mt_logo

స్వతంత్ర భారతంలోనే అతిపెద్ద మోసం.. కాంగ్రెస్ చేసిన రుణమాఫీ: కేటీఆర్

100% రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా నేను రాజకీయాలను వదిలేస్తా అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 60% మందికి ఎగ్గొట్టి ఏదో విధంగా రుణమాఫీ చేశామనే మోసం చేస్తున్నారు.. ఇదేదో మోసమని భావించే రాహుల్ గాంధీ రుణమాఫీ సభకు రాలేదు అని పేర్కొన్నారు

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. నువ్వు చేసిన రుణమాఫీ నిజమైతే.. నీ నియోజకవర్గం కొడంగల్‌కు మీడియాతో కలిసి వెళ్దాం..100% రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా నేను రాజకీయాలను వదిలేస్తా అని ఛాలెంజ్ చేశారు.

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ పచ్చిమోసాన్ని మేము ఎండగడతాం.. సీఎంకు దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలని ఛాలెంజ్ చేస్తున్నా. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే రేవంత్ రెడ్డిని ప్రజలు ఫుట్‌బాల్ ఆడుతారు. సగం కూడా రుణమాఫీ చేయకుండా మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ చేశామని చెబితే అది సంపూర్ణంగా దిగజారటమే అని మండిపడ్డారు.

రుణమాఫీ పచ్చి మోసం, పచ్చి దగా.. రైతులను మోసం చేసినందుకు సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలె. రేవంత్ రెడ్డి పిచ్చి, పిచ్చి మాటలు మానేయాలి.. నువ్వు రైతుల దగ్గరకు పోతే వాళ్లు నీతో చెడుగుడు ఆడుతారు. ఇంత దిగజారుడు ముఖ్యమంత్రి, దివాళా తీసిన ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు అని దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరిట శతాబ్దపు అతి పెద్ద జోక్‌గా దీన్ని చేసేశారు.. స్వతంత్ర భారతంలోనే అతి పెద్ద మోసం.. కాంగ్రెస్ చేసిన రుణమాఫీ. అన్నదాతలను నిండా ముంచిన రుణమాఫీ రైతులను మోసం చేసిన రేవంత్‌పైన చీటింగ్ కేసు పెట్టాలి. అర్హులైన వారిలో కనీసం సగం మందికి కూడా రుణమఫీ చేయలేదు అని విమర్శించారు.

డిసెంబర్ 9 నాడు ఒకే సంతకంతో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. కేసీఆర్ గారు చేసిన రుణమాఫీ పొందిన వాళ్లు కూడా రుణమాఫీకిి అర్హులని చెప్పారు. రెండు లక్షల రుణమాఫీ అన్నప్పుడు ఎంత అవుతుందని అందరూ లెక్క వేశారు. రూ. 40 వేల కోట్లు ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే ఎంత విషయమని రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం రూ. 2 లక్షల రుణమాఫీ కోసం రూ. 35 వేల కోట్లు కావాలని ఈనాడు పేపర్‌లో కూడా రాశారు. ఈ సీఎం రేవంత్ రెడ్డియే రుణమాఫీకి కోసం రూ. 40 వేల కోట్లు కావాలని చెప్పారు. ఆ తర్వాత లెక్క మారింది.. రూ. 31 వేల కోట్లకే రుణమాఫీ అని కేబినేట్ తీర్మానం చేసింది అని కేటీఆర్ గుర్తు చేశారు.

ఎన్నికలకు ముందు అందరూ రైతులకు రుణమాఫీ అని చెప్పారు.. ఎన్నికలకు ముందు అందరికి అన్ని అన్నారు.. ఎన్నికల తర్వాత కొందరికి కొన్నే అని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమకు రుణమాఫీ కాలేదని వాపోతున్నారు. రుణమాఫీలో చాలా మందికి నిబంధనల పేరుతో కటింగ్‌లు పెట్టారు.. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కటింగ్ మాస్టర్ అన్నట్లుగా మారిపోయింది అని ధ్వజమెత్తారు.

60% మందికి ఎగ్గొట్టి ఏదో విధంగా రుణమాఫీ చేశామనే మోసం చేస్తున్నారు.. 40% మాత్రమే రుణమాఫీ చేసి అతి పెద్ద దగా, మోసం చేశారు. రైతులు అధికారుల చుట్టు తిరిగేలా వారితో పరిహాసం ఆడారు. మళ్లీ సీఎంగారే రంకెలు వేస్తూ అబద్ధాలు చెబుతున్నాడు.. మార్పు, మార్పు అంటూ రైతన్నలను మోసం చేశారు అని పేర్కొన్నారు.

రూ. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ. 2,500, జాబ్ క్యాలెండర్, ఆటో అన్నలకు సాయం మోసం, వృద్ధులకు రూ. 4 వేలు మోసం.. మొత్తంగా రుణమాఫీయే అతి పెద్ద మోసం. రైతులకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ కడితినే మాఫీ చేస్తామంటూ రైతులకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం చేసిన తప్పుకు అడిగితే దానికి సమాధానం చెప్పలేదు అని అన్నారు.

బడ్జెట్‌లో రూ. 26 వేల కోట్లు అన్నారు.. క్యాబినెట్‌లో రుణమాఫీ కోసం రూ. 31 వేల కోట్లు అని చెప్పారు. కానీ నిన్నటి వరకు అయినవి రూ. 17, 934 కోట్లు మాత్రమే.. 22 లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. అయినా సరే మళ్లీ చిల్లర మాటలు, చిల్లర ప్రచారాలు చేస్తున్నది రేవంత్ రెడ్డి. మేము ఒక్కటే దఫాలో 35 లక్షల మంది రైతులకు రూ. 17 వేల కోట్లు అయ్యింది. మరి రూ. 2 లక్షల రుణమాఫీకి కూడా రూ. 17 వేల కోట్లే ఎలా అవుతుంది. ఈ ఒక్క అంశం చాలు రైతులను కాంగ్రెస్ ఎంత మోసం చేసిందో అని తెలపడానికి అని అన్నారు.

మేము రైతుబంధు, రుణమాఫీ కోసం దాదాపు రూ. లక్ష కోట్లు ఇచ్చాం… వానాకాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసాను ఎగ్గొట్టారు.. ఆగస్ట్ అయిన సరే ఇంకా ఇవ్వలేదు.. యాసంగిలో కూడా రైతుభరోసా ఇవ్వలేదు. అందుకే ఇది దగా, మోసం.. రైతులను తడి గుడ్డతో గొంతు కోసింది రేవంత్ రెడ్డి. మేము రైతులకు రూ. లక్ష కోట్లు ఇస్తే.. మీరు రూ. 17 వేల కోట్లే ఇచ్చింది. దీనికి చారాణా కోడికి బారాణా ప్రచారాలు.. పాత గోడకు కొత్త సున్నం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

రేవంత్ చేస్తున్న మోసాలకు గిన్నిస్ బుక్ వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.. నిన్న రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ఫుల్ ఫ్రస్ట్రేషన్‌తో రంకెలేశాడు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు దూసుకుపోతున్న బాధనా, భట్టి విక్రమార్క గారు ఎక్కువ తిరుగుతున్నాడని బాధనా? అధిష్టానం పట్టించుకుంటలేదని ఫ్రస్ట్రేషనా. లంకె బిందెలు, న్యూక్లియర్ చైన్, దిల్‌సుఖ్‌నగర్‌లో విమానం అంటాడు.. ఆయనకు ఖచ్చితంగా మానసిక పరిస్థితి ఏదో అయి ఉంటది అని అన్నారు.

గౌడన్నలను కల్లులో నీళ్లు ఎంత కలుపుతారో అంటాడు.. ప్రైవేట్ టీచర్లు ఫెయిలయ్యే వాళ్లు అంటాడు.మహిళలను కించపరుస్తాడు.. గురుకులాల భోజనం సరిగా ఉండదు.భాక్రానంగల్, విప్రో, ఇన్ఫోసిస్ సీఈవో అని ఏదేదో మాట్లాడుతూ మానసిక సంతులిత లేకుండా ప్రవర్తిస్తున్నాడు.. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దీని గురించి పరిశీలించాలి అని సూచించారు.

రుణమాఫీ అయ్యిందంటూ కొంతమంది చిల్లర గాళ్లు పోస్టర్లు పెట్టారు.. హరీష్ రావు గారు అడిగనట్లు అసలు రుణమాఫీ అయ్యిందా చెప్పండి. ఇప్పుడు అమరరాజా సహా చాలా సంస్థలు వెళ్లిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రే రాష్ట్రం దివాళా తీసిందని మాట్లాడితే మంచిది కాదని నేను అసెంబ్లీలోనే చెప్పాను. డిప్యూటీ సీఎం, సీఎం ఇలా మాట్లాడితే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది అని హెచ్చరించారు.

మహిళలకు ఒక్క తులం బంగారం ఇవ్వలేదు.. కానీ 8 నెలల్లోనే 19 సార్లు ఢిల్లీకి పోయాడు.. ఇంకా ఎన్నిసార్లు పోతాడో. 46% మంది రైతులకే రుణమాఫీ చేశారు.. ఇది ఏ రకమైనా లెక్కనో చెప్పాలి. మహబూబ్‌నగర్ జిల్లాలో లక్షా 72 వేల మందికి పైగా రుణాలు ఉంటే 71 వేల మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది. ఖమ్మం జిల్లాలో 3,73,157 రైతులు రుణమాఫీ తీసుకుంటే మూడు విడతల్లో లక్షా 16 వేల మంది రైతులకు మాఫీ జరిగింది. ఇదేదో మోసమని భావించే రాహుల్ గాంధీ రుణమాఫీ సభకు రాలేదు.. ఆయనకు డౌట్ ఉంది కాబట్టే తప్పించుకున్నాడు అని విమర్శించారు.

ఇంకా దీనికి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ రంకెలు వేస్తున్నాడు.. కానీ బీఆర్ఎస్ దీన్ని ఎండగడుతది.. బీఆర్ఎస్ ఎటు పోదు.. మీరు ఆశలు పెట్టుకోవద్దు. మా పార్టీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలను పరిశీలించి రైతులకు కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రుణమాఫీ మొత్తం చేయకపోతే అవసరమైతే కోర్టుకు కూడా పోతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

మహిళలపై నేను యథాలాపంగా మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాను. రేవంత్ రెడ్డి గారికి అదే సంస్కారం ఉంటే మహిళ శాసన సభ్యులను విమర్శించిన దానికి క్షమాపణ చెబుతారా? ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పనితీరుపై అధ్యయనం చేసేందుకు సెప్టెంబర్‌లో నాతో సహా మా పార్టీ నేతలం వెళ్తాం అని తెలిపారు.

మాకు ఇదే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర.. గతంలో మేము ఉద్యమ పార్టీగా ఉన్నాం. ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అధ్యయనం చేసి కమిటీలు వేసి అవసరమైన మార్పులు చేస్తాం. మంచి ఎక్కడున్నా సరే మేము అన్ని పార్టీల నుంచి నేర్చుకుంటాం అని అన్నారు.