mt_logo

ఎవరెన్ని కుతంత్రాలు చేసినా కాళేశ్వరమే తెలంగాణ కల్పతరువు: కేటీఆర్

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి.. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయి.. కానీ.. కేసీఆర్ గారి సమున్నత సంకల్పం..జై కొడుతోంది.. జల హారతి పడుతోంది. లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో లక్షకోట్లు వృధా చేశారనే విమర్శలే గల్లంతయ్యాయి.. కానీ.. మేడిగడ్డ బ్యారేజీ మాత్రం మొక్కవోని దీక్షతో నిలబడింది.. కొండంత బలాన్ని చాటిచెబుతోంది అని కొనియాడారు.

ఎవరెన్ని కుతంత్రాలు చేసినా.. దశాబ్దాలుగా దగాపడ్డ ఈ తెలంగాణ నేలకు.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే మేటిగడ్డ. కాళేశ్వరమే కరువును పారదోలే కల్పతరువు అని అభిప్రాయపడ్డారు.

బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన ఈ మానవ నిర్మిత అద్భుతానికి.. కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం పక్షాన మరోసారి సెల్యూట్ చేస్తున్నాను అని కేటీఆర్ అన్నారు.