mt_logo

అహంకారం, కండకావరంతో మాట్లాడిన రేవంత్‌కి ఆడబిడ్డల ఉసురు తాకుతది: కేటీఆర్

శాసనసభలో బీఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు అవమానించటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అకారణంగా, అసభ్యంగా, హీనాతిహీనంగా మా ఆడబిడ్డలిద్దరినీ సీఎం గారు అవమానించారు అని పేర్కొన్నారు.

ఏ నాయకుడు, ఏ మనిషి కూడా మాట్లాడని విధంగా నికృష్టంగా నోరు జారాడు. మీ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్టాండ్ అని మాట్లాడిన మాటకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఈ అవమానం ఒక్క సబితక్క, సునీతక్కకు, లక్ష్మమ్మకు మాత్రమే కాదు. మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకే అవమానం అని విచారణ వ్యక్తం చేశారు.

మహిళలను, మహిళ తల్లులను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందన్నట్లుగా మాట్లాడటం హేయం. ముఖ్యమంత్రి అన్‌ఫిట్ సీఎం.. ఆ కూర్చీకి తగని ముఖ్యమంత్రి.. ఆయన పదవి స్థాయికి తగని మాట.. సంస్కారం ఉన్నవాళ్లు నోరు జారిన సరే మాటను వెనక్కి తీసుకుంటారు అని అన్నారు.

ఇంత అహంకారం, కండకావరంతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డికి ఆడబిడ్డల ఉసురు తాకుతది. మీరు అవమానించిన మహిళలు ఎంతో కష్టపడి రాజకీయాల్లో సక్సెస్ అయిన వారు. నీలాగా ఇష్టమొచ్చినట్లు రాజకీయ విన్యాసాలు చేస్తూ రాజకీయాల్లోకి రాలేదు అని దుయ్యబట్టారు.

స్వశక్తితో వాళ్ల కుటుంబాలకు ఉన్న ఆదరణతో రాజకీయాల్లో రాణిస్తున్నారు. అలాంటి మహిళలను పట్టుకోని నోటికి వచ్చినట్లు వాగడం సీఎంకు తగదు..ఇప్పటికైనా సిగ్గు, బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి ఇట్లా ఉంటే.. ఉప ముఖ్యమంత్రి ఏ మొఖం పెట్టుకొని వచ్చినవ్ అంటారు. ఏ మొఖం పెట్టుకొని నువ్వు వచ్చినవో మేము కూడా అదే విధంగా వచ్చాం. మా ఆడబిడ్డలకు పట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి ఉప ముఖ్యమంత్రి నీకు ఎంత గుండె ధైర్యం నీకు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి మీకు అధికారం ఇచ్చారా.. పదేళ్లు మేము అధికారంలో ఉన్నాం. ఎప్పుడైనా ఈ విధంగా మహిళలను అవమానించామా అని కేటీఆర్ అడిగారు.

ఈరోజు నేను సీఎం గారిని ఏకవాచనం మాట్లాడితే వెంటనే సరిచేసుకున్నా.. అది కేసీఆర్ గారు మాకు నేర్పిన సంస్కారం. తెలంగాణ ఆడబిడ్డలు అన్ని గమనిస్తున్నారు. ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతో విసిగిపోయి ఉన్నారు. ఇది తెలంగాణ ఆడబిడ్డలందరికీ జరిగిన అవమానం.. వాళ్ల ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతది అని అన్నారు.

ఇకనైనా సిగ్గు, బుద్ధి, జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు.. లేదంటే ఇంతకు ఇంత అనుభవిస్తావు. నోటికి వచ్చినట్లు మాటాడిన ఉపముఖ్యమంత్రి కూడా ఇకనైనా సంయమనంగా వ్యహరించాలి.. లేదంటే ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు.