లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసిన అంశంపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుండె నొప్పి వచ్చిన గిరిజన రైతు బిడ్డ హీర్యా నాయక్‌కు బేడీలు వేయడం అమానవీయం, రేవంత్ కూృర మనసత్వానికి నిదర్శనం. జైలులో ఉన్న రైతు బిడ్డ హీర్యా నాయక్‌కు నిన్న గుండెల్లో నొప్పి వస్తే.. వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపింది అని విమర్శించారు.
ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసింది. ఆసుపత్రికి తరలియకుండా.. తగిన చికిత్స అందించకుండా అమానవీయంగా వ్యవహరించింది. ఈరోజు ఉదయం మళ్లీ గుండెపోటు వచ్చింది.. సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇప్పుడు మేము ఒత్తిడి తేవడంతో హైదరాబాద్‌కు తరలిస్తామని చెప్తున్నారు అని అన్నారు.
వారితోపాటు రాఘవేంద్ర, బసప్ప ఆరోగ్యం కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డికి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. గుండెపోటు వచ్చిన రైతుబిడ్డకు బేడీలు వేసి అన్యాయంగా, అమానవీయంగా ఆసుపత్రికి తీసుకువచ్చింది ప్రభుత్వం. స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సిన మనిషిని బేడీలు వేసి తీసుకువచ్చారు. ఇంతటి దుర్మార్గమైన అమానవీయమైన ప్రవర్తన క్షమార్హం కాదు అని మండిపడ్డారు.
రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి హక్కులను హరించడమే. నూతన క్రిమినల్ చట్టం బీఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా, పోలీస్ మాన్యువల్స్, జైల్ మాన్యువల్స్ ప్రకారం అండర్ ట్రావెల్స్ ఖైదీల హక్కులను హరించడమే. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర గవర్నర్ ఈ అంశంలోని తగిన విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి జైపూర్లో విందులు వినోదాలలో జల్సాలు చేసుకుంటూ చిందులు వేస్తున్నారు. కానీ తెలంగాణ గిరిజన రైతులు మాత్రం జైళ్లలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు రాహుల్ గాంధీకి నిజంగానే హృదయం ఉంటే, గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే తమ ప్రభుత్వానికి కేసులు రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి చేతకాకుంటే వారందరికి అవసరమైన వైద్య సహకారాన్ని, సహాయన్ని మా పార్టీ తరఫున అందిస్తాం. మా సామ్రాజ్యంలోకి మేము చెప్పిందే నడవాలని అహంకారంతోనే, రేవంత్ రెడ్డి ఆయన సోదరులు గిరిజన రైతన్నల ప్రాణాలు తీస్తున్నారు. కేవలం నా మాట వినలేదు అన్న ఏకైక కారణంతోనే వారి పైన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మానవత్వంతో వ్యవహరించాలి అని సూచించారు
బేషజాలకు పోకుండా గిరిజనులను రైతన్నలను వారిపై ఉన్న అక్రమ కేసులను వెనక్కి తీసుకొని జైలర్ నుంచి విడిపించాలి. సరిగ్గా నెల రోజుల క్రితం తమ భూములు గుంజుకుంటున్న ప్రభుత్వంపైన లగచర్ల రైతులు తిరగబడ్డారు. తన పైన ఎలాంటి దాడి జరగలేదని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని వారిపై కేసులు పెట్టించారు అని ఆరోపించారు.
ఆయన అహంకారం దెబ్బతిన్నదని, ప్రతిష్టకు తీసుకొని అదే రోజు 17 మంది రైతన్నలను అరెస్ట్ చేయించారు. తెల్లారి మా పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయించారు. అదుపులోకి తీసుకున్న రైతన్నలందరిని పోలీసులు థర్డ్ డిగ్రీ టార్చర్ చేయడం జరిగింది. చిత్రహింసలకు గురి చేయడం జరిగింది.. ఇదే విషయాన్ని మేము వారిని జైల్లో కలిసినప్పుడు మాకు చెప్పారు తమపై పోలీసులు చేసిన థర్డ్ డిగ్రీని బయటపడితే తమ కుటుంబ సభ్యులను కేసుల్లో ఇరికిస్తామని, భౌతిక దాడులు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించిందని బాధపడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
అదానీ కోసం, అల్లుడి కోసం భూములు గుంజుకుంటామంటే ఇవ్వకపోవడమే రైతన్నలు చేసిన ఏకైక తప్పు.. రూ. 70 లక్షల విలువ చేసే భూమిని కేవలం పది లక్షలకు గుంజుకుంటామంటే ఇవ్వకపోవడం. రేవంత్ రెడ్డి అనే రాజు, అహంకారి భూములు అడిగితే ఇవ్వకపోవడమే గిరిజనులు, రైతన్నలు చేసిన ఏకైక తప్పు 30 రోజులు రైతు బిడ్డలు జైళ్లలో మగ్గేలా ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తున్నది. రేవంత్ రెడ్డి భూదాహం, అహంకారం వలనే రైతులు జైళ్లలో మగ్గుతున్నారు అని ఆక్షేపించారు.
20 రోజుల పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకు కనీసం పేపర్లు కూడా ఇవ్వకపోవడం వల్లనే రైతన్నలు ఇంకా జైళ్లలో ఉన్నారు అని కేటీఆర్ దుయ్యబట్టారు