ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన హెచ్ఎండీఏను ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేక్రమంలో హెచ్ఎండీఏలో ఏళ్ల తరబడి డిప్యూటేషన్ల పేరుతో తిష్టవేసిన అధికారులను వెంటనే అక్కడినుండి తొలగించి వారి స్వస్థలాలకు పంపివేస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరానికి మించి అడ్డగోలుగా నియమించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో కూడా పరిశీలన జరపాలని, అవసరమైన మేరకే ఉద్యోగులను కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీనియర్ ఐఏఎస్ లు ప్రదీప్ చంద్ర, శాలినీ మిశ్రా, ఎంజీ గోపాల్ లతో కూడిన కమిటీని నియమించారు.
హెచ్ఎండీఏపై వరుసగా మూడురోజులనుండి సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం కేసేఆర్ బుధవారం కూడా సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నో లోపాలతో ఉన్న మాస్టర్ ప్లాన్ స్థానంలో పూర్తి శాస్త్రీయంగా స్టాండర్డ్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత నాలుగునెలలుగా తీసుకున్న నిర్ణయాలను కూడా ఆపివేశారు. హెచ్ఎండీఏలో పని ఉన్నవారు కార్యాలయానికి రాకుండానే ఆన్ లైన్ లోనే అన్ని రకాల పనులు చేసుకునే విధంగా సంస్కరించాలని సీఎం కేసీఆర్ సూచించారు.