mt_logo

కాంగ్రెస్, బీజేపీలు ఉత్తర భారత పార్టీలు మాత్రమే!!

కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలు కావని, ఉత్తరభారతదేశానికి చెందిన పార్టీలు మాత్రమేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం చేవెళ్ళ, మల్కాజిగిరి లోక్ సభ అభ్యర్ధులు గడ్డం రంజిత్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలకు మద్దతుగా మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వైద్యం, విద్య ఎట్లుండాలె? ప్రతి ఇంటికీ తాగునీరు, కొత్త కొలువులు, పరిశ్రమలపై కాకుండా గల్లీలో చిల్లర పంచాయితీల్లాగా రాహుల్, మోడీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలో 130 లోక్ సభ స్థానాలుంటే ఆ రెండు పార్టీలకు పట్టుమని పదిసీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు.

ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించిన కేసీఆర్.. అదే 16 ఎంపీలను చేతిలో పెడితే ఏం చేస్తారో ప్రజలకు తెలుసని అన్నారు. ఐదేళ్ళ క్రితం రాష్ట్రం ఎట్లుండే? ఇప్పుడెట్లుందో గమనించాలని కేటీఆర్ సూచించారు. నాడు కరెంట్ ఎప్పుడు ఉంటదో? ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి. నేడు 24 గంటలు కరెంట్ ఉండే పరిస్థితి. సారు-కారు-పదహారు-ఢిల్లీలో సర్కారు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మహేశ్వరంలో కొత్త కొలువులు సృష్టించే కంపెనీలు తీసుకొస్తున్నట్లు, కందుకూరు, ముచ్చర్లలో ఫార్మా సిటీ వస్తున్నదని, తద్వారా స్థానికులకు పెద్దఎత్తున కొలువులు దక్కుతాయని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా, సకాలంలో నిర్మాణం పూర్తి కావాలంటే చేవెళ్ళ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

అనంతరం మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. ఎల్బీనగర్, నాగోల్, బీఎన్ రెడ్డి నగర్ లో రిజిస్ట్రేషన్ల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, మూడు, నాలుగు నెలల్లో క్యాబినెట్ ఆమోదంతో ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డబ్బుల కట్టలతో అడ్డంగా దొరికిన అభ్యర్థి కావాలా? విద్యావేత్త మర్రి రాజశేఖర్ రెడ్డి కావాలా? నేరస్థుడి వైపు ఉందామా? లేక క్లీన్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ రెడ్డి వైపు ఉందామా? తేల్చుకోవాలని మల్కాజిగిరి ఓటర్లకు కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *