mt_logo

కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం ఏర్పడింది: కేటీఆర్

తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా తగ్గిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. కేసీఆర్ గారి పాలనలో సాగుకు స్వర్ణయుగం.. కానీ కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం ఏర్పడింది అని మండిపడ్డారు.

తెలంగాణలో సాగు విస్తీర్ణం ఒక్క ఏడాదిలోనే. 15.30 లక్షల ఎకరాల్లో తగ్గింది.. ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు ఇది తొలి ప్రమాద సంకేతం అని పేర్కొన్నారు

దశాబ్ద కాలంలోనే.. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో ఎనిమిది నెలల్లోనే ఎందుకింత వ్యవసాయ విధ్వంసం జరిగింది అని ప్రశ్నించారు. సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభం అని ఆవేదన వ్యక్తం చేశారు.

మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్.. నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్.. నేడు సాగయ్యే భూమి విస్తీర్ణం కట్. రుణమాఫీ అని మభ్యపెట్టి.. పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ అని కేటీఆర్ విమర్శించారు.

రూ. 500 బోనస్ అని నిలువునా మోసం చేసింది ఈ కాంగ్రెస్ వ్యవస్థ.. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నయ్.. కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు అని అన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి.. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు.. రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదు.. చెరువులకు మళ్లించే తెలివి లేదు ఆని దుయ్యబట్టారు.

ఒక్క మాటలో చెప్పాలంటే.. కాంగ్రెస్ పాలనలో.. రైతు బతుకుకు భరోసానే లేదు. బురద రాజకీయాలు తప్ప.. సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అసలే లేదు అని ధ్వజమెత్తారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులకు తిప్పలు, క్యూలైన్‌లో పాసుబుక్కులు, చెప్పులు, కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే, పగలూ రాత్రి తేడాలేకుండా పడిగాపులు, అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలు.. ఇలా ఒకటా, రెండా.. సాగు విస్తీర్ణం తగ్గడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని కేటీఆర్ ఆక్షేపించారు.