రెండు తెగల కొట్లాటతో 70 రోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతున్నది. మణిపూర్‌లో కుకీ తెగపై మైతీ తెగ ప్రజలు అకృత్యాలకు పాల్పడుతున్నారు. నిత్య ఘర్షణలతో మణిపూర్ అగ్ని గుండం అవుతున్నది. ఆ రాష్ట్రంలో కుకీ తెగ మహిళలను రోడ్డుపై నగ్నంగా ఊరేగించిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై యావత్తు దేశం మండిపోతున్నది. ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ప్రధాని మోదీ ఇంతవరకూ నోరు మెదపడం లేదు. ఘర్షణలను అదుపుచేయగలిగే సామర్థ్యం ఉన్నా చడీచప్పుడు చేయడంలేదు. ఆయన బాటలోనే నార్త్ ఈస్ట్రన్ రీజియన్ డెవలప్‌మెంట్ మినిస్టర్‌గా ఉన్న కిషన్‌రెడ్డి పయనిస్తున్నారు. చిన్న చిన్న విషయాలనే ట్విట్టర్‌లో పంచుకొనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. మణిపూర్ మారణహోమంపై ఒక్క పోస్టు పెట్టలేదు. అలాగే, ఈ ఘటనపై ప్రశ్నించిన విలేకరులతో దురుసుగా ప్రవర్తించి తన బాధ్యతారాహిత్యాన్ని చాటుకొన్నారు.
ఈశాన్యంతో నాకేం సంబంధం?
కిషన్‌రెడ్డి..కేంద్రమంత్రి. సాంస్కృతిక, పర్యాటకంతోపాటు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ ఆయన చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం మణిపూర్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. అది ఈశాన్య రాష్ట్రం. అంటే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సంబంధం ఉన్న అంశం. అయితే, దీనిపై ఓ విలేకరి కేంద్రమంత్రిని ప్రశ్రించగా.. బాధ్యతారాహిత్య సమాధానం ఇచ్చారు. *ఈశాన్యంతో నాకేం సంబంధం.. అది నా పరిధిలో లేని అంశం* అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు విన్న విలేకరితోపాటు అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. నార్త్ ఈస్ట్రన్ రీజియన్ డెవలప్‌మెంట్ మినిస్టర్‌గా ఉన్న కిషన్‌రెడ్డి పరిధిలోకి మణిపూర్ రాదా? లేక ఈ విషయం ఆయనకు తెలియదా? అంటూ అందరూ గుసగుసలాడారు. ఆ విలేకరి ఒక్క నిమిషంలో తేరుకొని మళ్లీ కిషన్‌రెడ్డి ముందు మైక్ పెట్టగా.. ఆయన దాన్ని విసిరేస్తూ లోనికి వెళ్లిపోయారు. విలేకరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈశాన్య ప్రాంతంతో సంబంధం ఉన్న శాఖను నిర్వహిస్తూ మణిపూర్ అంశంపై తన పరిధిలోకి రాదంటూ వెళ్లిపోయిన కిషన్‌రెడ్డి వ్యవహారం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి కిషన్‌రెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టిన పార్టీ అధ్యక్ష పదవికి ఎంతమేర న్యాయం చేస్తారో అంటూ బీజేపీ నాయకులే అనుమానం వ్యక్తంచేస్తున్నారు.