mt_logo

రేవంత్ అల్లుడి కంపెనీ కోసమే కొడంగల్‌లో ఫార్మా చిచ్చు: కేటీఆర్

కొడంగల్‌‌లో ప్రజల తిరుగుబాటు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, రాష్ట్రంలో భూసేకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దురాగతాలపై తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెన్స్ రంగంలో మన హైదరాబాద్‌లో ఐడీపీఎల్‌ను అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఐడీపీఎల్ సంస్థ ఎంతో మందికి గొప్ప వాళ్లను తయారు చేసింది. రెడ్డి ల్యాబ్ ఓనర్ సహా చాలా మంది ఐడీపీఎల్ నుంచి వచ్చారు అని అన్నారు.

40 శాతం భారత దేశంలో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి హైదరాబాద్‌లోనే జరుగుతుందని గర్వంగా చెబుతున్నా. కరోనా సమయంలో పారాసిటామల్ టాబ్లెట్స్ కావాలని అమెరికా అధ్యక్షుడు కూడా అడిగారు. హైదరాబాద్ ఫార్మాస్యూటికల్ రంగంలో లీడర్‌గా తయారైంది. దాన్ని మరింత పెంచాలని కేసీఆర్ గారు నిర్ణయించారు అని తెలిపారు.

అదే విధంగా తెలంగాణను ఫార్మా రంగంలో రారాజు చేసేందుకు కేసీఆర్ గారు ఎంతో ముందుచూపుతో ఫార్మాసిటీ ప్లాన్ చేశారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే మనం పంచాయితీలు పెట్టుకోకుండా తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాలని కేసీఆర్ గారు మాకు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే చైనాలో జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సమావేశానికి కేసీఆర్ గారు వెళ్లారు. చైనా ప్రపంచానికి తయారీ రంగంలో లీడర్ ఎట్ల అయిందని కేసీఆర్ గారు రెండు రోజులు అక్కడే ఉండి పరిశీలించారు అని గుర్తు చేశారు.

ఒకే చోట 70 వేల ఎకరాల తయారీ రంగం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి ఎందుకు అక్కడ ఆ విధంగా ఏర్పాటు చేశారో తెలుసుకున్నారు.స్కేల్ ఆఫ్ ఎకానమీ ఉండే విధంగా అన్ని సంస్థలు ఒకే దగ్గర ఉండే విధంగా చేస్తే ప్రయోజనం ఉంటుందని చైనా వాళ్లు కేసీఆర్ గారికి చెప్పారు. దీంతో హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఫార్మా పారిశ్రామిక వేత్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. వాళ్లు కూడా ఒకే చోట ఫార్మా కంపెనీలు పెట్టాలని కోరారు అని అన్నారు.

దీంతో కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో వ్యవహరించారు. ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెట్టి అక్కడ నివాసాలు రాకుండా, 50 ఏళ్ల పాటు ఎలాంటి సమస్య లేకుండా ఫార్మా సిటీని డిజైన్ చేశారు. మూడు హెలికాప్టర్లలో పారిశ్రామిక వేత్తలను తీసుకెళ్లి ముచ్చర్లలో ఫార్మా సిటీకి ప్లాన్ చేశారు. దాదాపు 8 ఏళ్లు కష్టపడి దాదాపు 14 వేల ఎకరాలను మేము సేకరించాం. అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టారు. ఫార్మా సిటీ వస్తే మీ ప్రాంతం కాలుష్యం అవుతుందని వాళ్లను రెచ్చగొట్టారు అని పేర్కొన్నారు.

కానీ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తుగ్లక్ మాదిరిగా ఏం తెలుసుకోకుండా ఫార్మా సిటీ రద్దు అన్నారు. ఫార్మాసిటీ రద్దు అని చెప్పగానే భూములు ఇచ్చిన రైతులు సంతోష పడ్డారు. ఎందుకంటే వాళ్ల భూములు వాళ్లకు ఇస్తామని చెప్పారు కనుక భూములు ఇస్తారని రైతులు ఆశపడ్డారు. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఫార్మా సిటీ రద్దు కాదు.. మళ్లీ మేము ఫార్మా విలేజ్ పెడతామని చెప్పారు. కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ఫార్మా సిటీ పేరును ఫార్మా విలేజ్‌గా మార్చారు అని దుయ్యబట్టారు.

ఫార్మా రంగాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో, అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ తేవాలని మేము 14 వేల ఎకరాలు సేకరించాం. మాకు ఏదో తెలియకుండా ఇదంతా చేయలేదు. తెలంగాణను ఫార్మా రంగంలో లీడర్ చేయాలని భావించాం. ఫార్మా సిటీని ప్రపంచంలో ఉన్నంతగా తీర్చిదిద్దేందుకు అధికారులు విదేశాల్లో కూడా పర్యటన చేశారు. ఐతే మొన్నటి ఎన్నికల తర్వాత ఫార్మా సిటీ పూర్తిగా చేద్దామని భావించారు. అదే విధంగా భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాం. అలాంటి ఫార్మా సిటీని వదిలి.. ఈ ముఖ్యమంత్రి తుగ్లక్, మూర్ఖ నిర్ణయాలు తీసుకున్నాడు అని కేటీఆర్ విమర్శించారు.

దాని కారణంగానే ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజల తిరుగుబాటులో ఎవరి కుట్ర లేదు.కొడంగల్‌లో ఫార్మా విలేజ్ విషయంలో ఆరు నెలల నుంచే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి సోదరుడు తన్ని తీసుకుంటామని రైతులను బెదిరించిన ఆడియో ఉంది ఫార్మా విలేజ్ వద్దని కొడంగల్ రైతులు సీఎంను, మమ్మల్ని, బీజేపీ వాళ్లను కూడా కలిశారు. కొడంగల్ రగలుతుండటానికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాలోచిత నిర్ణయాలే కారణం అని మండిపడ్డారు.

రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన చందంగా ఉంది ఈ ప్రభుత్వం తీరు. సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్ట్ అవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లాడు.జాతీయ కాంగ్రెస్ నేతలకు తాబేదారుగా వ్యవహరిస్తూ ఇక్కడ పాలన గాలికి వదిలేశాడు అని ధ్వజమెత్తారు.

పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదు కిడ్నాప్ చేశారు. ఆయనేమైనా బందిపోటా? భూసేకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, పేద బీసీల భూములను రేవంత్ రెడ్డి తన అనుచరులు, కుటుంబ సభ్యులకు ఇచ్చి రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నెట్ బంద్ పెట్టారు. అసలు ఇంటర్నెట్ బంద్ చేయటానికి వీలు లేదు. ఏ విధంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. రైతులను లాక్కొని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు అని ఫైర్ అయ్యారు.

ఇంట్లో వేడుకలు, కార్యక్రమాలు ఉన్నప్పటికీ రైతులను అరెస్ట్ చేసి వాళ్లను ఇబ్బంది పెట్టారు. ఇది పేదలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం. ఇది ఊరికే నేను చెప్పటం లేదు. రేవంత్ రెడ్డి అల్లుడుకు చెందిన మ్యాక్స్ బీఎన్ కంపెనీ విస్తరణ కోసమే రైతుల భూములను తీసుకుంటున్నారు. అన్నం శరత్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన మెడికవర్ హాస్పిటల్ ఓనర్.మెడికవర్ హాస్పిటల్ ఓనర్ అన్నం శరతే. ఆయన అల్లుడు, రేవంత్ రెడ్డి అల్లుడు ఇద్దరు ఒకే సంస్థలో డైరెక్టర్లు. వాళ్ల ఇద్దరి కోసమే ఫార్మా విలేజ్ పేరుతో అక్రమాలు చేసేందుకు ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడు అని ఆరోపించారు. బెంగళూరులోనూ మెడికవర్ హాస్పిటల్‌ను అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రారంభించారు అని తెలిపారు.

కొడంగల్‌లో సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త 7 ఎకరాల భూమి పోతోంది. విలువైన భూమి పోతదంటే అడగటం తప్పా? సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ అభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు రైతుల బాధలను ఆయనకు చెప్పాడు. ఎక్కడ కూడా దాడి చేయలేదు. సురేష్ దాడికి పాల్పడినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? సురేష్ అసలు దాడే చేయలేదు. కడుపు మండి తన భూమి గురించి అడిగాడు కలెక్టర్‌కు అక్కడి రైతుల సమస్యను వివరించాడు అని కేటీఆర్ అన్నారు.

మా పార్టీ నాయకులు మా వారితో మాట్లాడితే అది కూడా తప్పా? దానికి కేసులు పెడతారా? ప్రశ్నించే గొంతుక అనే కదా నువ్వు కూడా గెలిచింది. మరీ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించే వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. రైతులు తమ భూములు కాపాడాలని కోరుతూ అందరినీ కలిశారు. ముఖ్యమంత్రి బిజీగా ఉండటంతో ఆయన సోదరుడిని కూడా కలిశారు. నీ ఆనాలోచిత విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అని అడిగారు.

సురేష్ నాతో వచ్చి కలవటమే తప్పు అయితే రాహుల్ గాంధీ వ్యతిరేకించే అదానీతో రేవంత్ రెడ్డి రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. మరి దానికి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలి కదా? సురేష్ ఏం తప్పు చేశాడు. మన నాయకులతో మాట్లాడటమే తప్పా? ఆయన భూమి పోతుంటే మాట్లాడకూడదా.. మీ ఆనాలోచిత నిర్ణయాలను మానుకోండి. ఫార్మా విలేజ్‌ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.

ఫార్మా సిటీ విషయంలో వీళ్లు హైకోర్టును కూడా మోసం చేస్తున్నారు. బయట ఫార్మా సిటీ రద్దు అంటున్నారు. కోర్టులో మాత్రం ఫార్మా సిటీ ఉందని చెబుతున్నారు. ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములను వేరే అవసరాలకు వాడటానికి వీలు లేదు. ఫార్మా సిటీ పేరుతో ఫోర్త్ సిటీ, స్కిల్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. అవసరం లేని చోట కూడా భూములు కొని రోడ్లు వేస్తూ ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి భరతం పట్టే పనిని కొడంగల్ నుంచే మొదలు పెడతాం. మా పార్టీ వాళ్లందరం కొడంగల్ వెళ్తాం అని స్పష్టం చేశారు.

పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి. ఆయననేమైనా టెర్రరిస్టా? నరేందర్ రెడ్డి భార్యకు పోలీసులు సమాధానం చెప్పాలి. కోర్టులో ఈ దుర్మార్గాలపై పోరాటం చేస్తాం. రైతులకు అండగా ఉంటాం. ఫార్మా విలేజ్ అనే నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేసుకోవాలి. అరెస్ట్ చేసిన రైతులు నడవలేకపోతున్నారు. వాళ్లను పోలీసులు కొట్టారు. వాళ్లను చిత్రహింసలు పెడుతున్నారు. వాళ్లకు మెడికల్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది అని అన్నారు.

మఫ్టీలో ఉండి పది మంది గుండాల మాదిరిగా మా నాయకున్ని ఎత్తుకు వెళ్తే అది అరెస్టా? లేదంటే కిడ్నాపా? అని ప్రశ్నించారు..

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కంపెనీల బాగోతాన్ని ధారావాహిక మాదిరిగా బయటపెడుతూనే ఉంటాం. ఫార్మా విలేజ్ పేరుతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసే నిర్ణయాన్ని మానుకోండి. ఫార్మా సిటీ కోసం రైతులు ఇచ్చిన భూమిని వారికి తిరిగి ఇస్తామని మాట ఇచ్చారు. ఎప్పుడు ఇస్తారో తేదీ చెప్పండి అని డిమాండ్ చేశారు.

ఈ తుగ్లక్ ప్రభుత్వం నిర్ణయం కారణంగా అధికారులు బలి అవుతున్నారు. ప్రభుత్వం కుట్రలో అధికారులు బలి కావద్దని కోరుతున్నా.. కొడంగల్‌లో రైతులతో భూసేకరణ పంచాయితీ వచ్చినప్పుడు పిలిచి మాట్లాడని కుసంస్కార ప్రభుత్వం ఇది. మా ప్రభుత్వంలో కూడా భూ సేకరణ సమస్యలు వస్తే రైతులను మెప్పించి ఒప్పించి, వాళ్ల కడుపులో తల పెట్టి మేము మంచి పరిహారం ఇచ్చాం. మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాం అని గుర్తు చేశారు.

కానీ ఈ ముఖ్యమంత్రికి 9 నెలలుగా కొడంగల్‌లో ఆందోళన చేస్తున్న రైతులను కలిసే సమయం లేదు. కలెక్టరే స్వయంగా దాడి జరగలేదని చెబుతున్నాడు. ఐజీ మాత్రం దాడి జరిగిందంటున్నారు. కానీ ఇది ఇంటలిజెన్స్ వైఫల్యం. దాడి జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ ఏదీ? ఉద్దేశపూర్వకంగా గొడవ సృష్టించి రైతులు భూసేకరణకు సహకరించటం లేదని భూములను గుంజుకునే కుట్ర చేస్తున్నారు అని విమర్శించారు.

సురేష్ భూమి పోతుంటే ఆయన నన్ను వచ్చి కలిస్తే నా పై కేసు పెడుతారా? ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగ్‌ల ఫార్మూలా మాత్రమే తెలుసు. ఈయనకు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటో తెలుసా? 11 నెలలుగా రోజుకో కుంభకోణం పేరుతో టైమ్‌పాస్ ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీడియా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని పేర్కొన్నారు.

మేము తప్పకుండా లగచర్ల రైతులకు అండగా ఉంటాం. ఆ ప్రాంతానికి మా పార్టీ నాయకులం వెళ్తాం. పీడిత, గిరిజన రైతులకు మేము ఖచ్చితంగా అండగా నిలబడతాం. లంబాడా హక్కుల సమితి వాళ్లను కూడా కలిసి వాళ్లతో పోరాటం చేస్తాం అని తెలిపారు.

భూ సేకరణ పేరుతో రేవంత్ రెడ్డి కుటుంబం చేస్తున్న దోపిడీ ప్రజల ముందు పెడతాం. ఫార్ములా ఈ-రేస్ విషయంలో ఏమైనా చేసుకోండి. కేసు పెడితే పెట్టుకోమని చాలా సార్లు చెప్పాను. నేను ఢిల్లీకి వెళితే బీజేపీతో కాళ్ల బేరానికి వెళ్లినట్లా? మరీ బీజేపీకే చెందిన గవర్నర్‌ను రేవంత్ రెడ్డి కలిస్తే అది కాళ్ల బేరానికి వెళ్లినట్లు కాదా? అని అడిగారు.

అదానీ కాళ్లు పట్టుకొని పొంగులేటి తన మీద ఈడీ కేసు కాకుండా చూసుకున్నాడా లేదా చెప్పండి.నేను మలేషియా వెళ్లకుండానే వెళ్లినట్లు మీడియా వాళ్లు ఎలా రాస్తారు. నేను ఢిల్లీకి వెళ్లింది అనుముల కుటుంబ కుంభకోణాలు బయటపెట్టేందుకే.. మళ్లీ కూడా కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటా అని అన్నారు.