mt_logo

పది నెలల్లోనే ఓ వైపు కరెంట్ కోతలు, మరో వైపు కరెంట్ వాతలు: కేటీఆర్

సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్సీ చేపట్టిన బహిరంగ విచారణలో కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా పార్టీ తరపున వాదనలు వినిపించాం. హైదరాబాద్‌లో మధుసుధనాచారి గారు, నిజామాబాద్‌లో ప్రశాంత్ రెడ్డి గారు, సిరిసిల్లలో నేను మా పార్టీ వాదనలు వినిపించాం అని తెలిపారు.

ఈ నెల 21 నాడు కూడా నేను, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు మా వాదనలను ఈఆర్సీకి వినిపించాం..ఉచిత్ విద్యుత్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విద్యుత్‌ను ఊడగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఉచిత విద్యుత్ ఇస్తున్నామనే సాకుతో ప్రజలపై రూ. 18 వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద మోపే ప్రయత్నం చేస్తోంది అని దుయ్యబట్టారు.

అసంబద్ధ, ఆశాస్త్రీయమైన ప్రతిపాదనలతో మధ్య తరగతి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందని మేము భావిస్తున్నాం. అందుకు ఈ ప్రతిపాదనలను తిరస్కరించాలని ఈఆర్సీకి మేము విజ్ఞప్తి చేశాం అని అన్నారు.

ముఖ్యంగా 300 యూనిట్లు దాటితే ఉన్న రూ. 10 ఫిక్స్‌డ్ ఛార్జీని ఏకంగా ఐదు రెట్లు అంటే రూ. 50 పెంచే తలతిక్క నిర్ణయం మరొకటి ఉండదు. ఎండాకాలం వచ్చిదంటే 80 శాతం ఇళ్లలో 300 యూనిట్ల కరెంట్ వినియోగం పెరుగుతుంది. ఈ లెక్కన కరెంట్ ఛార్జీలు ఎంత పెరుగుతాయో ప్రజలు ఆలోచించాలని కోరుతున్నానని అన్నారు

భారీ పరిశ్రమలతో పాటే, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ఒకే విధమైన కేటగిరీ కరెంట్ కనెక్షన్ అనే పనికి మాలిన ప్రతిపాదన చేశారు. అదానీ లాంటి వ్యక్తి పెట్టే సంస్థలకు, సూక్ష్మ పరిశ్రమలకు ఒకే రేటు పెట్టటమనేది అత్యంత పనికిమాలిన నిర్ణయం అని మండిపడ్డారు.

ఈ ప్రతిపాదన ఎందుకు పెట్టారంటూ అధికారులను అడిగితే గుజరాత్‌లో ఉందని చెప్పారు. గుజరాత్ గడ్డి తింటే మనం గడ్డి తినాలా అని అడుగుతున్నా.. ప్రభుత్వం నిర్ణయంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి, కుటీర పరిశ్రమలు దెబ్బ తింటాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు. వారి పొట్ట మీద కొట్టే పరిస్థితి తేవద్దు అని కేటీఆర్ సూచించారు.

అదానీకి సిరిసిల్లలో సాంచాలు నడుపుకునే ఆసామీ ఒకే రేటు కట్టాలంటే ఎలా కడుతారో ప్రభుత్వం కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. కేసీఆర్ గారు పదేళ్లలో పాటు మిషన్ భగీరథతో ఉచితంగా నీళ్లు, రైతులకు ఉచిత విద్యుత్, కాళేశ్వరం కోసం మోటార్లు వాడిన సరే ఒక్క రూపాయి ప్రజల మీద భారం వేయలేదు అని గుర్తు చేశారు.

రైతులకు దేశంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా కేసీఆర్ గారు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి వారిపై పైసా భారం వేయలేదు. నెలకు రూ. వెయ్యి కోట్లు ప్రభుత్వమే భరించింది..కరెంట్ ఛార్జీల రూపంలో పైసా భారం ప్రజల మీద మోపకుండా చాలా చక్కగా ప్రభుత్వమే అద్భుతంగా అన్ని భరించింది. పదేళ్లు మేము పైసా పెంచకుండా నడిపితే పది నెలల్లోనే ఓ వైపు కరెంట్ కోతలు, మరో వైపు కరెంట్ వాతలు అని ఎద్దేవా చేశారు.

పరిస్థితి తీవ్రత ప్రభుత్వానికి తెలియాలనే వరుసగా గత ఐదు రోజులుగా ప్రజల తరపున ప్రధాన పక్షంగా మా వాదన వినిపిస్తున్నాం.. ఛార్జీల పెంపును తిరస్కరిస్తున్నాం.. దాన్ని అడ్డుకుంటాం అని హెచ్చరించారు.

ప్రభుత్వం అసంబద్ధంగా ముందుకు పోతే తప్పకుండా ప్రజలతో కలిసి ప్రజా పోరాటం చేస్తాం..సిరిసిల్లలో గతం పదేళ్లలో ఆత్మహత్యలు లేకుండా ఇక్కడి వస్త్ర పరిశ్రమను మేము నడిపాం. కానీ పదినెలల ఈ ప్రభుత్వ పాలనలో ఒక్క సిరిసిల్లలోనే 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో మరో 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని పేర్కొన్నారు.

ఈ లిస్టంతా అసెంబ్లీలో మేము ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం.. మేము ఆత్మహత్యలు లేని తెలంగాణగా మార్చితే.. మీ పదినెలల పాలనలో తిరిగి ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు. ఇకనైనా మీ బుర్ర మార్చుకోమని సీఎం ను కోరాం. కానీ ఆయన బుర్ర మారటం లేదు. ఆయన బుద్ధి మారటం లేదు అని విచారం వ్యక్తం చేశారు.

సిరిసిల్లలో ఉన్న 10 హెచ్‌పీని 30 హెచ్‌పీగా పెంచి సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాం.. పదేళ్లు మేము పైసా పెంచకుండా ఎట్ల నడిపామో.. ఈ ప్రభుత్వం కూడా అలాగే నడపాలని డిమాండ్ చేస్తున్నాం. కరెంట్ ఛార్జీలు పైసా పెంచిన సరే ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రజల తరపున కొట్లాడుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.