mt_logo

జాబ్ క్యాలెండర్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైన రాహుల్ గాంధీ స్పందించాలి: కేటీఆర్

తెలంగాణలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపైన ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎన్నికల ముందు స్వయంగా తెలంగాణలోని యువతను, నిరుద్యోగులను కలిసి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఈ మేరకు అన్ని ప్రధాన పత్రికల్లో పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటనలను సైతం విడుదల చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనల్లో తేదీలతో సహా ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికే 7 నెలల సమయం గడిచిపోయిందని కానీ ఒక్క కొత్త ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ కాలేదని, అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 10 నోటిఫికేషన్ తేదీల గడువు ముగిసిపోయిందన్నారు. 

ఇప్పటికే 7 నెలల కాలం గడిచిపోయిందని మరి మిగిలిన ఐదు నెలల కాలంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ విధంగా జారీ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన నాయకులు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో బాధ్యత తీసుకొని స్పందించకపోవడం వల్లనే రాహుల్ గాంధీని ఈ విషయంలో ప్రశ్నిస్తున్నట్లు తెలిపిన కేటీఆర్, ఈ అంశంపైన రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.