mt_logo

కొడంగల్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో చెల్లుతుందా?

ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఉప్పల్ సెగ్మెంట్ పరిధిలోని నాచారం, మల్లాపూర్, హబ్సీగూడ, ఈసీఐఎల్ ప్రాంతాల్లో, మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నేరేడ్ మెట్, సఫిల్ గూడ, అనుటెక్స్ ప్రాంతాల్లో, మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నాగారం, దమ్మాయిగూడ తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 31 లక్షల పైచిలుకు ఓటర్లున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఒక్క అభ్యర్థి దొరకలేదు.. కొడంగల్ లో ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చారు. కొడంగల్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో చెల్లుతుందా? అని ఎద్దేవా చేశారు. 16మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు లాభమని, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, నిధులు, రాష్ట్ర హక్కులు సాధించుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేదు.. 2014 ఎన్నికల ముందు చాయ్ పే చర్చ అని రచ్చచేసిన మోడీ గడిచిన ఐదేళ్ళలో చేసిందేమీ లేదు.. దేశమంతటా తెలంగాణ పే చర్చ, మిషన్ భగీరథ పే చర్చ, మొత్తంగా కేసీఆర్ పే చర్చ షురూ అయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు.

40 ఏండ్ల క్రితం తన నాయనమ్మ ఇందిరాగాంధీ నినాదమైన గరీభీ హఠావో పేరుతో తానే ఈ దేశానికి టేకేదార్ అంటూ రాహుల్, తానే ఈ దేశానికి చౌకీదార్ అంటూ మోడీ అంటున్నారని, ఓటు వేసేముందు ప్రజలు ఆలోచించాలని, దేశానికి టేకేదార్, చౌకీదార్ కావాలా? లేక జోర్దార్, వఫేదార్, జిమ్మేదార్ లాంటి కేసీఆర్ కావాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఏ గట్టుమీదుంటారో తేల్చుకోవాలని, ఆ గట్టున కరెంట్ అడిగితే కాల్చిచంపిన కాంగ్రెస్ పార్టీ ఉందని, ఈ గట్టున 24 గంటలు కరెంట్ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారని, ఆ గట్టున టీవీల సాక్షిగా అడ్డంగా దొరికిన ఓటుకు నోటు దొంగ ఉన్నాడని, ఈ గట్టున ఎందరో విద్యార్ధులకు ఉన్నత చదువులు అందించిన విద్యావేత్త ఉన్నాడని చెప్పారు. ఈ గట్టున కారుంటే ఆ గట్టున బేకారున్నాడని విమర్శించారు.

ఉప్పల్ లో మరో శిల్పారామం సిద్దమైందని, త్వరలోనే ప్రారంభించుకుందామని, రూ. 1400 కోట్లతో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు, రూ. 1600 కోట్లతో ఉప్పల్ నల్లచెరువు సుందరీకరణ పనులు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. వందల కోట్లతో నారపల్లి వరకు స్కైవే నిర్మించుకోనున్నామని, పనులు జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే ఈసీఐఎల్ వరకు మెట్రో రైల్ ను విస్తరిస్తామని, అధునాతన టెక్నాలజీతో జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుండి శాశ్వత పరిష్కారం చూపిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా పోరాడుతారని, అత్యధిక మెజార్టీతో రాజశేఖర్ రెడ్డిని గెలిపించి పార్లమెంట్ కు పంపాలని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *