mt_logo

పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్

ఈరోజు అరెస్టైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని ఇవ్వాళ ఉదయం పోలీసులు మఫ్టీలో వచ్చి అక్రమంగా కిడ్నాప్ చేసి భయానక వాతావారణం సృష్టించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటూ కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కేసు ఏందో చెప్పకుండా అరెస్ట్ చేశారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ నికృష్ట పరిస్థితిని తీసుకొచ్చారు అని మండిపడ్డారు.

స్థానిక ఎంపీ అయిన డీకే అరుణ గారు ఆ గ్రామానికి వెళ్తానంటే కూడా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. కానీ వార్డు మెంబర్ కూడా కానటువంటి కేవలం ముఖ్యమంత్రి అన్న అనే ఒకే అర్హత కలిగినందుకు తిరుపతి రెడ్డిని మాత్రం లగచర్లకు 300 మందితో వెళ్లనిచ్చారు అని దుయ్యబట్టారు.

తిరుపతి రెడ్డి లగచర్ల గ్రామంలో తన అనుచరులతో స్వైర విహారం చేస్తూ భూములు ఇస్తేనే మీ వాళ్లను విడుదల చేస్తామంటూ ఇంటింటికి వెళ్లి ప్రజలను బెదిరిస్తున్నారు. భూమిని కోల్పోతామని బాధపడుతున్న గిరిజన, దళిత, బీసీ రైతులను జైళ్లలో పెట్టి వాళ్లను కొడుతూ చిత్ర హింసలు పెట్టిన నికృష్ట ప్రభుత్వం ఇది అని ధ్వజమెత్తారు.

ఒక ఇంట్లో మహిళ ఛాతిపై కాలితో తొక్కి ఆ మహిళ భర్తను అరెస్ట్ చేశారు. గతంలో ఏ నియంత, అప్రజాస్వామిక పాలకుడు కూడా చేయని దుర్మార్గ వ్యవహారం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌‌లో చేస్తున్నాడు.ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్నారు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నామన్న విషయాన్ని రాష్ట్ర డీజీపీ సహా పోలీసులు గుర్తించాలి అని విజ్ఞప్తి చేశారు

ఏ కారణం చేత మీరు మహబూబ్ నగర్ ఎంపీని వెళ్లకుండా అడ్డుకున్నారు. రేపు మేము కూడా వెళ్తాం మమ్మల్ని కూడా అడ్డుకుంటారా? 144 సెక్షన్ ఉన్న సరే 300 మందితో తిరుపతి రెడ్డి లగచర్ల గ్రామంలోకి వెళ్లేందుకు ఎందుకు అనుమతించారని డీజీపీని ప్రశ్నిస్తున్నా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అతి చేస్తే పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో అదే జరుగుతుంది అని కేటీఆర్ హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి భూదాహ యజ్ఞంలో అతి వేషాలు వేసి అధికారులు బలిపశువులు కాకండి. రేవంత్ రెడ్డి అల్లుడి కోసం ఫార్మా కంపెనీ పేరిట పేదల భూములు గుంజుకోవటానికి చేస్తున్న ప్రవసనంలో మీరు బలి కాకండి. పట్నం నరేందర్ రెడ్డి గారి కుటుంబానికి పార్టీ మొత్తం అండగా ఉంటుంది. పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నరేందర్ రెడ్డి గారి కుటుంబానికి భరోసా కల్పించేందుకే వచ్చాం అని తెలిపారు.

ఒక్క నరేందర్ రెడ్డి గారు మాత్రమే కాదు. పేద రైతులు ఎవరినైతే అరెస్ట్ చేశారో వారందరికీ కూడా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. పార్టీ నేతలమంతా లగచర్లలకు వెళ్లి వారికి భరోసా ఇస్తాం. మేము వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారో చూస్తాం. రాష్ట్రంలో పోలీసులు ఎందుకు సెలెక్టివ్ రూల్స్ పాటిస్తున్నారో చెప్పాలి.అరెస్ట్ చేసిన రైతులను పోలీసులు చిత్ర హింసలు పెట్టి తీవ్రంగా కొట్టారు. వారికి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి అని డిమాండ్ చేశారు.

రైతులను కొట్టిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాం.రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం ఇప్పుడు కూడా నోరు విప్పకపోతే చరిత్రహీనులవుతాం. బీజేపీ, కమ్యూనిస్ట్ సహా అన్ని పార్టీలు స్పందించాలి. లేదంటే ప్రజాస్వామిక తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా పోతుంది అని పేర్కొన్నారు.

గత 11 నెలలుగా కొడంగల్‌లో అరాచక పాలన సాగుతోంది. ఈ కాంగ్రెస్ వాళ్ల బెదిరింపులకు భయపడాల్సి అవసరం లేదు. రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాటింది. ఢిల్లీ వాళ్లకు ఎప్పుడు కోసం వస్తే అప్పుడు ఆయన పదవి ఊడిపోతుంది. కొడంగల్‌కు సెక్యూరిటీ లేకుండా వస్తే ప్రజలు తంతారని సీఎంకు భయం పట్టుకుంది. సొంత నియోజకవర్గలో కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది అని విమర్శించారు.

ఈ ప్రభుత్వానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డిలు భయపడాలే. ఈ కష్టాలు, ఇబ్బందులు కొన్ని రోజులు మాత్రమే. పదవి శాశ్వతం అనుకోని రేవంత్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాలకు మనమే అడ్డుకట్ట వేయాలి. పోలీసులు అరెస్ట్ చేసిన రైతులకు అండగా ఉంటాం. వారి తరపున న్యాయ పోరాటం చేస్తాం. వారికి భరోసాగా ఉంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

డీజీపీ గారు పోలీసులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ప్రభుత్వం చేపట్టినట్లు ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు. చట్ట ప్రకారం రూల్స్‌కు అనుగుణంగా పనిచేయండి. అరెస్ట్ ఆయన రైతులకు కూడా మేము అండగా ఉంటాం. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. మీడియా కూడా పీడితుల బాధలను చూపించాలి. పీడితుల వైపు ఉండాలి అని కోరారు.

ఫార్మా విలేజ్ అనే కార్యక్రమం మొదలు పెట్టిన నాటి నుంచే ప్రజలు మా భూములు ఇవ్వమంటూ ఎదురుతిరుగుతున్నారు.కానీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మాత్రం తన్ని మరీ భూములు తీసుకుంటామని బెదిరించాడు. ఆ ఆడియో కూడా ఉంది. ఆరు నెలలుగా భూములు ఇవ్వమంటూ రైతులు ఎదురుతిరుగుతున్నారు. ఫార్మా విలేజ్ అన్న నాటి నుంచే ఈ వివాదం కొనసాగుతోంది అని అన్నారు.

కలెక్టరేమో దాడి జరగలేదంటారు. పోలీసులు, ప్రభుత్వం మాత్రం దాడి జరిగిందంటారు. ఈ ప్రభుత్వానికే స్పష్టత లేదు. డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ కూడా అయిన కలెక్టర్ మాట్లాడిన దానికి భిన్నంగా కాంగ్రెస్ నాయకులు, పోలీసులు మాట్లాడుతున్నారు అని అన్నారు.