mt_logo

మూసీ సుందరీకరణకు రూ. 1.5 లక్షల కోట్లు ఉన్నాయి.. రైతు భరోసాకు పైసలు లేవా?: కేటీఆర్

క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే రైతు భరోసా ఇస్తామంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన ప్రకటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తన ప్రకటన ద్వారా వర్షాకాలం సీజన్ రైతు భరోసాను ఎగ్గొట్టినట్లేనని చెప్పారన్నారు.

ఇది ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమేనని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు నిరసనగా ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రైతు బంధు ను పూర్తిగా ఎత్తి వేసే కుట్రలో భాగంగానే రైతు భరోసా పేరుతో కేబినెట్ సబ్ కమిటీ, కొత్త గైడ్ లైన్స్ అంటూ డ్రామా చేస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు చేస్తున్న అన్యాయాన్ని బీఆర్ఎస్ సహించదన్నారు. రేవంత్ రెడ్డి కుట్రలకు బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులకు తెలిసేలా చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం చెబుతుందని ఎన్నికలకు ముందే కేసీఆర్ చెప్పారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందన్నారు. వానాకాలం పంట సీజన్‌ కు రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి.. లక్షలాది మంది రైతుల నోట్లో రేవంత్ రెడ్డి మట్టి కొట్టాడని మండిపడ్డారు.

రైతు భరోసా ఇచ్చేందుకు పైసలు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ కాలయాపన చేశారని.. చివరకు చేతులేత్తేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోన్న కాంగ్రెస్ సర్కార్‌కు రైతుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.

పేదల కడపు కొట్టి రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేసేందుకు డబ్బులున్నాయి గానీ రైతులకు రూ. 15 వేల కోట్లు ఇచ్చేందుకు పైసలు లేవా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పదివేలు ముష్టి వేస్తున్నాడు.. మేము రూ. 15 వేలు ఇస్తామన్న సిఫాయి ఇప్పుడు ఎక్కడ అంటూ కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డి రైతుల వద్దకు వెళ్తే ఆయన వీపు చింతపండు అవటం ఖాయమన్నారు.

పచ్చి అబద్దాలు, మోసాలతో రైతులను కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ, రైతు భరోసా పేరుతో ఎకరానికి ఏటా రూ. 15 వేలు, రైతు కూలీలకు, కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం, ధాన్యానికి రూ. 500 బోనస్ అని బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు.

మీ దగాకోరు మాటలు నమ్మిన రైతులను ఇప్పుడు అరిగోస పెడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రుణమాఫీ పేరుతోనూ రైతులను చేసిన మోసం చాలదన్నట్లు.. ఇప్పుడు రైతు భరోసా విషయంలోనూ దగా చేస్తున్నారన్నారు. రైతులతో చెలగాటమాడుతున్న రేవంత్ సర్కార్ అన్నదాతల ఆగ్రహానికి మాడి మసై పోవటం ఖాయమని హెచ్చరించారు.

ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇస్తామన్న వానాకాలం రైతు భరోసా ఇవ్వాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ ముట్టడిస్తామని హెచ్చరించారు.