1969లో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం ఆ తర్వాత కొందరు స్వార్థ నాయకుల వల్ల నీరుగారిపోయింది. అనంతరం 30 ఏండ్ల తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తన భుజాలపై వేసుకొన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినదించి.. నిరాహారా దీక్ష చేసి..కేంద్రం మెడలు వంచారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారు. అనంతరం ఉద్యమస్ఫూర్తితో నీళ్లు.. నిధులు, నియామకాల కల సాకారం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, సకాలంలో ఎరువులు, రుణమాఫీతో తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. వ్యవసాయాధారిత భారతదేశంలో రైతును రాజును చేసిన ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణను నిలిపారు. ఒక్క వ్యవసాయాన్నేకాదు వినూత్న పాలసీలతో పారిశ్రామికం, ఐటీ, విద్య, వైద్యం.. ఇలా అన్ని రంగాలను ప్రగతి పరుగులు పెట్టించారు. దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపి, దేశ్ కీ నేతగా మారారు. అలాగే, తెలంగాణలో అన్ని మతాలను ఆదరిస్తూ లౌకికతకు తెలంగాణను లవ్ సింబల్‌గా మార్చారు. అందుకే ఎంపీ అసదుద్దీన్‌లాంటి నేత సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కేసీఆర్‌తోనే దేశంలో శాంతిసామరస్యం సాధ్యమని, ఆయన విజన్‌తో భారత్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ప్రధాని అయ్యే అన్ని అర్హతలూ ఉన్నాయని స్పష్టం చేశారు.
కేసీఆర్ దూరదృష్టితోనే భారత్ అభివృద్ధి సాధ్యం
సీఎం కేసీఆర్ సామర్థ్యం, రాజకీయ చతురత, దూరదృష్టి అమోఘమని, దేశంలోని ఏ నాయకుడికీ ఇన్ని లక్షణాలు లేవని ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రత్యామ్నాయంగా వస్తున్న కూటములు మమతా బెనర్జీ, రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థులుగా చూపుతున్నా.. కేసీఆర్‌ను తక్కువ అంచనా వేయొద్దని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో చర్చిలు, మసీదులు ధ్వంసం చేస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణ సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను నిర్మించి.., తెలంగాణ గంగాజమున తెహజీబ్ అని చాటారని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంతవరకూ మసీదులు, చర్చిలు కూల్చారే తప్పా పునర్నిర్మించలేదని, బాబ్రీమసీదును పునర్నిర్మిస్తామని సీడబ్ల్యూసీలో నిర్ణయించిన కాంగ్రెస్ ఆ విషయాన్నే మరిచిపోయిందని మండిపడ్డారు. అన్ని మతాలు, వర్గాలు, కులాలకు సమప్రాధాన్యతనిస్తూ సీఎం కేసీఆర్ అభివృద్ధి బాటపట్టిస్తున్నారని చెప్పారు. ఆయన పీఎం అయితే తెలంగాణతరహాలో భారతదేశంకూడా సుభిక్షంగా ఉంటుందని, కేసీఆర్ విజన్‌తో అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని అసద్ ధీమా వ్యక్తంచేశారు. ఇప్పుడు దేశానికి కావాల్సింది కేసీఆర్‌లాంటి దూరదృష్టి ఉన్న నాయకులేనని తేల్చి చెప్పారు.