mt_logo

కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తీసుకురండి: బండి సంజయ్‌కు కేటీఆర్ లేఖ

సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు.

కేంద్రంలో బీజేపీ సారద్యంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ప్రధాని మోడీని ఒప్పించి సిరిసిల్ల మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మీరు ఈ ప్రాంత ఎంపీగా ఐదేళ్ల క్రితం ఎన్నికయ్యారు కానీ నేతన్నలకు ప్రతిసారి నిరాశానే ఎదురైందన్నారు. గతంలో పదేళ్లుగా సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తీసుకొచ్చేందుకు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదన్నారు.

సుమారు పదిసార్లు కేంద్రంలో స్మ్రతి ఇరానీ, అరుణ్ జైట్లీ వంటి అనేతక మంది మంత్రులను నేను స్వయంగా కలిసినా దక్కింది శూన్యం అన్నారు. బండి సంజయ్‌ని కూడా ఎన్నోసార్లు ఈ అంశంలో సహకారం అందించాలని కోరినప్పటికీ మీరు పట్టించుకోలేదన్నారు. అయితే రెండోసారి మీరు ఎంపీ కావటం, కేంద్రంలో కూడా మంత్రిగా పదవి దక్కటంతో సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు మీకిది సరైన సమయం అని గుర్తించండి అని తెలిపారు.

ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న ఈ బడ్జెట్ లో సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయని, ఉపాధి లేక ఇక్కడి కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సంగతి మీరు గుర్తించండన్నారు.

గత ప్రభుత్వం నేతన్నల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ సర్కారు పాతరేయడంతో చేనేత రంగం మరోసారి పదేళ్ల తర్వతా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరినా, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కేటిఅర్ ఆవేదన వ్యక్తం చేశారు.

చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్న ఈ కీలక సమయంలో వారిని ఆదుకునే మంచి అవకాశం ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉందన్నారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయని, చేతినిండా పని దొరికి మళ్లీ ఆత్మహత్యలు లేని సిరిసిల్లను చూసే అవకాశం ఉంటుందన్నారు.

క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని, నేతన్నలు, చేనేతలను ఆదుకోవటానికి గత పదేళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోవటం దురదృష్టకరం, బాధకరమన్నారు. వనరులు లేని రాష్ట్రాలకు సైతం కేంద్రం అనేకరకాల ప్రాజెక్టులను మళ్లిస్తున్నందున, అన్నీ సానుకూలాంశాలున్న సిరిసిల్లాకు మేలు జరిగే దిశగా బండి సంజయ్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి బడ్జెట్‌కు ముందుకు ఈ అంశంలో కేంద్రానికి విజ్జప్తి చేసేవారమన్నారు. ఈ బడ్జెట్ పెట్టే నాటికే ఆర్థిక మంత్రిత్వ శాఖా మంత్రిని కలిసి సిరిసిల్ల మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ ప్రాధాన్యతను, దాని వల్ల జరిగే లబ్ధిని, వారి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.

తెలంగాణ ప్రజలు ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న మీ మాటలు నమ్మి మిమ్మల్ని గెలిపించారని, కానీ గత ఐదేళ్లలో కరీంనగర్‌కు గానీ సిరిసిల్ల నేతన్నలకు గానీ బండి సంజయ్ పదవీకాలంలో జరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ఎంపీలు మాత్రం తమ ప్రాంత ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం చేసి తమ ప్రాంతాలకు నిధులను, పరిశ్రమలను తరలించుకుపోతున్నారని, కనుక తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మన ప్రాంత ప్రయోజనాల కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఈ బడ్జెట్‌లో ఖచ్చితంగా సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ ప్రకటన చేయిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.