 మంది మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకొన్నారు. ఉచితంగా మందులు పొందడంతోపాటు శస్త్రచికిత్సలు చేయించుకొన్నారు.