-కుమ్రంభీం మనుమడు సోనేరావు ఆనందం

కొమురం భీం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఆదిలాబాద్ అడవుల్లో గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించారు. పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా శైలిలో పోరాడారు. అడవిని జీవనోపాధిగా చేసుకొని, తమ భూమి లో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందారు. అడవిబిడ్డలకు అడవిపై హక్కులు కల్పించాలని, సొంతంగా పరిపాలన చేసుకొనే అవకాశం ఇవ్వాలని, దున్నే భూమిపై అధికారం ఉండాలని పోరాడారు. అయితే, ఆయన ఆదివాసీ, గిరిజన బిడ్డల కోసం కన్న కలలకు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని సాక్షాత్తూ కుమ్రంభీం మనుమడు సోనెరావు అంటున్నారు. అందుకే తాము కేసీఆర్‌లోనే తమ తాత, తమ హక్కుల పోరాట యోధుడు కుమ్రంభీంను చూసుకొంటున్నామని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మరి ఆదివాసీ, గిరిజన బిడ్డద దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ ఎలా సాకారం చేశారో ఆయన మాటల్లోనే చదువుదాం.
ఆ కాలంల మా తాత జల్, జంగల్, జమీన్ అని ఫైట్ చేసిండు. అది కుమ్రం భీం చెప్పిన నీతి. ఆ నీతిని అమలు చేస్తున్నది కేసీఆరే కదా? ఇంకెవ్వలు అయితరు? కేసీఆర్ తప్ప మా జాతికి లాభం చేయాల్నని ఏ ప్రభుత్వం ఆలోచించలే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మస్తు తిప్పలపడ్డం. కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చట చెప్పుడే గానీ మాట తీర్చింది లేదు. కేసీఆర్‌ను చూస్తే తాత లెక్కనే అనుకుంటం. కేసీఆర్ అంటే మాకు గర్వకారణం. ఒక్కసారి ఇంత భూమిని, ఇంతమందికి ఎవలు ఇచ్చిండ్రు? అందుకే ‘నావోరూ తాదో బావనోర్. దాదోన్ జోసే సమ్జేమాన్తోర్ ( కేసీఆర్‌లో మా తాత ఉన్నడని నమ్ముతున్నం. అదే మా జాతికి నిజం అయితున్నది). కేసీఆర్‌లనే మాకు భీం కనపడ్తడు. ఇట్లంటే కొందరికి కోపం వస్తది. కానీ ఇదే నిజం. ఇప్పటిదాకా ముచ్చట్లు చెప్పేటోళ్లను చూసినం. ఇప్పుడు కేసీఆర్ లెక్క పని జేసేటోడు ఎవడున్నడు? కాంగ్రెసోళ్లు అంటరు, బీజేపోళ్లంటరు.. కానీ, కేసీఆర్ లెక్క ఎవలు జేసిండ్రు? మేం ఎవలను నమ్మం.. కేసీఆర్‌నే నమ్ముతం అని సోనేరావు స్పష్టంచేశారు.
‘నావోరూ తాదో బావనోర్. దాదోన్ జోసే సమ్జేమాన్తోర్’ (మా తాతలెక్క కేసీఆర్ మా గురించి పట్టించుకున్నరు. కేసీఆర్‌లో మా తాత ఉన్నడు అని అనుకుంటం) అని కుమ్రంభీం వారసుడు (మనుమడు) కుమ్రం సోనేరావు అన్నారు. స్వతంత్ర భారతదేశంలో గిరిజనులను పట్టించుకున్నది, వారి సమస్యలను తీర్చింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాంపై పోరాటం చేసిన కుమ్రంభీం కలలు కేసీఆర్ వల్ల నెరవేరుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల పైచిలుకు పోడు భూమికి ప్రభుత్వం నేటి నుంచి పట్టాలు పంపిణీ చేయనున్నది. ఈ నేపథ్యంలో కుమ్రంభీం వారసులు, గిరిపుత్రుల మనోగతాన్ని ఆయన విశ్లేషించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ) మండలం పంగిడిపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దదోబలో నివాసం ఉంటున్న సోనేరావు ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
కేసీఆర్‌లెక్క మమ్మల్ని చూసుకున్న సీఎం లేడు!
తెలంగాణ వచ్చినంకనే మా (గిరిజనుల) బతుకులు మారాయి. గతంలో మా తాత సమాధి మీద పూలు చల్లి వర్ధంతి జరుపుకోవాలన్నా పెద్ద కష్టం అయ్యేది. బైల్‌బండ్ల (ఎడ్ల బండ్ల) మీద పోయేది. డొంకదారులు, వాగులు, వంకలు, దాటుకుంటూ పోయేది. అయినా ‘మీరు అటుపోవద్దు.. ఇటుపోవద్దు’ అని నానాతిప్పలు పెట్టేవారు. ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఇట్లా చాలామంది బెదిరించేవారు. ఓసారి లోపలి మనుషులతోని (నక్సల్స్) కూడా లొల్లి పెట్టుకున్నం. ఆ రోజులు తలుచుకొంటే ఎక్కడలేని బాధ. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ మా బాధలు తీర్చిండు. జోడేఘాట్‌లో రూ.25 కోట్లతో కుమ్రంభీం మ్యూజియం కట్టించిండు. ఇది మాములు మాట కాదు. మొన్ననే హైదరాబాద్‌లో కుమ్రంభీం పేరుమీద పెద్ద బిల్డింగ్ కట్టించిండు. దానికి నేనే పోయి పూజ జేసిన. కాంగ్రెస్, తెలుగుదేశం జమాన్ల ప్రతీసారి తిప్పలే పడేవాళ్లం. మా జాతి బిడ్డలే ఎంతోమంది ట్రైబల్ మంత్రులు అయినా ఏం చేయలేకపోయేవారు. అసుంటిది మల్ల కేసీఆర్ వచ్చినంక మా ముచ్చట తీర్చిండు. ఇది ఎవ్వలతోని కాలే. కేసీఆర్‌తోనే అయింది. తెలంగాణ వచ్చినంక ఓసారి నన్ను హైదరాబాద్ పిలిపిచ్చుకున్నడు. పక్కనే కుర్చేసి కూసోబెట్టుకొని కష్టసుఖాలన్నీ అడిగిండు. ఏం కావాల్నో చెప్పు అన్నడు. అప్పటి దాకా ఈడ సర్పంచ్ కూడా మమ్ములను పట్టించుకోకపోయేది.
నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నరు!
హైదరాబాద్‌కు కేసీఆర్ పిలిపించుకొని ఎమ్మెల్యేగా పోటీచెయ్యమన్నరు. నాకేం అర్థం కాలే. బ్యాంకుల ఖాతా కూడాలేదు నాకు.. నాకెందుకు పోటీ సార్ అన్న. అప్పుడే కాదు గిప్పుడూ అదేమాట. మా జాతికి మేలు జరగాల్నని మా తాత పోరాడిండు. మా తాత ముత్తాలు ఫ్రీడం ఫైటర్స్ సార్. రాజకీయం వద్దు సార్. మా జాతికి మంచిచేయమని మాత్రం చెప్పిన. అట్లనే బిడ్డ అన్నడు. అన్నట్టే చేస్తుండు. ఇంకేం కావాలె. నిజాంతోని కొట్లాడుతూ మా తాత (కుమ్రంభీం) గోలి (తూటా) తాకి చచ్చిపోయిండు. అప్పుడు మా నాయిన (మాధవరావు) మూడు నెలల పిలగాడట. మా అమ్మ (బాగుబాయి) నన్ను తమ్ముడు (కుమ్రంభీం), చెల్లె (గుంగుబాయి) మమ్ములను సాకింది. మా నాయినమ్మ చిన్నప్పటి నుంచి తాత గురించి చెప్పేది. మా జాతి కోసం తాత ఎంత కష్టపడ్డడు! ఆఖరికి పాణం ఇడిసిండు. అంతటి గొప్ప చరిత్రకు వారసుడినని చెప్పుకొనేతందుకు గర్వపడుతాం మేము. అంతకంటే పదవులు పెద్దవి కాదు కదా.
నా కుటుంబాన్ని ఆదుకొన్నడు జోడేఘాట్‌లో కుమ్రంభీం వర్ధంతి నాడు కేసీఆర్ వచ్చిండు. మీకేం కావాలె? అని అడిగిండు. ‘ఇప్పటిదాకా అందరూ అడిగిండ్రు.. కేసీఆర్ గూడ అట్లనే అడుగుతుండు’ అనుకున్న. కానీ, కేసీఆర్ అందరిలెక్క కాదని కొద్దిరోజులకే తెలిసింది. వర్ధంతి సభలో హామీ ఇచ్చినట్టే నాకు 5 ఎకరాల భూమి ఇచ్చిండు. గ్యారా ఎకర్‌కు (కేసీఆర్ ఇచ్చిన ఐదు ఎకరాలతో సహా) రైతుబంధు పైసలు కూడా వస్తున్నయి. నా కొడుక్కు (మాధవరావు)కు టీచర్ నౌకరీ ఇచ్చిండు. నా బిడ్డకు (వరలక్ష్మి) ఐటీడీఏ ఉట్నూర్‌లో జూనియర్ అసిస్టెంట్ నౌకరీ ఇచ్చిండు. పది లక్షల ఆర్థిక సాయం చేసిండు. దాంతో ఇగో (ఇల్లు చూపిస్తూ) ఈ ఇల్లు కట్టుకున్న. నాదొక్కటే కోరిక.. మా కుమ్రం వారసులకు ఏదో రకంగా కేసీఆర్ సాయం చేయాలన్నది. మా వంశం వాళ్లు పెద్దదోబ, నిషాని, బూస్కేపేట, మునువాడ, సిత్తగూడ, రాసిమెట్ట, ఇందార్, పంగిడిలో ఉన్నరు. వాళ్లకు కూడా ఏదన్న తొవ్వ చూపాలె. కేసీఆర్ మతిల పడితే తప్పకుండా చేస్తడు.