mt_logo

రేవంత్ చేతగానితనం వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగింది: కేటీఆర్

సుంకిశాలలో జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని.. అధికారులు చెప్పినా కూడా వినకుండా గేట్లు అమర్చటంతో ఈ ప్రమాదం జరిగింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. సుంకిశాలలో జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి అసమర్థత, చేతగానితనం వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగింది. ప్రభుత్వం తప్పు లేకుంటే ఎందుకు వారం రోజులపాటు దాచి ఉంచింది అని దుయ్యబట్టారు

అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న సమయంలో ఆగస్ట్ 2 న ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు అసెంబ్లీ జరుగుతోంది.. కానీ వాళ్ళు చెప్పలేదు. ఈ ప్రభుత్వానికి ఈ ప్రమాదం జరిగిన విషయం తెలియాదా? తెలిసి పట్టించుకోలేదా..ఒక వేళ మీకు ఈ విషయమే తెలియదంటే మాత్రం ఇది సిగ్గుచేటు అని విమర్శించారు.

ఈ ప్రమాదం గురించి మీకు తెలుసు.. వారం రోజులు గోప్యంగా ఉంచారు. మీరు ఆగమాగం పనులు ప్రారంభిచంటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులే చెబుతున్నారు. అధికారులు చెప్పినా కూడా వినకుండా గేట్లు అమర్చటంతో ఈ ప్రమాదం జరిగింది..అదృష్టవశాత్తు కూలీలు షిఫ్ట్ మారినప్పుడు ప్రమాదం జరిగింది.. లేకుంటే చాలా ప్రాణనష్టం జరిగేది అని అన్నారు.

మంచి జరిగితే వాళ్ళది.. చెడు జరిగితే మాత్రం బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసే చిల్లర ప్రయత్నాలు వద్దు. పురపాలక శాఖను పర్యవేక్షించకుండా ఉన్నా ముఖ్యమంత్రిదే దీనికి బాధ్యత. మళ్లీ మాపైనే చిల్లర దాడి చేసే చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లు మంచి జరిగితే మాది.. లేదంటే ఇతరుల తప్పు అని ప్రకటిస్తారు. బాధ్యతల నుంచి తప్పించుకొని గత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేటు అని కేటీఆర్ ఆక్షేపించారు.

ఎన్నికల్లో ప్రయోజనం కోసం కాళేశ్వరంపైన చేసిన అడ్డగోలు వాదనలు తేలిపోయాయి. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైతే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం రిజర్వాయర్లలో నీళ్ళు ఎలా నింపుతుంది.. నీళ్ల విషయంలో కేసీఆర్ విజయాలను అంగీకరించలేని కురచమనస్తత్వంతోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అని ధ్వజమెత్తారు.

కాళేశ్వరంలో ఏమైనా జరిగితే ఎన్డీఎస్ఏ వస్తది.. ఆగమేఘాల మీద రిపోర్ట్ ఇస్తారు.. మరి ఇక్కడకు కేంద్ర సంస్థ ఎందుకు వస్తలేదు.. ఇది కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అని అనుకోవాలె. ఈ అంశంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయండి.. సంఘటన స్థలంలోనే భట్టి గారు ఈ ప్రకటన చేయాలి. ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యం, పరిపాలన మీద పట్టులేని విషయం తెలిసిపోతోంది అని అన్నారు.

సుంకిశాల ప్రాజెక్టులో ఇంజనీరింగ్ లోపం లేదు.. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంలో లోపం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దివాలాకోరు విధానం తప్ప.. ఇప్పటిదాకా తీసుకొచ్చిన విధానాలు ఏంటో చెప్పాలి. మేడిగడ్డలో జరిగిన సంఘటనను మేము దాయలేదు.. ఎన్నికల కోడ్ ఉన్న సరే ప్రమాదం జరిగిన విషయాన్ని చెప్పాం. ఘటన జరిగిన గంటల్లోనే మేము లోపాలు సర్దుతామని ఎల్అండ్‌టీ చెప్పింది. మాకు సీక్రెసీ మెయింటెన్ చేయాల్సిన అవసరం లేకుండే..కానీ ముఖ్యమంత్రి ఎందుకు ఈ విషయాన్ని దాచారు.. ఈ ప్రమాదం జరిగినప్పుడు హైదరాబాద్‌లోనే సీఎం ఉన్నారు. ఆ మరునాడే దాని మీద పర్యవేక్షణ లేకుండా అమెరికాకు వెళ్లారు అని ఆరోపించారు.

మీకు చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. భట్టి విక్రమార్క గారు ఇతరులపై తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. ఒకవేళ ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియకపోతే ఆయనకు పరిపాలన మీద పట్టు లేనట్లే. సుంకిశాల ప్రమాదానికి కారణమై రాష్ట్ర సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేసింది అని పేర్కొన్నారు.

కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో దీనికోసం ప్రతిపాదన చేశారు.. అప్పట్లో మాకు అన్యాయం చేయవద్దంటూ రైతులు అడ్డుకోవటంతో అక్కడ ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ కూడా చనిపోయారు . గత ప్రభుత్వాల హయాంలో రెండు, మూడు దశలు అంటూ ప్రతిపాదనలు తెచ్చారు.. కానీ రైతులు మళ్లీ అడ్డుకోవటంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక ఏకబిగిన సాగునీటి ప్రాజెక్ట్‌లు చేపట్టారు. రైతుల్లో విశ్వాసం నింపటంతో సుంకిశాలను రైతులు అడ్డుకోలేదు అని తెలిపారు.

ఎలిమినేటి ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఎత్తిపోయాలంటే సాగర్లో 510 అడుగుల నీళ్లు ఉంటేనే నీళ్లు తీసుకోవటం సాధ్యమవుతుంది. సుంకిశాలలో మాత్రం 462 అడుగులు ఉన్నా సరే నీళ్లు తీసుకోవచ్చు. రాబోయే 50 ఏళ్లలో హైదరాబాద్ నీటి అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ను కేసీఆర్ చేపట్టారు అని గుర్తు చేశారు.

నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజా ప్రతినిధులంతా కలిసి మేము అప్పుడు దీనికి శంకుస్థాపన చేశాం. శరవేగంగా ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాం. మూడు పైప్‌లైన్ల ద్వారా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది..కృష్ణానదికి మూడు, నాలుగేళ్లు వరద రాకపోయిన డెడ్ స్టోరేజ్ నుంచి సుంకిశాల ద్వారా నీళ్లు తేవచ్చు. ఓఆర్ఆర్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ చేయాలనే ఉద్దేశంతో గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయాలు ఏమీ తెలియవు అని కేటీఆర్ మండిపడ్డారు.

ఢిల్లీ, బెంగళూరు లాంటి చాలా నగరాల్లో భారీగా కొరత ఉంది.. దేశ రాజధాని ఢిల్లీలో నీటి కోసం యుద్దాలు జరుగుతున్నాయి.. హైదరాబాద్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. హైదరాబాద్‌కు తాగునీటి కరువు ఉండకుండా చేసేందుకే ఈ ప్రాజెక్ట్ చేపట్టాం అని అన్నారు.

సీతారామా ప్రాజెక్ట్ గురించి భట్టి గారు బిల్డప్ ఇచ్చారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ను చేపట్టింది, పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారే.. కేసీఆర్ గారు పూర్తి చేసిన పథకాన్ని మీరు పూర్తి చేసినట్టు చెప్పుకున్నా.. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. సుంకిశాలను చాలా వేగంగా పనులు పూర్తి చేశాం. ఒక్క మోటార్ ఫిట్టింగ్ పనులు మాత్రమే ఉండే. 2024 సమ్మర్ నాటికి పూర్తి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం మొత్తం పనులను పెండింగ్ పెట్టారు అని ఫైర్ అయ్యారు.

పురపాలక శాఖలో మొత్తం పనులను పడకేశాయి.. సుంకిశాల పనులను పక్కన పెట్టారు..మొన్నటి ఎండకాలంలో హైదరాబాద్‌కు ట్యాంకర్లు రావటంతో ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి మీద కూడా విమర్శలు రావటంతో రెండు, మూడు నెలల కిత్రం దున్నపోతు నిద్ర వీడారు..ఆ తర్వాత అధికారులను ఒత్తిడి పెట్టి ఆగమాగం పనులు చేపట్టారు అని అన్నారు.

ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను కూడా స్పీడ్‌గానే చేశాం.. సాగునీరు, తాగునీరు రెండింటికి ప్రాధాన్యం ఇచ్చాం కనుకే రైతులు ఆందోళన చేయలేదు. సుంకిశాల ప్రమాదం కాంగ్రెస్ వైఫల్యం, రేవంత్ రెడ్డి గారి వైఫల్యం. అందుకే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పరిపాలన రాక ప్రతి దానికి కేసీఆర్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు.. వాళ్ల బాకా ఊదే పత్రికలే లా అండ్ ఆర్డర్ మీద కథనాలు రాస్తున్నాయి. పేర్లు మార్చటమేనా మార్పు అంటే.. భట్టి గారు తన ఆలోచన విధానాన్ని మార్చాలి. మేము కూడా సుంకిశాలకు వెళ్లి మొత్తం వివరాలను అక్కడ నుంచి వివరిస్తాం అని స్పష్టం చేశారు.

మేడిగడ్డ మీద విచారణ చేస్తున్నారు.. 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్న సరే మేడిగడ్డకు ఏమీ కాలేదు. ఇన్నాళ్లు కాళేశ్వరమ మీద చిల్లర, దివాళాకోరు ప్రచారాలు. ప్రకృతే వీళ్ల తప్పుడు ప్రచారాలకు సమాధానం చెప్పింది. వీళ్లకు సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు.. వీళ్లకు బ్యారేజ్ గేట్లు ఎప్పుడు దించుతారో కూడా తెలియదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయటానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలిపారు.

ఇంత మంచి ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇంజనీర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కాళేశ్వరం ఫెయిల్ అయితే అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎలా వస్తున్నాయి. ఇది మూర్ఖ మనస్తత్వం ఉన్న ప్రభుత్వం. నీళ్ల విషయంలో కేసీఆర్‌కు పేరు వస్తదనే ఇలా చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి చేతగానితనం కారణంగానే వారం రోజుల పాటు ఈ అంశాన్ని దాచిపెట్టారు. ఒకవేళ ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియకపోతే ముఖ్యమంత్రిగా పరిపాలన మీద ఆయనకు ఎంత పట్టు ఉన్నట్లు? అని కేటీఆర్ ప్రశ్నించారు.