mt_logo

హైదరాబాద్‌ మలక్‌పేటలో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌కు భూమిపూజ చేసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ మలక్‌పేటలో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు.  ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ టవర్‌ని నిర్మాణం చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు ఈ ఐటీ టవర్ ద్వారా ప్రత్యక్ష పరోక్షంగా సుమారు 50 వేల ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మొదటి విడతగా 10.35 ఎకరాల్లో రూ.700 కోట్ల వ్యయంతో 21 అంతస్తులతో 20 లక్షల చదరపు అడుగుల్లో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామని తెలియజేశారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం దూసుకెళ్తున్నదని చెప్పారు. వరుసగా రెండు సంవత్సరాలపాటు బెంగళూరు కంటే అధికంగా ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్ కల్పిస్తున్నదన్నారు. ప్రభుత్వ పాలసీలు, నగర అభివృద్ధి వలన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు నగరంలో భారీగా తమ కార్యకలాపాలను విస్తరించాయన్నారు. మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి పెద్ద కంపెనీలు ఇక్కడకు తీసుకొస్తామని తెలిపారు.

త్వరలో మూసీ సుందరీకరణ పనులు 

హైదరాబాద్‌ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో విస్తరిస్తామని చెప్పారు. ఓల్డ్‌ సిటీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మూసీ సుందరీకరణ పనులను త్వరలో ప్రారంబిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో గతంలో తరచూ కర్ఫ్యూ పరిస్థితులు ఉండేవన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో తొమ్మిదేండ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషి వలన ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నదని, ఇతర నగరాలకు, రాష్ట్రాలకు భిన్నంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదన్నారు.  హైదరాబాద్ నగరం గతంలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా 10 సంవత్సరాలలో ఉన్నదన్నారు. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ముస్లింల మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును వాయిదా వేసుకుని హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన గంగా జమున తెహజీబ్  సంస్కృతికి అద్దం పట్టారని ప్రశంసించారు.

దేశానికి తెలంగాణ ధాన్యాగారం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తలసరి ఆదాయం సహా పలు అంశాల్లో దేశంలోనే తెలంగాణ (Telangana) నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌, హర్యానాను అధిగమించామని చెప్పారు. దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో స్వల్ప కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతిలోనే ఉంది.. ఎంఐఎం స్టీరింగ్‌ అసదుద్దీన్‌ చేతిలోనే  ఉంది.. కానీ బీజేపీ మరియు ప్రధాని మోడీ స్టీరింగ్‌ మాత్రం అదానీ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్‌ ప్రధాని మోడీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.