mt_logo

కరువునేల‌కు కాళేశ్వర గంగ.. మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్

  • కన్నీరు పారిన చోటే గంగ పరవళ్లు
  • మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్‌: సిరిసిల్ల‌.. మెట్ట‌ప్రాంతం.. తలాపునే మానేరువాగు ఉన్నా చుక్క నీరు ల‌భించని దుస్థితి. వ‌ర్షాధారంపైనే పంట‌లు సాగుచేసుకోవాల్సిన ప‌రిస్థితి. ఆ ఏడు వ‌ర్షాలు లేకుంటే ఏడాదంతా క‌న్నీటిసాగే. కానీ స్వ‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో నాలుగేండ్ల‌లోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు కాళేశ్వ‌రం రూపుదిద్దుకొన్న‌ది. మ‌ధ్య‌మానేరు ప్రాజెక్టు పూర్త‌య్యింది. మెట్ట‌ప్రాంతంలోకి గోదార‌మ్మ గ‌ల‌గ‌లా పారి సిరిసిల్ల ప్రాంత అన్న‌దాత‌ల క‌న్నీళ్ల‌ను దూరం చేసింది. ఒక‌నాడు బీడుబ‌డ్డ భూములు దిగువ‌, మ‌ధ్య మానేరుతో నేడు ప‌సిడిపంట‌ల‌తో ప‌ర‌వ‌శించిపోతున్నాయి. ఇప్పుడు ఎగువ మానేరు వంతు వ‌చ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతున్నది. గోదావరి జలాలు మానేటికి ఎదురెక్కనున్న శుభసమయం ఆసన్నమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లింక్‌-3లో భాగంగా చేపట్టిన 9వ ప్యాకేజీ పనులు సంపూర్ణమయ్యాయి. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట వద్ద చేపట్టిన రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయ్యింది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఇరిగేషన్‌శాఖ అధికారులు నాలుగురోజులపాటు రేయింబవళ్లు శ్రమించి మానేరు రామప్పగుట్ట నుంచి టన్నెల్‌ ద్వారా మల్కపేట వద్ద గల సర్జిపూల్‌కు నీటిని తరలించారు. రెండో పంపుతో ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించి సర్జిపూల్‌ నుంచి 130 మీటర్ల ఎత్తున ఉన్న రిజర్వాయర్‌లోకి గోదారమ్మను ప‌రుగులు తీయించారు. ఇక అతిత్వ‌ర‌లోనే శ్రీరాజరాజేశ్వర జలాశయం (మ‌ధ్య‌మానేరు) నుంచి గంభీరావుపేట మండల నర్మలా వద్ద ఎగువమానేరు ప్రాజెక్టులోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కనున్నాయి.

దశాబ్దాల కల ఇలా సాకారం

-ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల పథకం చేపట్టి సాగునీరు అందించాలని రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు దశాబ్దాలుగా డిమాండ్‌ చేసినా సమైక్య పాలకులు పట్టించుకోలేదు. దీంతో అన్న‌దాత‌ల‌కు క‌ష్టాల‌సాగు త‌ప్ప‌లేదు.

-స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ మెట్ట ప్రాంతాలైన సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 96,150 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్‌-3కి రూపకల్పన చేశారు.

-సిరిసిల్ల రామప్పగుట్టల వరకు ఎదురెక్కి వచ్చిన గోదావరి జలాలను గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయంలోకి ఎత్తిపోసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

-రూ.1,500 కోట్లతో పనులు చేపట్టగా సొరంగమార్గాలు, గ్రావిటీ కెనాల్స్‌, పంప్‌హౌజ్‌లు, 3 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయ్యింది. వీటితోపాటు ఐదు డిస్ట్రిబ్యూటరీలు, ఫీడర్‌ చానల్‌ పనులు కూడా పూర్తయ్యాయి. రామప్పగుట్ట నుంచి కోనరావుపేట మండలం మల్కపేట వరకు భూగర్భ కాలువను 12.3 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. టన్నెల్‌కు సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు కాగా, మల్కపేటలోని 3 టీఎంసీల రిజర్వాయర్‌కు సుమారు రూ.500 కోట్ల వరకు ఖర్చు చేశారు. 130 మీటర్ల లోతులోని సర్జిపూల్‌ నుంచి 1,100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు 30 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్తు మోటర్లను బిగించారు. ఒక్కో మోటర్‌ 550 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నది.

-ఏడు గుట్టలను అనుసంధానం చేస్తూ మల్కపేట రిజర్వాయర్‌ను నిర్మించారు. ఐదు కిలోమీటర్ల పొడవు గల ఆరు బండ్‌లను నిర్మించారు. ఒక్కో బండ్‌ కిలోమీటర్‌ పొడవు ఉంటుంది. సర్జిపూల్‌ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 90 మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా, 33/11కేవీ విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు.

-మల్కపేట రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయి, ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతం కావడంతో గోదావరి జలాలతో 150 చెరువులను నింపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సీజన్‌ నుంచే సాగునీటిని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

-లింక్‌-3లో ప్రధానంగా రెండు లిఫ్ట్‌లకు రూపకల్పన చేయగా పూర్తిగా ఎత్తు మీద ఉన్న పలు ప్రాంతాలకు సైతం సాగునీటిని అందించాలనే లక్ష్యంతో అధికారులు పలు చోట్ల అదనపు లిఫ్ట్‌లను సైతం ఏర్పాటు చేశారు.

-మల్కపేట రిజర్వాయర్‌ నుంచి మైసమ్మ చెరువుకు జలాలను తరలించే ప్రధాన గ్రావిటీ కెనాల్‌ మీద 6.1 కిలోమీటర్ల వద్ద కుడివైపున మొదటి అదనపు లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. మల్కపేట రిజర్వాయర్‌ నుంచి 7.37 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఎడమ ప్రధాన కాలువపై 1.6 కిలోమీటర్ల వద్ద 2వ అదనపు లిఫ్ట్‌, 6.7 కిలోమీటర్ల వద్ద 3వ అదనపు లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా వీర్నపల్లిలో 5,800 ఎకరాలకు, కోనరావుపేటలో 4,200 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

జలాల తరలింపు ఇలా..

రాజరాజేశ్వర జలాశయం నుంచి 2.5 కిలోమీటర్ల అప్రోచ్‌ చానల్‌ ద్వారా గోదావరి జలాలను హెడ్‌రెగ్యులేటర్‌కు తరలిస్తారు.
అక్కడి నుంచి 12.5 కిలోమీటర్ల సొరంగమార్గం ద్వారా గోదావరి నదీ జలాలను ధర్మారం గ్రామం వద్ద 85.30 మీటర్ల పొడవు, 20.30 మీటర్ల వెడల్పుతో నిర్మించిన సర్జ్‌పూల్‌కు తరలిస్తారు.
287 మీటర్ల లోపల ఉన్న సర్జ్‌పూల్‌ నుంచి గోదావరి జలాలను 30 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉన్న రెండు మోటర్ల ద్వారా లిఫ్ట్‌ చేసి 435 మీటర్ల పైన ఉన్న మల్కపేట రిజర్వాయర్‌కు తరలిస్తారు.
మల్కపేట రిజర్వాయర్‌ నుంచి 13.42 గ్రావిటీ కెనాల్‌ ద్వారా జలాలను తిమ్మాపూర్‌ గ్రామంలోని మైస మ్మ చెరువుకు తరలిస్తారు.
మైసమ్మ చెరువు నుంచి 4.2 గ్రావిటీ కెనాల్‌ ద్వారా జలాలను సముద్రలింగాపూర్‌లోని సింగసముద్రం జలాశయానికి తరలిస్తారు.
అక్కడి నుంచి జలాలను ధర్మన్నపేట వద్ద ఉన్న సర్జ్‌పూల్‌కు తరలిస్తారు.
2.25 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు మోటర్ల ద్వారా జలాలను 418 మీటర్ల నుంచి లిఫ్ట్‌ చేసి, 5.70 కిలోమీటర్ల పొడవుతో ఏర్పాటు చేసిన ప్రెషర్‌మెయిన్స్‌ ద్వారా 465 మీటర్ల ఎత్తులో ఉన్న బట్టలచెరువులోకి జలాలను తరలిస్తారు.
ముస్తాఫానగర్‌లోని బట్టలచెరువు నుంచి 3.5 గ్రావిటీ కెనాల్‌ ద్వారా జలాలను గంభీరావుపేట మండలం నర్మాల వద్దనున్న ఎగువ మానేరు ప్రాజెక్టుకు తరలిస్తారు.

మంత్రి కేటీఆర్ కృషితో లక్ష ఎకరాలకు సాగునీరు

మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్న్‌ సక్సెస్‌ కావడంతో మెట్ట ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గోదార‌మ్మ‌ను ఎదురెక్కించి త‌మ పొలాల‌కు మ‌లుపుకొస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎగువ మానేరు కింద ఉన్న ల‌క్ష ఎకరాలకు సాగు నీరందనున్నది. సిరిసిల్ల నియోజకవర్గంలో 64,470 ఎకరాలు, వేములవాడ నియోజకవర్గంలో 31,680 ఎకరాలకుపైగా సాగునీరు అందుతున్నది. సిరిసిల్ల మండలంలో 8,750 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 29,875, గంభీరావుపేటలో 9,279, ముస్తాబాద్‌లో 9,599, వేములవాడ అర్బన్‌లో 7,805, వేములవాడ రూరల్‌లో 1,000, కోనరావుపేటలో 22,875, వీర్నపల్లి మండలంలో 6,967 ఎకరాలు ప‌చ్చ‌ని పంట‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడ‌నున్నాయి.