గురుకుల పాఠశాలల్లో సమస్యలపై ప్రభుత్వం మొత్తానికి స్పందించటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత 8 నెలల కాలంలో విషాహారం కారణంగా దాదాపు 500 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. నిన్న కూడా సంగారెడ్డి జిల్లాలోని బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థుల భోజనానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ నిన్న ప్రభుత్వాన్ని కోరారు. ఐతే తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌లు జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ పాఠశాలలను సందర్శించనున్నారు.
ఐతే మంత్రులు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల భోజనం సహా ఇతర అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కేటీఆర్ కోరారు. మొన్నటి వరకు కూడా అంతా బాగానే ఉందన్నట్లు మొద్దునిద్రలో ఉన్న సర్కార్‌ను మేల్కొనే చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన వెయ్యి గురుకులాల్లో విద్యా, భోజనం, వసతులు బాగుండేలా కృషి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ మంత్రులను కోరారు.