mt_logo

సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి కొడంగల్‌లో రాజ్యంగేతర శక్తిగా మారాడు: కేటీఆర్

లగచర్ల రైతులను సంగారెడ్డి జైల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధితులను కలవటం జరిగింది. లగచర్లలో పేదల భూమి సేకరించే విషయంలో వాళ్లను సమిధలు చేస్తున్నారు అని మండిపడ్డారు.

లక్షల రూపాయల విలువ చేసే భూములను అడ్డికి పావు శేరు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లగచర్ల సహా భూమి కోల్పోతున్న రైతులు తీవ్రంగా రోదిస్తున్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడు అని విమర్శించారు.

గతంలో ఫార్మా అంటే కాలుష్యం అన్న రేవంత్ రెడ్డియే ఇప్పుడు ఏ విధంగా 3 వేల ఎకరాలు తీసుకుంటున్నాడు. జైల్లో ఇప్పుడు మేము 16 మందిని కలిశాం. వాళ్ల బాధ చెప్పలేని విధంగా ఉంది. అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన కులగణన కార్యక్రమంలో ఉన్న ఉద్యోగిని సాయంత్రం దాడిలో పాల్గొన్నాడంటూ తీసుకెళ్లారు అని అన్నారు.

ఇంకొక తమ్ముడు వనపర్తిలో చదువుకుంటున్నాడు. గొడవ జరిగిన విషయం తెలిసి ఇంటికి వస్తే ఆయనను కూడా జైలుకు తీసుకొచ్చారు. సంఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారు. ముందు 60, 70 మందిని అరెస్ట్ చేశారు. దాడి చేసిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రధానంగా ఉన్నారు. దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడి అనుచురులు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. కానీ పోలీసులకు మాత్రం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఫోన్‌లో డైరెక్షన్స్ ఇచ్చి వీళ్లను కొట్టించాడు అని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి సోదరుడున్న ఒకే ఒక్క అర్హతతో తిరుపతి రెడ్డి కొడంగల్‌లో రాజ్యంగేతర శక్తిగా మారాడు. కలెక్టర్ సహా పోలీసులు, అధికారులు ఆయన ముందు మోకరిల్లే విధంగా రారాజుగా వ్యవహరిస్తున్నాడు. కొడంగల్‌లో ముఖ్యమంత్రిది ఏమీ నడవదంట. అంతా తిరుపతి రెడ్డిదే చెల్లుతదని చెబుతున్నారు అని కేటీఆర్ అన్నారు.

నిజానికి దాడి చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారు. భూములు పోతాయని వాళ్లే దాడి చేశారు. కానీ అరెస్ట్ చేసిన 70 మందిలో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్లు గుర్తించి 21 మందిని మాత్రమే చిత్రహింసలు పెట్టి కేసులు పెట్టారు. మిగతా కాంగ్రెస్ వాళ్లను వదిలేశారు. కానీ దాడి జరిగిన వీడియోల్లో కాంగ్రెస్ వాళ్లు కనబడుతున్నారు. ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్లు మాత్రమే చేశారని చెప్పాలని కుట్ర చేస్తున్నారు అని ధ్వజమెత్తారు.

వాళ్ల చేతగానితనాన్ని, అధికారులకు, ప్రభుత్వానికి జరిగిన పరాభవానికి ఏం చెప్పాలో తెలియక దీనికి రాజకీయ రంగు పులిమారు. 21 మంది రైతులు అంతా కూడా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే. వికారాబాద్ ఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు చిత్ర వారిని చిత్ర హింసలు పెట్టారు. మూడు మూడు గంటలపాటు కొట్టారు. మెజిస్ట్రేట్ ముందు కొట్టారని చెబితే మళ్లీ కొడతామని అమానవీయంగా వ్యవహరించారని వాళ్లు మాకు చెప్పారు. తీవ్రవాదులను పట్టుకొనేందుకు వెళ్లినట్లు డోర్లను తంతు పోలీసులు ఊర్లో భయానక వాతావారణ సృష్టించారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్లు తాగి బూతులు మాట్లాడుతూ ప్రజలపై దాడులు కూడా చేశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మీరుండేది ఐదేళ్లు మాత్రమే.. అధికారం శాశ్వతమని భావించకండి. నువ్వు చక్రవర్తివి కాదు. నీలాంటి చాలా మంది చూశాం. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే నీ పదవి ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల భూములు గుంజుకుంటా అంటే మేము ఊరుకోం అని హెచ్చరించారు.

రేవంత్ రెడ్డిపై ఇవ్వాళ కొడంగల్ మర్లవడ్డది. రేపు తెలంగాణ మొత్తం మర్లవడుతది. కావాలంటే మమ్మల్ని జైల్లో పెడితే పెట్టు. మేము అధికారంలో వచ్చాక నిన్ను ఏం చేయాలో అది చేస్తాం. కానీ రైతులను వదిలేయ్. నువ్వు అరెస్ట్ చేయించిన 21 మంది రైతుల కుటుంబాల ఉసురు నీకు, నీ పార్టీకి తాకుతది అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఏ పేద ప్రజల ఓట్లతో గెలిచావో ఆ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న నీకు వాళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. 21 మంది రైతులు బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ వారికి న్యాయసాయంతో పాటు అండగా ఉంటుంది. రాఘవేంద్ర అనే ఉద్యోగి తన ఉద్యోగం కోసం భయపడుతున్నాడు. ఆయన ఉద్యోగం పోకుండా అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాం అని స్పష్టం చేశారు.

మిగతా బాధిత రైతులకు కూడా చెబుతున్నా మీరు భయపడకండి. ఇంతకంటే మిమ్మల్ని వాళ్లు ఏం చేసేది లేదు. ఉరి శిక్ష వేయరు.. ధైర్యంగా ఉండండి. తన వైఫల్యాలను తప్పించుకోవటానికే రేవంత్ రెడ్డి ఈ డ్రామాలు చేస్తున్నాడు. 60, 70 లక్షలు విలువ చేసే భూమికి 10 లక్షలు ఇస్తా అంటే రైతులు ఒప్పుకుంటారా? అని అడిగారు.

సంగారెడ్డి న్యాల్కల్ వద్ద కూడా భూసేకరణ విషయంలో దాడి జరిగింది. కేసీఆర్ గారు ఫార్మాసిటి కోసం హైదరాబాద్‌లో 14 వేల ఎకరాలు సేకరిస్తే దాన్ని వద్దని ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఫార్మా విలేజ్ పేరుతో తన కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టే కుట్ర చేస్తున్నాడు. రైతులు ధైర్యంగా ఉండండి మీకు కేసీఆర్, బీఆర్ఎస్ అండగా ఉంటుంది అని తెలిపారు.

ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే మేము ఎదుర్కొంటాం. మీ తరపున పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం పేదవాళ్లపై కేసులు పెడుతూ వాళ్లను ఇబ్బందులు పెడుతోంది. 30, 40 కిలోలు కూడా లేని పిల్లలపై అంటెంప్ట్ మర్డర్, కలెక్టర్‌పై దాడులు చేశారంటూ కేసులు పెట్టారు. పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్న పిల్లలపై కేసులు పెట్టటానికి నీకు మనసేలా వచ్చింది రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ప్రశ్నించారు.

చేతనైతే మాతో కొట్లాడు. ఈ పిల్లలను, రైతులను వదిలేయ్. ఫార్మా విలేజ్‌ల పేరుతో రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే భూముల దందా చేస్తున్నారో ఆయా ప్రాంతాల్లో రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. జ్యోతి అనే గర్భిణీ మహిళ భర్తను అరెస్ట్ చేశారు. ఆమె ఎంతో ఆవేదనతో ఉంది. ఆ మహిళకు వైద్యం సాయం అందిస్తాం. బీఆర్ఎస్ పేదలు, ప్రభుత్వ బాధితుల తరపున పోరాటం చేస్తూనే ఉంటుంది అని ప్రకటించారు.