mt_logo

రేవంత్ చేస్తుంది మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్: కేటీఆర్

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన అంశాలను కౌంటర్ చేస్తూ, పూర్తి వివరాలతో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూసీ పరివాహాక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదు. జేసీబీలతో ఇళ్లు కూలగొట్టారు. కూలీలతో ఇళ్లను కూలగొట్టించారు. ఆ విషయాన్ని ఓ కూలీయే చెప్పాడు. ప్రాజెక్టుకు సంబంధించి అంచనాను రూ. 50 వేల కోట్ల నుంచి రూ. లక్షన్నర కోట్ల వరకు అన్ని పచ్చి అబద్ధాలే అని దుయ్యబట్టారు.

మూసీ బ్యూటీఫికేషన్ కాదు ఇది లూటీఫికేషన్ అని ప్రజలకు తెలియటంతో తప్పును కప్పి పుచ్చుకోవటానికి నానా ఇబ్బంది పడిపోతున్నాడు. మూసీ పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీ చేసే ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటోంది. ముఖ్యమంత్రికి మూసీ మీద ప్రేమ అంత కూడా ఢిల్లీకి మూటలు పంపించేందుకే అని అన్నారు.

బడేభాయ్ నోట్ల రద్దుపై రోజుకో కారణం చెప్పినట్టు.. ఛోటే భాయ్ కూడా మూసీపై రోజుకో కారణం చెబుతున్నాడు. అసంబద్ధంగా, ఆనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ఎంతటి అనర్థాలు జరిగాయో గుర్తు చేస్తున్నాను. మూసీ విషయంలోనూ ఇదే విధంగా ఆనాలోచితంగా, అసంబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని విమర్శించారు.

రూ. లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని రేవంత్ రెడ్డియే అన్నారు. మళ్లీ గజిని మాదిరిగా రూ. లక్షన్నర కోట్లు అన్నది ఎవ్వరూ అని అంటున్నాడు. ఒక రోజు బ్యూటీఫికేషన్, ఒక రోజు క్లీనింగ్, ఒకరోజు పునరుజ్జీవనం, ఒక రోజు నల్గొండకు మంచి నీళ్లు అంటూ రోజుకో మాట మాట్లాడుతున్నారు. గతంలో మేము మూసీ ప్రక్షాళన కోసం చాలా పనులు చేపట్టాం అని గుర్తు చేశారు.

1908లో అతిపెద్ద ఉప్పెన, వరద రావటంతో హైదరాబాద్‌లో 15 వేల మంది చనిపోయారు. దీంతో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ గారు హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించేందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సలహా కోరారు. అప్పుడు ఆయన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను నిర్మించాలని చెప్పారు. హైదరాబాద్‌లో వరదల కారణంగా ఇబ్బంది తలెత్తకుండా సిటీకి రక్షణ కవచంలా ఈ రెండు జలాశయాలను నిర్మించారు అని తెలిపారు.

ఆ తర్వాత మూసీ విషయంలో ఏ ప్రభుత్వం కూడా మళ్లీ అంత గొప్పగా పనిచేయలేదు. హైదరాబాద్‌లో ఉన్న నాలాలా ద్వారా 90 శాతానికి పైగా మురికి నీళ్లు, వాన నీళ్లు మూసీలోకే వస్తాయి. వరద నివారణకు, ప్రాణనష్టం లేకుండా ఉండేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు రిజర్వాయర్లు చాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తెలిపారు అని పేర్కొన్నారు.

2015 లో సెంట్రల్ పొలుష్యన్ బోర్డు అతి పెద్ద కాలుష్యమైన నది మూసీ అని రిపోర్ట్ ఇచ్చింది. మూసీ రివర్‌ను మురికి కూపంగా మార్చింది రేవంత్ రెడ్డి గారు అన్నట్లు గత పాలకులే. వారిలో కాంగ్రెస్ సహా టీడీపీ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చే వరకు మూసీని బాగు చేసేందుకు ఏ ప్రభుత్వం కృషి చేయలేదు. కేసీఆర్ వచ్చాక పొలుష్యన్ బోర్డు రిపోర్ట్ తెప్పించుకొని మూసీని బాగుచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు అని తెలిపారు.

2017 లో కేసీఆర్ గారు మొదటి సారి మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూసీని బాగు చేయాలనుకున్నారు. మూసీని మేము బ్యూటిఫికేషన్‌తో పాటు పునరుజ్జీవనం చేస్తూ నల్గొండకు మంచి నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు మూసీ పుట్టే వికారాబాద్ అడవుల్లోనే ఆ నదికి ఉరి వేసేలా రాడార్ నిర్మాణానికి అనుమతిచ్చారు అని కేటీఆర్ మండిపడ్డారు.

మూసీపై ఈస్ట్ టూ వెస్ట్ ఎక్స్‌ప్రెస్ హైవే 10 వేల కోట్ల రూపాయలతో కట్టాలని అర్బన్ మొబిలిటీ చేయాలని ఆలోచన చేశాం. ముఖ్యంగా పేదవాళ్లను నిరాశ్రయులను చేయవద్దని మేము ఆలోచన చేశాం. మొత్తంగా మేము మూసీ ప్రాజెక్ట్‌ను కేవలం రూ. 16 వేల కోట్లతో చేయాలని నిర్ణయించాం. దానిలో భాగంగా కొన్ని పనులు కూడా చేపట్టాం.. నాగోల్, ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్స్‌ను, పార్క్‌లను ఏర్పాటు చేశాం అని గుర్తు చేశారు.

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అని ఏ కాంగ్రెస్ వాళ్లు మొత్తుకుంటారో.. అదే కాళేశ్వరం నీళ్లను రూ. 1100 కోట్లతో గండిపేటలోకి కలపాలని నిర్ణయం తీసుకున్నాం. సౌత్ ఏషియాలోనే ఎక్కడ లేని విధంగా ఎస్టీపీలతో 100 శాతం మురుగు నీటి శుద్ధి చేసే పని పెట్టుకున్నాం. 5 కిలోమీటర్ల పాటు నాగోల్‌లో మూసీ శుద్ధి కోసం ల్యాండ్‌స్కేప్ చేసినప్పటికీ ఒక్క పేదవాడి కడుపు కొట్టలేదు. హైదరాబాద్‌లో 2 వేల ఎల్ఎండీ మురికి నీరు ఉత్పత్తి అవుతుంది. మేము వచ్చే నాటికి 700 ఎల్ఎండీలు మాత్రమే శుద్ధి చేసే కెపాసిటీ మాత్రమే ఉండేది. అందుకే ముందుగా ఎస్టీపీలను నిర్మించాలని కేసీఆర్ గారు 31 ప్లాంట్లను మంజూరు చేశారు అని అన్నారు.

రేపు నాగోల్‌లో మేము కట్టిన ఎస్టీపీని మా ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శిస్తాం. మొత్తం 31 ఎస్టీపీలు పూర్తి చేస్తే.. నల్గొండకు పూర్తిగా స్వచ్ఛమైన నీరు నల్గొండకు వెళ్తుంది. గావుకేకలు, పెడబొబ్బలు పెడుతున్న నల్గొండ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి మాదిరిగా కాకుండా విషయం తెలుసుకొని మాట్లాడండి. ఎస్టీపీలు పూర్తి అయితే చాలు నల్గొండకు మంచి నీళ్లు వెళ్తాయి. వాటి కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసి దోపిడీ చేయాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు.

మేము ఎస్ఎన్డీపీ పేరుతో దాదాపు వెయ్యి కోట్లతో కార్యక్రమం చేపట్టాం. ఈ కారణంగానే హైదరాబాద్‌లో వాన నీళ్లు నిలవటం లేదు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా ప్రశంసించారు. ఈ ముఖ్యమంత్రి ఇన్ని మాటలు మాట్లాడుతూ మేము తీసుకున్న ఎస్ఎస్డీపీ రెండో దశను దాన్ని రద్దు చేశారు. పేదలకు అన్యాయం చేయకుండా హైదరాబాద్‌లో వరదలు, బురద లేకుండా మనం తక్కువ ఖర్చుతో బాగు చేయవచ్చు అని సూచించారు.

ఎస్ఎన్డీపీకి సంబంధించి కేంద్రం నుంచి కూడా నిధులు కోరాం. కానీ వాళ్లు ఇవ్వలేదు. మూసీ మీద మేము దాదాపు 15 బ్రిడ్జిలు వాటిపై చెక్ డ్యామ్‌లు ప్లాన్ చేశాం. అక్కడ టూరిజం కూడా ప్లాన్ చేశాం. ఇప్పుడున్న ఇంజనీర్లనే మేము యూరోప్‌లో ఉన్న సిటీల్లో ఉన్న బ్రిడ్జిలను పరిశీలించామని పంపించాం. మన సంస్కృతికి అనుగుణంగా ఇక్కడ ప్లాన్ చేద్దామనుకున్నాం.. మూసీ మీద 15 బ్రిడ్జిల కోసం రూ. 500 కోట్లకు పైగా కేటాయించాం. రూ. 4,000 కోట్లతో 100 శాతం మురుగు నీరు శుద్ధి, 11 వందల కోట్లతో గండి పేట నీళ్లకు గోదావరి నీళ్లను కలిపే ప్రయత్నం చేశాం. మూసీ మీద బ్రిడ్జిల కోసం 500 కోట్లు మంజూరు చేశాం. ప్రపంచ స్థాయి 9 కంపెనీలతో మూసీ ప్రక్షాళనకు డిజైన్లు కూడా చేశాం. రేవంత్ రెడ్డి డిజైన్ల కోసం మళ్లీ డబ్బులు వృథా చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆ డిజైన్లకు ఆయనకు పంపిస్తానని అన్నారు.

మేము మూసీ కోసం ఇప్పటికే ఐదు పనులు చేశాం. ఒక్క ఎక్స్‌ప్రెస్ హైవే మాత్రమే చేయాల్సి ఉంది.. రేవంత్ రెడ్డి గారికి మేము వడ్డించిన విస్తరిలా అన్ని సిద్ధం చేసి పెట్టాం. మేము మూసీని ప్రణాళికబద్ధంగా ప్రక్షాళన చేసే విధంగా చర్యలు చేపట్టాం. మూసీకి సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి.. డ్రోన్ సర్వే కూడా చేశాం. దీనికి సంబంధించి అవసరమైన రీహబిలిటేషన్ సహా కొన్ని పనులకు నిధులు కావాలని కోరాం అని పేర్కొన్నారు.

రివర్ బెడ్‌లో 900 నివాసాలు ఉన్నాయి. బఫర్ జోన్‌లో ఉన్న ఇళ్లకు సంబంధించి అన్ని ఇళ్లకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. బఫర్ జోన్‌లో మొత్తం 11 వేల నిర్మాణాలు ఉన్నాయని.. వాటిని తొలగిస్తే లక్ష మంది నిరాశ్రయులవుతారని కేసీఆర్ గారికి చెప్పాం. పేదవాళ్లను ఇబ్బంది పెట్టే ప్రాజెక్ట్ వద్దు అని కేసీఆర్ గారు చెప్పారు. బఫర్ జోన్ జోలికి పోకుండా మూసీ ప్రాజెక్ట్ మిగతా పనులు చేయండని చెప్పారు.. పేదలకు నష్టం జరగకుండా అవసరమైతే రీడిజైన్ చేయండని చెప్పారు. మూసీ పరివాహాక ప్రాంతంలో ఉన్న వారికి లేని ఇబ్బంది మీకెందుకు అని అన్నారు. వాళ్లకు మనం పర్మిషన్లు ఇచ్చి మళ్లీ వాళ్లను ఇబ్బంది పెట్టటం సరికాదని కేసీఆర్ అన్నారు అని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌కు తెలంగాణ ఇప్పుడు ఏటీఎంగా మారిపోయింది. రాహుల్ గాంధీ గారికి ఎప్పుడు పైసలు అవసరమైన సరే తెలంగాణ గుర్తొస్తోంది. మూసీ కోసం రూ. లక్షా 50 కోట్లు ఎవరన్నారని ముఖ్యమంత్రి గారికి కోపం వస్తోంది. సుందరీకణ అని ఎవరు అన్నారని ముఖ్యమంత్రి అన్నాడు. కానీ ఆయనే ఆ విషయాన్ని అన్నాడు. మూసీ పునరుజ్జీవం కోసం అన్ని డిజైన్లు, మొత్తం సిద్ధంగా ఉన్నాయి..మూసీ డిజైన్ వద్దంటే తన ఆస్తి అమ్మి కన్సల్టెంట్ సంస్థలకు ఇచ్చిన 140 కోట్లను ఇస్తానని ముఖ్యమంత్రి అన్నారు. మరీ ఆయన అఫిడవిట్‌లో రూ. 30 కోట్లే ఉన్నాయి. మరి 140 కోట్లు తన తమ్ముడి కంపెనీ నుంచి తెచ్చి ఇస్తారా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

అసలు బఫర్ జోన్‌లోకి వెళ్లకుండానే మేము చేసిన పనులను కొనసాగిస్తే సరిపోతుంది. మూసీ ప్రారంభమయ్యే వికారాబాద్ అడవుల్లో 12 లక్షల చెట్లు నరికి వనమేధం చేస్తున్నారు. కింద హైదరాబాద్‌లో గృహమేధం చేస్తున్నారు. వెరసి మీరు చేస్తున్నది ధనయజ్ఞం తప్ప మూసీ బ్యూటీఫికేషన్ కాదు. మన మెడ మీద కత్తి పెట్టినా సరే మోడీకి లొంగకుండా దామగుండంలో చెట్లు నరికేందుకు అంగీకరించలేదు అని తెలిపారు.

సబర్మతి కూడా రూ. 7 వేల కోట్లతో పూర్తైంది. గంగా నది రూ. 2 వేల కిలోమీటర్లకు కూడా రూ. 40 వేల కోట్లు కాలేదు. మరి రేవంత్ రెడ్డి గారు 56 కిలోమీటర్లకు రూ. 2700 కోట్లు చేస్తామని చెబుతున్నారు. అంటే ప్రపంచంలోనే ఇంతకన్నా పెద్ద కుంభకోణం మరొకటి లేదు. యుమునా నది ఢిల్లీ నగరంలో ఉంది, కోల్‌కతాలో హుబ్లీ, అహ్మదాబాద్‌లో సబర్మతి నది లేదా? సిటీ మధ్యలో నది లేదని అంటాడు సీఎం. ఆయనకు తెలుసా? లేదా? అని ప్రశ్నించారు.

స్వచ్ఛందంగా ఇళ్లు సంతోషంగా కూల్చుకుంటే వాళ్ల ఇళ్లకు వెళ్దాం. వాళ్లు సంతోషంగా ఉంటే దావత్ ఇస్తారు కదా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్ని అబద్ధాలు చెప్పటం నీచం. మొత్తం రూ. 25 వేల కోట్లతో పూర్తి చేసే ప్రాజెక్ట్‌కు ఇంత పెద్ద హడావిడి ఎందుకు? అని అడిగారు.

ముఖ్యమంత్రి గారు చెప్పిన మెయిన్‌హార్ట్ అనే ఘనత వహించిన కంపెనీపై పాకిస్థాన్‌లో ఆ కంపెనీ డైరెక్టర్లకు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. వాళ్లపై రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వటానికి కారణం అక్కడ రావి నది ప్రాజెక్ట్‌ అంచనాలను ఆరు నెలల్లో డబుల్ చేశారు. ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ అంచనాలను డబుల్ చేయటంలో దిట్ట. అందుకే వాళ్లపై అంత ప్రేమ చూపారు. పాకిస్తాన్‌లోనే కాదు మన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఝార్ఖండ్ ప్రభుత్వం కూడా ఈ కంపెనీని నిషేధించింది అని ఆరోపించారు.

ముఖ్యమంత్రికి స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి, వన్‌నెస్ విగ్రహానికి తేడా తెలియదు..గూగుల్ నుంచి ఎత్తుకొచ్చిన ఫోటోలతో లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంత దిక్కుమాలిన ప్రజెంటేషన్ ఇస్తారా.. ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు. అందుకే ఏదీ పడితే అది వాగి దొరికిపోతాడు. దొరికిపోవటం ఆయన స్పెషాలిటీ అని విమర్శించారు.

మేము చేసిన పనులను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లు. కానీ పేదవాడి కడుపుకొడతామంటే ఊరుకోం. మేము చేసిన పనులను కొనసాగిస్తూ.. మేము చేపట్టిన డిజైన్లను పూర్తి చేస్తే మూసీ పునరుజ్జీవం పూర్తిగా జరుగుతుంది. రూ. 25 వేల కోట్లతో ఒక్క పేదవాడి కడుపు కొట్టకుండా మూసీకి పునరుజ్జీవం తేవచ్చు.. పేదల కడుపు కొట్టి, వేల కోట్లు దోచుకుంటూ మూసీ పునరుజ్జీవం చేస్తామంటే మేము వ్యతిరేకమే అని స్పష్టం చేశారు.

మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీలకు పైసలు లేనప్పుడు.. మూసీ కట్టేందుకు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డితో తెలంగాణకు ఎంతో మేలు జరిగింది. మూసీతో మురిసె రైతులెందరో, ఎంత ఆయకట్టు సాగులోకి వస్తుంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎంతో చెప్పాగలవా? నీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత అది స్కామ్ అని అందరికీ తెలిసిపోయింది. మూసీ పక్కన బిల్డింగ్‌లు వస్తే మళ్లీ ఫోర్త్ సిటీ ఎందుకు? అని అడిగారు.

మూసీని వ్యతిరేకిస్తే కసబ్ అంటూ పెద్ద మాటలను సీఎం మాట్లాడాడు. ఆయనంత పెద్ద మాటలు నేను మాట్లాడను. కసబ్ టెర్రరిస్ట్ అయితే.. నువ్వు రూ. 50 లక్షలతో దొరికిన వ్యక్తివి అని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రికి నేను బంఫర్ ఆఫర్ ఇస్తున్నా. రిజువినేషన్ అనే పదానికి చూడకుండా రేవంత్ రెడ్డి స్పెల్లింగ్ చెబితే.. ఆయనకు రూ. 50 లక్షలు పట్టే బ్యాగును బహుమానంగా ఇస్తా అని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌లో వరదలు వస్తే ఇంటింటికి రూ. 10 వేలు ఇచ్చాం. కానీ మీరు ఖమ్మంలో వరద బాధితులకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు. రూ. 10 వేల ఆర్థిక సాయంపై విచారణ చేసేందుకు ప్రభుత్వంలో వాళ్లే ఉన్నారు. వాళ్లు విచారణ చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు వదిలి ఎందుకు మూసీని ముందు పెట్టుకున్నారు అని అడిగారు.

మొత్తం రెడీగా రూ. 25 వేల కోట్లతో పూర్తి చేసే ప్రాజెక్ట్ రూ. లక్షన్నర కోట్లకు ఎందుకు చేరిందో చెప్పామంటే ఎందుకు చెప్పటం లేదు. ప్రజలు మేము మూసీ వద్ద సంతోషంగా ఉన్నామని చెబుతుంటే.. ఈ ముఖ్యమంత్రికి ఎందుకు ఇబ్బందులు? అక్కడ వెళ్లి ప్రజలను అడుగుదాం. కావాలంటే మీడియా కూడా వెళ్లి పరిశీలించవచ్చు అని అన్నారు.

దామగుండానికి సంబంధించి 2017లో జీవో ఇచ్చాం. ప్రజలు, పర్యావరణవేత్తలు వ్యతిరేకించటంతో మేము ఆ ఇంచు భూమిని కూడా మోడీకి అప్పగించలేదు. రేవంత్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కనుకే మోడీకి భయపడి ఆయనకు దాసోహం అంటూ దామగుండం అడవులను అప్పగించారు అని ధ్వజమెత్తారు.

ప్రజలను నిరాశ్రయులను చేస్తూ కోట్ల రూపాయల అవినీతి చేస్తామంటే మేము మూసీ ప్రాజెక్ట్‌ను అంగీకరించం. ఈ ప్రాజెక్ట్‌లో రాహుల్ గాంధీ గారికి వాటాలు, దోపిడీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంత ప్రజాధనం వృథాకు సంబంధించి వివరణ ఇవ్వాలి కదా? గాలిలో బాణాలు వేసుకుంటూ మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వంలో పెద్దలు. వీళ్లకు కనీసం అవగాహన ఉందా? అని కేటీఆర్ అడిగారు.

ఇందులో జరుగుతున్న దోపిడీకి సంబంధించి ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజా పోరాటాలను చేస్తాం. గవర్నమెంట్‌‌లో ఉండి పిచ్చి మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రిని ప్రజలు పిచ్చోడు అనుకుంటారు. కోకాపేట భూములు, ఓఆర్ఆర్ కుంభకోణం అని నాపై ఆరోపణలు చేశాడు. మరి పది నెలలైనా ఎందుకు విచారణ చేయటం లేదు అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క మాట మీదనైనా నిజాయితీగా నిలబడ్డాడా? అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారు. మూక మాదిరిగా మా మీద పడుతున్నారు. నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉంటే సమాధానం చెప్పమనండి. అసెంబ్లీలో కూడా మాట్లాడతాం అని అన్నారు.

ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి మీద నాకు అనుమానం ఉంది. ఆయనను ఆ విధంగా వదిలిపెట్టవద్దని వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి అని కేటీఆర్ పేర్కొన్నారు.