mt_logo

మూసీ బ్యూటిఫికేషన్‌కు కాదు.. మూసీ లూటిఫికేషన్‌కు వ్యతిరేకం: కేటీఆర్

నాగోల్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఎస్టీపీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ గారు ఎస్టీపీలు నిర్మించటం కారణంగా మురుగు నీరు శుద్ధి నీరుగా మారుతుంది. గతంలో ఎంతో మురికిగా ఉన్న మూసీ నీళ్లను పూర్తిగా స్వచ్ఛమైన నీళ్లుగా మార్చాం అని తెలిపారు.

నాగోల్‌లో నిర్మించిన ఎస్టీపీ దేశంలోనే అతిపెద్ద మురుగు నీటి శుద్ధి కేంద్రం. హైదరాబాద్‌కు నిజానికి మూసీ అనేది ఒక వరం. 90 శాతం వాన నీళ్లు గ్రావిటీ ద్వారానే మూసీలోకి చేరుతాయి అని అన్నారు.

రేవంత్ రెడ్డి గారు మూసీ మురికి కూపంగా మారటానికి గత పాలకులే కారణం అన్నారు. ఆయన అన్న మాటలను నేను ఏకీభవిస్తున్నా. కాంగ్రెస్, టీడీపీలు ఉన్నప్పుడే మూసీ మురికి కూపంగా మారింది. 2015 లో సెంట్రల్ పొలుష్యన్ బోర్డు మూసీ అతి కాలుష్యమైన నది అని రిపోర్ట్ ఇచ్చారు. అంటే అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలే మూసీని పాడు చేశాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం మూసీకి పునర్వైభవం తేవాలని భావించారు అని పేర్కొన్నారు.

మూసీని బాగుచేయాలంటే ముందు నీళ్లను బాగు చేయమని కేసీఆర్ గారు మాకు చెప్పారు..మేము అధికారంలోకి వచ్చే నాటికి హైదరాబాద్‌లో 700 ఎంఎల్డీల శుద్ధి కేంద్రాలు మాత్రమే ఉండేవి. కానీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దాదాపు 4 వేల కోట్లతో మేము 31 ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయించాం. దీంతో మూసీలో మురికి నీళ్ల శుద్ధి పెద్ద ఎత్తున జరుగుతుంది అని అన్నారు.

గతంలో కాంగ్రెస్ నల్గొండకు మురికి నీళ్లను పంపిస్తే.. మేము మాత్రం ఈ విధంగా మంచి నీళ్లను పంపిస్తున్నాం. మేము పూర్తి స్థాయిలో చేసిన పనులను రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నాడు. మేము కట్టిన ఇళ్లకు సున్నం వేసి గుంపు మేస్త్రి నేనే కట్టిన అని చెప్పుకుంటున్నాడు. అదృష్టం బాగుండి ఆయన టైమ్ నడుస్తోంది ఎద్దేవా చేశారు.

మూసీలో నీళ్లు చాలా వేగంగా జారి కిందకు పోతాయి. దీని వల్ల మంచి ఉంది, చెడు ఉంది. దానికి అనుగుణంగా నీళ్లను నిలపటానికి మూసీపై 15 బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించాం. హైదరాబాద్ నిర్మాణం జరిగిన తర్వాత మళ్లీ మూసీపై బ్రిడ్జిలు నిర్మించాలని మేము భావించాం. హైదరాబాద్ వారసత్వ సంపద పరిరక్షించే విధంగా బ్రిడ్జిలను నిర్మించాలని డిజైన్లకు కూడా అదే విధంగా ఉండేలా చూసుకున్నాం అని అన్నారు.

బ్రిడ్జిల కోసం దాదాపు 5 వందల కోట్లు కేటాయించాం. దానితో పాటు చెక్ డ్యామ్ లను కూడా నిర్మించాలని భావించాం. అదే విధంగా కొండ పోచమ్మ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీళ్లను మూసీ నదికి అనుసంధానం చేయాలని నిర్ణయించాం. 2023 మే 18 నాడు రూ. 1100 కోట్లతో గోదావరి నీళ్లను మూసీకి అనుసంధానం చేసే పనిచేశాం. ఎస్టీపీలు, బ్రిడ్జిలు, గోదావరి నీళ్లను అనుసంధానం అంటూ మూసీ పునరుజ్జీవనం మనం చేశాం అని కేటీఆర్ తెలిపారు.

కొత్తగా పునరుజ్జీవనం అంటే ఆయనే కనిపెట్టినట్లు చెబుతున్నాడో అవి పచ్చి బోగస్ మాటలు. మూసీ పేరుతో ప్రజాధనం లూటీ చేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు.. రూ. లక్షా 50 వేల కోట్లు అంటున్నాడు. సుధీర్ రెడ్డి గారు ఛైర్మన్‌గా ఉన్నప్పుడే మేము దాదాపుగా పనులు చేశాం. మంచి రేవుల నుంచి ప్రతాప సింగారం వరకు ఎక్స్‌ప్రెస్ హైవే కూడా కట్టాలని భావించాం.. 57 కిలోమీటర్లకు దానికోసం ఖర్చు అయ్యేది రూ. 10 వేల కోట్లు. ఎస్టీపీలు, బ్రిడ్జిలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, గోదావరి నీటి అనుసంధానానికి మేము రూ. 15 వేల కోట్లు అంచనా వేశాం అని అన్నారు.

సరే దానికి మరో రూ. 10 వేల కోట్లు ఎక్కువ చేసిన సరే.. రూ. 25 వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది.. ఐతే మూసీ ప్రాజెక్ట్‌కు ఎంతో ఖర్చు చేస్తారో వాళ్లకే తెలియటం లేదు. ఇదే రేవంత్ రెడ్డి ఏప్రిల్‌లో రూ. 50 వేల కోట్లు అన్నాడు. జీహెచ్ఎంసీ వాళ్లు రూ. 60 వేల కోట్లు అన్నారు. జూపల్లి కృష్ణారావు ఏమో రూ. 70 వేల కోట్లు అన్నాడు. ఆ తర్వాత ఇదే ముఖ్యమంత్రి మళ్లీ రూ. లక్షా 50 వేల కోట్లు అంటాడు. మళ్లీ లక్షా 50 వేల కోట్లు ఎవరన్నారు అంటాడు. మొత్తం రూ. 25 వేల కోట్లతో మంచిగా పూర్తి చేసే ప్రాజెక్ట్‌కు రూ. లక్షా యాభై వేల కోట్లు కావాలంట అని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీకి దేశంలో పరిస్థితి మంచిగా లేదు. వాళ్లకు పైసలు తెలంగాణ నుంచే కావాలె. రేవంత్ రెడ్డి మాత్రమే పైసలు ఇస్తున్నాడు. కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికి కర్ణాటకలో ముఖ్యమంత్రి ముడా అనే స్కాంలో ఇరుక్కున్నాడు. ఇప్పుడు మహారాష్ట్ర, ఝార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీకి పైసలు కావాలె. మరి దానికి పైసలు ఎట్ల అంటే రేవంత్ రెడ్డి మూసీ ఒకటి, హైడ్రా అని రెండు పట్టుకున్నాడు. ఢిల్లీకి మూటలు మోయాలంటే హైడ్రా పేరుతో బిల్డర్లను భయపెట్టి పైసలు తీసుకోవాలె అని దుయ్యబట్టారు.

మూసీలో రంగుల కల చూపించి ఏదో చేసినట్లు చూపించి లక్షా యాభై వేల కోట్లు దోపిడి చేయాలె. ఇక్కడి నుంచి పైసలు ఎత్తుకుపోయి.. ఢిల్లీ వాళ్లకు ఇచ్చి పదవికి కాపాడుకోవాలి. రూ. 25 వేల కోట్ల రూపాయలతో మూసీని పూర్తిగా ప్రక్షాళన చేయవచ్చు. అదే కేసీఆర్ గారు మూసీ సుందరీకరణ చేయాలని భావించినప్పుడు ముందు ఎస్టీపీలు నిర్మాణం చేయాలని చెప్పారు అని గుర్తు చేశారు.

బఫర్‌లో 11,000 ఇళ్లు ఉన్నాయి. వాళ్లను కబ్జాదారులంటూ ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇది దుర్మార్గం. వాళ్లకు పర్మిషన్లు ఇచ్చి వాళ్ల నుంచి ట్యాక్స్‌లు వసూలు చేసి ఇప్పుడు వాళ్లను కబ్జాదారులు అంటారా? ముఖ్యమంత్రిగా అయినప్పటికీ రేవంత్ రెడ్డికి ఇంకా ఆ హుందాతనం రాలేదు అని కేటీఆర్ మండిపడ్డారు.

మూసీ దగ్గర నన్ను నాలుగు నెలలు ఉండమని రేవంత్ రెడ్డి వెటకారంగా అంటున్నాడు..మూసీ దగ్గర ఉన్నవాళ్లే 60, 70 ఏళ్లుగా అక్కడ ఉంటున్నామని చెబుతున్నారు.. మేము మంచిగానే ఉన్నామని చెబుతున్నారు. అక్కడ ఉన్నవాళ్లు ఈఎంఐలు ఏ విధంగా కట్టాలని ఓ మహిళ పాపం ఏడుస్తోంది. దీనికి వెటకారంగా మాట్లాడే రేవంత్ రెడ్డి సమాధానం చెబుతాడా? అని అడిగారు.

మూసీలో ఇళ్లు కోల్పోయేటోళ్ల కోసం మూడు నెలలుగా కాదు.. మూడు సంవత్సరాలు ఉంటా. నేను చిన్నప్పుడు నింబోలి అడ్డా, మొజాంజాహీ మార్కెట్ వద్ద ఉన్నా.. అది మూసీకి చాలా దగ్గర.. రేవంత్ రెడ్డి గారు నీకు పైసలు కావాలంటే మేము చందాలు వేస్తాం. ఢిల్లీకి పంపించి నీ సీటు కాపాడుకో. కానీ పేదల కడుపు కొట్టి వేల కోట్లు దోపీడి చేస్తామంటే ఒప్పుకోం అని హెచ్చరించారు.

సబర్మతి నది ప్రక్షాళనకు 14 కిలోమీటర్లకు రూ. 7 వేల కోట్లు అయ్యింది. సరే దానికి మూడు రెట్లు ఎక్కువ వేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి బడేభాయ్ మోడీ గారు నమామీ గంగా ప్రాజెక్ట్‌లో కిలోమీటర్‌కు రూ. 17 కోట్లు ఖర్చు చేసింది. ఇక్కడ 57 కిలోమీటర్లకు మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తా అంటాడు. కిలోమీటర్‌కు రూ. 2700 కోట్లు ఖర్చు పెడతా అంటాడు. లక్ష మందిని రోడ్డుపై వేస్తూ, వేల కోట్ల రూపాయలు దోచుకుంటామంటే దానికి మేము మద్దతు ఎలా తెలపాలి? అని ప్రశ్నించారు.

రుణమాఫీ, సంక్షేమ పథకాలు, చాక్‌పీస్, మందులకు పైసలు లేవు. జీతాలు ఇచ్చేందుకు పైసల్ లేవు. ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు పైసలు లేవు. దేనికి పైసలు లేవు. కానీ మూసీ కోసం మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసేందుకు మాత్రం ఉన్నాయంట. మేము మూసీ బ్యూటిఫికేషన్‌కు వ్యతిరేకం కాదు. దాని పేరుతో జరిగే లూటీఫికేషన్‌కు మాత్రం మూమ్మటికి వ్యతిరేకం.. మూసీ పేరుతో జరిగే మూటల దోపిడీకి ఖచ్చితంగా వ్యతిరేకం అని స్పష్టం చేశారు.

అవసరమైతే రెండు దిక్కుల కరకట్టలు కట్టు, ఎవ్వరికి నష్టం చేయకు, బఫర్ జోన్ జోలికి వెళ్లకు.. నది గర్భంలో పేదల ఇళ్లు ఉంటే మంచిది కాదంట. కానీ బస్టాండ్, మెట్రో స్టేషన్ ఉంటుందంట. పేదల ఇళ్లు కూల్చేసి.. పెద్ద మాల్స్ కడితే మాత్రం మంచిదంట.. మేము పునరుజ్జీవం చేసింది వాస్తవం. కొత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నది వాస్తవం. మూసీలో దోపిడీ జరుగుతుందన్నది వాస్తవం అని ఆరోపించారు.

మూసీలో ఇళ్లు కోల్పోయే వారికి మేమే అండగా ఉంటాం. వారి తరపున న్యాయ పోరాటం చేస్తాం. మన హక్కుల గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఎవరు పడితే వాళ్లు వచ్చి బస్సు ఎక్కు అంటే మనం గొర్రెలం కాదు..డీపీఆర్ లేకుండా మమ్మల్ని ఎలా ఖాళీ చేయమంటావని మనం ప్రశ్నించాలి అని పిలుపునిచ్చారు.

మీ తరపున రాజ్యాంగ, న్యాయపరంగా, రక్షణ పరంగా మేము అండగా ఉంటాం. తెల్లారి లేస్తే కేసీఆర్‌ను తిట్టే రేవంత్ రెడ్డికి ఇప్పుడు కేసీఆర్ కట్టిన ఇళ్లు.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లే దిక్కు అయినయ్. గోదావరి నీళ్లు, ఎస్టీపీలను పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే అని తెలిపారు.

మూసీ పేరిట జరుగుతున్న లూటిఫికేషన్‌కు చరమగీతం పాడాలి.. వ్యతిరేకంగా పోరాడాలి. ఎస్ఎన్డీపీ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లో వర్షం నీళ్లు నిలవటం లేదు. ఎస్ఎన్టీపీ ద్వారా జరిగిన ప్రయోజనాన్ని ప్రజలకు మేమే వివరిస్తాం.. వాటిని కూడా సందర్శిస్తాం.. ప్రజలకు చేసిన మంచి పనులను మేమే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు.