mt_logo

100% సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్.. : హైకోర్టు తీర్పు

రాష్ట్రంలో 2014 జూన్ 2 త‌ర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 % సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని హైకోర్టు స‌మ‌ర్థిస్తూ తీర్పు ఇవ్వ‌డం శుభ ప‌రిణామమని ట్విట్టర్ (X) వేదికగా మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్బంగా  తెలంగాణ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.  జిల్లాకో ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేయ‌డంతో పాటు, వాటిద్వారా అందుబాటులోకి వ‌చ్చిన ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డ‌ల‌కే ద‌క్కేలా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని, స్ప‌ష్ట‌మైందని మంత్రి తెలిపారు. 


ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్లలో 85% సీట్ల‌ను లోకల్ రిజర్వ్ చేయ‌డం  ద్వారా తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందేనని సంతోషం వ్యక్తం చేసారు. హైకోర్టు తాజా తీర్పుతో మ‌రో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభిస్తున్నాయి. ముందుచూపుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల ఏటా 1820 సీట్లు దక్కనున్నాయి. ఇది దాదాపు 20 కొత్త మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుతో స‌మానమని స్పష్టం చేసారు.