mt_logo

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి కేటీఆర్ అండ

వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం లోని 16 చింతల తాండ గ్రామంలో వారం రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబాన్ని ఆదుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు వచ్చారు.

ప్రేమోన్మాది నాగరాజు చేసిన దాడిలో తల్లితండ్రులిద్దరూ శ్రీనివాస్, సుగుణ చనిపోవటంతో ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లలు దీపిక, మదన్‌లు అనాథలయ్యారు. దాడి ఘటనలో ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. చనిపోయిన దంపతుల పిల్లలిద్దరిని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఈ రోజు కేటీఆర్ వద్దకు తీసుకొచ్చారు. పిల్లలద్దరినీ చూసిన కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆరోగ్యం గురించి వాకబు చేసి ధైర్యంగా ఉండాలని మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

దీపికా, మదన్‌ల చదువు బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. హత్యకు గురైన పిల్లల తల్లి సుగుణ బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త. గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ కూడా. పార్టీ తరపున కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

అత్యంత విషాదకరమైన ఈ సంఘటనలో తల్లిదండ్రులను కోల్పోవటమే కాదు.. దాడికి గురైన పిల్లలు దీర్ఘాకాలం చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబానికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షలు వారికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ ఘటనలో నిందితుడు నాగరాజుకు కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.