తా చెడ్డ కోతి వనమల్లా చెరిచె అనేది సామెత..ఇది ఇప్పుడు మైనంపల్లి హన్మంతరావుకు అచ్చంగా సరిపోతున్నది..తన కొడుకు రోహిత్‌కు టికెట్ ఇవ్వడంలేనది నోటిదూలను ప్రదర్శించి బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డ మైనంపల్లికి కాంగ్రెస్‌లో షాక్‌లమీద షాక్‌లు తగులుతున్నాయి. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ముందుకొచ్చిన హస్తం. పార్టీకి గాలికిపోయే కంపను ఎక్కడో తగిలించుకున్నట్టు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మైనంపల్లి రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ను వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. రెండు రోజుల్లోనే ఇద్దరు కీలక నేతలు హస్తానికి హ్యాండ్ ఇవ్వడంతో ఏం జరుగుతున్నదో తెలియక మైనంపల్లి ఆందోళనలో పడిపోయారు. అటు మైనంపల్లి హన్మంతరావును చేర్చుకొన్నందుకు తగిన మూల్యమే చెల్లించుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ అంతర్మధనం చెందుతున్నది.
మైనంపల్లి రాకపై కాంగ్రెస్ సీనియర్ల కినుక
బీఆర్ఎస్‌ను వీడిన మైనంపల్లి హన్మంతరావు తన కొడుకు రోహిత్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్‌లో చేరడం నచ్చక మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆదివారం పార్టీని వీడగా.. మరుసటిరోజే మల్కాజిగిరి డీసీసీ చీఫ్ నందికంటి శ్రీధర్ కూడా గుడ్ బై చెప్పారు. రెండురోజుల వ్యవధిలోనే కీలక నేతలు ఇద్దరూ పార్టీని వీడటంతో అటు కాంగ్రెస్ పార్టీ.. ఇటు మైనంపల్లికి ముచ్చెమటలు పడుతున్నాయి. మరోవైపు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు జే వెంకట్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు రాంరాం చెప్పడంతో మైనంపల్లి, ఆయన కొడుకు రాజకీయ జీవితం *హస్త*వ్యస్తంగా తయారయ్యింది. మైనంపల్లి చేరికతో నిన్నమొన్నటి వరకు ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు నీరుగారిపోయింది.
మైనంపల్లి రాకతో పార్టీ బలపడుతుందనుకుంటే అసలుకే లేకుండా పోవడం కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నది. డబ్బు సంచులు చూసి మైనంపల్లిని చేర్చుకోవడం తాము చేసిన తప్పిదమే అని కాంగ్రెస్ నేతలు అంతర్మధనం చెందుతున్నారట. మరోవైపు పంతంతో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి వెంట క్యాడర్ తోడురాకపోవడంతో ఆయన పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలా తయారైంది. అన్నవస్త్రానికి పోతే ఉన్నవస్త్రం ఊడినట్టు కొడుకు కోసం తాపత్రయ పడితే తన రాజకీయ జీవితమే ప్రమాదంలో పడిందని మైనంపల్లి పరేషాన్ అవుతున్నాడట.