కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నంలో.. విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా? వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు? అని ధ్వజమెత్తారు.
విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా?
నిమ్స్‌లో పేద పిల్లల హాహాకారాలు వినిపించడం లేదా? పది రోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమై.. పేదల పిల్లలు గోడుగోడునా ఏడుస్తుంటే.. కనీసం సమీక్ష అయినా నిర్వహించావా? అని ప్రశ్నించారు.
విద్యాశాఖను అంటిపెట్టుకొని 11 నెలల్లో మీరు పీకిందేమిటి? ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులను అవస్థలకు గురి చేస్తిరి.. గురుకులాలకు తాళం పడేలా చేస్తిరి. ప్రాథమిక పాఠశాలలకు శీతాకాలంలోనే ఒంటిపూట పెడితిరి అని కేటీఆర్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ వచ్చింది.. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తోంది. మార్పుకు ఓటేసిన ఫలితంగా.. తెలంగాణను పాపం వెంటాడుతోంది అని విమర్శించారు.